ఉజ్జయినిలో ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లదాడి | Ujjain Mosque Demolition Row Protesters Clash With Police | Sakshi
Sakshi News home page

ఉజ్జయినిలో ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లదాడి

Sep 28 2026 11:09 AM | Updated on Sep 28 2026 11:14 AM

Ujjain Mosque Demolition Row Protesters Clash With Police

ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్డు విస్తరణలో భాగంగా షాహీ మసీదులో కొంత భాగాన్ని తొలగించేందుకు అధికారులు చేపట్టిన చర్యలను వ్యతిరేకిస్తూ స్థానికులు, పలువురు ముస్లింలు ఆందోళనకు దిగారు. సోమవారం ఉదయం పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వినట్లు అధికారులు పేర్కొనగా, గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు టియర్‌గ్యాస్ ప్రయోగించారు.

రోడ్డు విస్తరణ కోసం..
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో సింహస్థ కుంభమేళా-2028 ఏర్పాట్లలో భాగంగా కాంతల్ చౌరాహా నుంచి గోపాల్ మందిర్ వరకు ఉన్న రహదారిని విస్తరించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. సుమారు 900 మీటర్ల మేర ఉన్న ఈ రహదారిని 15 మీటర్ల వెడల్పునకు పెంచాలని నిర్ణయించారు. ఈ రహదారి ప్రతిపాదిత మార్గంలో షాహీ మసీదులో కొంత భాగం ఉండటంతో దాన్ని తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

రాత్రంతా మసీదు వద్దే ఆందోళన
తొలగింపు చర్యలను అడ్డుకునేందుకు ఆదివారం రాత్రి వందలాది మంది మసీదు వద్దకు చేరుకున్నారు. కొందరు మసీదులోనే రాత్రంతా ఉన్నారు. అధికారులు జేసీబీ, ఇతర యంత్రాలతో అక్కడికి చేరుకున్నప్పటికీ భారీగా ప్రజలు గుమిగూడటంతో పనులు ముందుకు సాగలేదు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు భారీగా మోహరించారు.
 

2 వేల మంది పోలీసులతో భారీ భద్రత
సోమవారం ఉదయం అధికారులు మళ్లీ తొలగింపు ప్రక్రియను ప్రారంభించడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. సుమారు 2 వేల మంది పోలీసులను అక్కడ మోహరించినట్లు సమాచారం. మసీదు చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. దాదాపు 500 మీటర్ల పరిధిలో ప్రజల రాకపోకలను పరిమితం చేశారు. సీనియర్ పోలీసు, పరిపాలనా అధికారులు కూడా ఘటనాస్థలంలో ఉన్నారు.

ప్రత్యామ్నాయ మార్గం చూపాలని మసీదు కమిటీ డిమాండ్
రోడ్డు విస్తరణ కోసం మసీదు భాగాన్ని తొలగించకుండా ప్రత్యామ్నాయ మార్గంలో రహదారిని విస్తరించాలని మసీదు కమిటీ, ముస్లిం సమాజ ప్రతినిధులు కోరుతున్నారు. మసీదుకు ఎదురుగా ఉన్న నిర్మాణాలను తొలగించి రోడ్డు విస్తరించవచ్చని వారు సూచించారు. షాహీ మసీదు వక్ఫ్ ఆస్తిగా నమోదైందని, మతపరమైన నిర్మాణంగా దాన్ని రక్షించాలని వారు కోర్టును ఆశ్రయించారు.

హైకోర్టులో పిటిషన్లు.. డివిజన్ బెంచ్‌కు అప్పీల్
మసీదు తొలగింపును సవాలు చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లను సెప్టెంబర్ 9న మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ కొట్టివేసింది. చట్టపరమైన ప్రక్రియను అధికారులు పాటించారని, తొలగింపు రాజ్యాంగంలోని 14, 25, 26, 300ఏ అధికరణలను ఉల్లంఘించదని కోర్టు పేర్కొంది. సింహస్థ కుంభమేళా సమయంలో ట్రాఫిక్ నిర్వహణకు రహదారి విస్తరణ అవసరమని కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అయితే మసీదు కమిటీ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement