సాక్షి, విజయవాడ: ఏపీలో సచివాలయ ఉద్యోగుల ‘చలో విజయవాడ’ ఆందోళనపై పోలీసులు కేసులు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. విజయవాడలోని సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో 46 మంది, మాచవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో 24 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ పరిణామంతో సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగులు సెప్టెంబర్ 27న ‘చలో విజయవాడ’కు పిలుపునిచ్చారు. నిరసనకు అనుమతి లేదని పోలీసులు ముందుగానే ఉద్యోగులను ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విజయవాడకు వచ్చిన ఉద్యోగులను పోలీసులు పలు ప్రాంతాల్లో అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలోనే సుమారు 600 మంది ఉద్యోగులను వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించినట్లు ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి.
కేసులు.. అరెస్టులు..
సత్యనారాయణపురం, మాచవరం పోలీస్‌స్టేషన్ల పరిధిలో నమోదైన కేసుల్లో BNSS సెక్షన్ 170 ప్రయోగించారు. ఈ సెక్షన్ ప్రకారం ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా, మేజిస్టేట్ అనుమతి లేకుండా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులను అరెస్ట్ చేస్తారంటూ ప్రభుత్వం లీకులు ఇస్తోంది. పోలీసులు అరెస్టులకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వ చర్యలు భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. కేసుల పేరుతో ఉద్యోగుల పట్ల కూటమి సర్కార్ కఠినంగా ప్రవర్తిస్తోంది. అంతేకాకుండా. నిరసనల్లో పాల్గొన్న 45మందిని సస్పెండ్ చేయాలని కూడా చూస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారంటూ చర్యలకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి: ‘డబ్బులిస్తాం.. డప్పుకొట్టండి’


