సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పాలసీ విడుదల చేసిన ప్రభుత్వం
ప్రచార యావకు రూ.వందల కోట్ల ప్రజాధనం వెచ్చింపునకు బరితెగింపు
తమకు కావాల్సిన ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముందే మాట్లాడుకున్న పెద్దలు
ఏప్రిల్, మే నెలల్లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో వారితో సమావేశం
ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా ఇన్‌ఫ్లుయెన్సర్ల వర్గీకరణ
ఏ–కేటగిరీ: లక్ష ఫాలోవర్స్ పైగా
బీ–కేటగిరీ: 50,000 – 99,999
సీ–కేటగిరీ: 25,000 – 49,999
డీ–కేటగిరీ: 10,000 – 24,999
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు ప్రచార యావతార స్థాయికి చేరింది. ప్రజలేమనుకుంటారన్న జంకు ఏమాత్రం లేకుండా నిస్సిగ్గుగా తన డప్పు కొట్టించుకోవడానికి ప్రజా ధనాన్ని దోచి పెట్టేందుకు బరితెగించడం విస్తుగొలుపుతోంది. ఒక పక్క డబ్బుల్లేవంటూనే మరో పక్క భారీ ఎత్తున దుబారా వ్యయాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ప్రభుత్వ ఖజానా నుంచి భారీగా దోచి పెట్టేందుకు ఏకంగా పాలసీ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులిస్తామని.. తమకు డప్పు కొట్టండంటూ చంద్రబాబు సర్కారు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు భారీ ఆఫర్ ఇచ్చింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పాలసీ తక్షణం అమల్లోకి వచ్చిందని సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) ముఖ్య కారదర్శి జె.శ్యామలరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ఎంప్యానెల్‌మెంట్ విధానాన్ని ప్రభుత్వం ఆమోదించిందని, ఇందుకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీడీసీఎల్) ఎండీకి ఉత్తర్వుల్లో సూచించారు. తమకు కావాల్సిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ప్రభుత్వ పెద్దలు ముందుగానే మాట్లాడుకున్నారు. ఇప్పటికే సమాచార శాఖ, ఏపీడీసీఎల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సోషల్ మీడియా కంటెంట్ సృష్టికర్తలతో ఏప్రిల్, మే నెలలో సమావేశాలను నిర్వహించింది. ఏప్రిల్ 17వ తేదీన నిర్వహించిన సమావేశంలో ఆఫ్‌లైన్‌లో 48 మంది, ఆన్‌లైన్‌లో 69 మంది ఇన్‌ఫ్లుయెన్సర్‌లు పాల్గొన్నారు. మే 19వ తేదీన నిర్వహించిన సమావేశంలో ప్రత్యేకంగా 10,000 పైన ఫాలోవర్లు ఉన్న కంటెంట్ క్రియేటర్‌లను చేర్చుకోవడంపై దృష్టి పెట్టారు. 
ఉత్తర్వుల్లోని కీలకాంశాలు
⇒ ప్రభుత్వ సమాచార ప్రసారాలను, ప్రజా చైతన్య ప్రచారాలను విస్తృతం చేయగల సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను గుర్తించడం, ధృవీకరించడం ఎంప్యానెల్ చేయడం.
⇒ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇతర అన్ని కార్యక్రమాలపై కంటెంట్‌ను చురుకుగా ప్రచారం చేయడం.. వ్యాప్తి చేయడం ఇందులో భాగం. ఆంధ్రప్రదేశ్ 28 జిల్లాలంతటా ఈ ప్రచారం కొనసాగుతుంది.
⇒ ఈ విధానం కింద చేసే ఖర్చులన్నింటి ఉద్దేశం ప్రామాణిక ప్రభుత్వ సమాచారాన్ని వ్యాప్తి
చేయడం.
⇒ ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తూ, అధికారిక ఏపీడీసీఎల్ ఎంప్యానెల్‌మెంట్ కోరుతున్న ఫేస్‌బుక్, ఇన్‌స్టా్రగామ్, యూట్యూబ్, ట్విటర్ (ఎక్స్)లోని సోషల్ మీడియా కంటెంట్ సృష్టికర్తలందరికీ ఇది వర్తిస్తుంది.
⇒ ప్రారంభ ఎంప్యానెల్‌మెంట్ ఏడాది కాలానికి ఉంటుంది. సంతృప్తికరమైన పనితీరు ఆధారంగా, అథారిటీ విచక్షణ మేరకు ఈ కాల పరిమితిని మరో రెండు సంవత్సరాల కాలానికి (ఒకసారికి ఒక సంవత్సరం చొప్పున) పొడిగించవచ్చు.
⇒ ప్రచురించే ప్రభుత్వ సంబంధిత కంటెంట్ నిష్పక్షపాతంగా, సమాచార యుక్తంగా, పక్షపాత రహితంగా ఉండేలా చూసుకోవాలి.
⇒ పాకిస్తానీ మూలం ఉన్న కంటెంట్, రక్షణ సంబంధిత కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారంపై ఉన్న పరిమితులతో సహా, భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సూచనలకు అనుగుణంగా ఉండాలి.
⇒ ఏపీడీసీఎల్ ధృవీకరించిన అధికారిక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గుర్తింపు కార్డు ఉండాలి.
⇒ సందర్భం, కార్యక్రమ అవసరాలను బట్టి ప్రభుత్వ కార్యక్రమాలకు, ఈవెంట్లకు ప్రవేశం.
⇒ పనితీరు రికార్డు, సానుకూల ప్రభుత్వ ప్రచారానికి చేసిన కృషి ఆధారంగా, డిపార్ట్‌మెంట్ చేపట్టే చెల్లింపు ద్రవ్య ప్రచారాలలో ప్రాధాన్యత.
⇒ గుర్తింపు పొందిన ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఈవెంట్‌కు ముందు ప్రవేశం, డ్రోన్ అనుమతుల కోసం ఎస్‌వోపీలు జారీ.
పారితోషికం ఇలా..
ఇన్‌ఫ్లుయెన్సర్లే రూపొందించిన ఆడియో, విజువల్స్ పోస్ట్ చేయడం.. అథారిటీ అందించిన ఆడియోృవిజువల్స్‌ను పోస్ట్ చేయడం.. అథారిటీ అందించిన గ్రాఫిక్స్‌ను పోస్ట్ చేయడం ఆధారంగా పారితోషికాన్ని ప్రకటించారు. లక్ష ఫాలోవర్స్ పైగా ఉంటే ఏ కేటగిరీ.. వీరు ఒక పోస్టు రూపొందించి పోస్టింగ్ చేస్తే రూ.15,000
⇒ 50 వేల నుంచి 99,999 ఫాలోవర్స్ ఉన్న బీ కేటగిరీ వారికి ఒక పోస్టింగ్‌కు రూ.7,500
⇒ 25 వేల నుంచి 49,999 ఫాలోవర్స్ ఉన్న సీ కేటగిరీ వారికి ఒకపోస్టింగ్‌కు రూ.5,000
⇒ 10 వేల నుంచి 24,999 ఫాలోవర్స్ ఉన్న డీ కేటగిరీ వారికి ఒక పోస్టింగ్‌కు రూ.2,500 అథారిటీ అందించిన గ్రాఫిక్స్‌ను పోస్ట్ చేస్తే ఏృకేటగిరీ వారికి రూ.1,500, బీ కేటగిరీకి రూ.1,000, సీ కేటగిరీకి రూ.750, డీ కేటగిరీ వారికి రూ.500 వరకు
⇒ అథారిటీ అందించిన ఆడియోృవిజువల్స్‌ను పోస్ట్ చేస్తే ఏృకేటగిరీ వారికి రూ.2,000, బీ కేటగిరీకి రూ.1,500, సీ కేటగిరీకి రూ.1,000, డీ కేటగిరీ వారికి రూ.750 వరకు


