సాక్షి,ముంబై : ముంబైలోని బాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ అత్తింటివారిపై ఆదాయపన్నుశాఖ దాడులు అలజడి రేపాయి. రకుల్ మామ, ప్రముఖ నిర్మాత వాషు భగ్నానీ, పనోరమా స్టూడియోస్‌తో సంబంధం ఉన్న పలు ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ (ఇన్‌కమ్ ట్యాక్స్) సోదాలు కొనసాగుతున్నాయి. సినిమా సంబంధిత నిధులలో జరిగిన అవకతవకలపై జరుగుతున్న విచారణ నేపథ్యంలో, సెప్టెంబర్ 28, సోమవారం ఈ ఆపరేషన్ మొదలైంది.
ముంబై ఆదాయపు పన్నుశాఖ నిర్వహిస్తున్న ఈ సోదాలు సినిమా ప్రాజెక్టులకు ఫైనాన్సింగ్ పేరుతో పంపినట్లు ఆరోపణలున్న డబ్బుకు సంబంధించిన ఆర్థిక అవకతవకలతో ముడిపడి ఉన్నట్టు తెలుస్తోంది. ముంబైలోని 12 ప్రదేశాలలో ఈదాడులు మొదలయ్యాయి. అయితే ఆరోపించబడిన లావాదేవీలు, ఇతర వివరాలు ఇప్పటివరకు వెల్లడి కాలేదు. భగ్నానీ కుటుంబం పూజా ఎంటర్‌టైన్‌మెంట్‌తో సంబంధం కలిగి ఉండగా, పనోరమా స్టూడియోస్ సంస్థను కుమార్ మంగత్ నిర్వహిస్తున్నారు. పనోరమా స్టూడియోస్ నిర్మించిన 'దృశ్యం: ది కన్క్లూజన్' చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది. ఈ సోదాలకు సంబంధించి ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరిగాయి, ఎంత మొత్తం అనే వివరాలను ఐటీ అధికారులు అధికారికంగా వెల్లడించలేదు. ఈ ఆరోపణలపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. తాజా దాడులపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: పెళ్లైన 5 నెలలకే టెకీ ఆత్మహత్య
నిధుల మళ్లింపు ఆరోపణలు
సినిమా ప్రాజెక్ట్‌ల ఫైనాన్సింగ్ పేరుతో నిధులను విదేశాలకు అక్రమంగా తరలిస్తున్నారనే (Funds routed abroad) అనుమానాలతో ముంబై ఐటీ శాఖ అధికారులు 12 ప్రాంతాల్లో ఈ సోదాలు చేపట్టారు. ఐటీ శాఖకు చెందిన పలు బృందాలు డాక్యుమెంట్లు, ఆర్థిక రికార్డులు మరియు విదేశీ లావాదేవీల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి.
ఇదీ చదవండి: యూనివర్శిటీ విద్యార్థిని మృతి, లవ్ జిహాద్ ఆరోపణలు కలకలం
రకుల్ సోదరుడి డ్రగ్స్ కేసు నేపథ్యం
రకుల్ ప్రీత్ సింగ్, వాషు భగ్నానీ కుమారుడైన నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లాడారు. కాగా గత ఏడాది డిసెంబర్ 19 న ముంబైలో జరిగిన ఓ డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్‌ప్రీత్ సింగ్ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఈగల్ ఫోర్స్, వెస్ట్ జోన్ పోలీసులు ఇద్దరు వ్యాపారులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి కొకైన్, ఎండీఎంఏ (MDMA) స్వాధీనం చేసుకున్నారు. అమన్‌ప్రీత్ ఆ డ్రగ్స్ పెడ్లర్ల నుంచి ఐదుసార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు అనుమానించారు.


