రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు ఇప్పుడు భారత రైతుపై ప్రభావం చూపే పరిస్థితిని కల్పించాయి. యుద్ధాల కారణంగా చమురు, సహజవాయువు కేంద్రాలపై దాడులు పెరగడంతో సల్ఫర్ సరఫరా దెబ్బతింటోంది. మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలకు అవసరమైన నికెల్ ఉత్పత్తి కోసం సల్ఫ్యూరిక్ యాసిడ్‌కు డిమాండ్ భారీగా పెరిగింది. ఈ రెండు పరిణామాలు కలిసి సల్ఫర్ ధరలను ఏడాది వ్యవధిలో దాదాపు రెట్టింపు చేశాయి.
రైతు ఎరువులపై యుద్ధ ప్రభావం
ఈ ఏడాది ప్రారంభం నుంచి భారత్‌కు దిగుమతి అవుతున్న సల్ఫర్ ధర దాదాపు రెట్టింపై టన్నుకు 1,050–1,100 డాలర్లకు చేరింది. సరుకు ధర, సముద్ర రవాణా ఖర్చులు కలిపిన ధర ఇది. సల్ఫర్ కొరత, అధిక ధరలు , కీలక ఎరువుల లభ్యతపై ప్రభావం చూపుతున్నాయి. యూరియా విషయంలో అవసరమైన దిగుమతులు చేపట్టడం ద్వారా భారత్ తాత్కాలికంగా ఆందోళనను తగ్గించుకున్నప్పటికీ, సల్ఫర్ ఇప్పుడు మరో కీలక సవాలుగా మారింది.
సల్ఫర్ ఎక్కడి నుంచి వస్తుంది?
ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే సల్ఫర్‌లో కేవలం 10 శాతం మాత్రమే నేరుగా గనుల నుంచి లభిస్తుంది. మిగిలిన దాంట్లో సుమారు 56 శాతం పెట్రోలియం శుద్ధి ప్రక్రియ నుంచి, మరో 34 శాతం సహజవాయువు ప్రాసెసింగ్ ద్వారా లభిస్తుంది. ముడి చమురు, గ్యాస్ నుంచి సల్ఫర్‌ను తొలగించడం పర్యావరణ నిబంధనల ప్రకారం అవసరం. ఈ ప్రక్రియను ‘డీసల్ఫరైజేషన్’ అంటారు. ఇందులో వెలువడే సల్ఫర్‌ను ఎరువుల తయారీలో ఉపయోగిస్తారు. అందువల్ల చమురు, గ్యాస్ మౌలిక వసతులపై దాడులు జరిగితే సల్ఫర్ సరఫరాపైనా ప్రభావం పడుతుంది.
సల్ఫర్ ఎందుకంత కీలకం?
ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 7 కోట్ల టన్నుల సల్ఫర్ వినియోగం జరుగుతోంది. అందులో సుమారు 60 శాతం ఎరువుల పరిశ్రమకే వెళ్తుంది. సల్ఫర్‌లో ఎక్కువ భాగాన్ని ముందుగా సల్ఫ్యూరిక్ యాసిడ్‌గా మారుస్తారు. ఫాస్ఫరస్ ఆధారిత ఎరువుల తయారీలో ఈ యాసిడ్ కీలకం. గనుల నుంచి లభించే రాక్ ఫాస్ఫేట్‌ను మొక్కలు గ్రహించగల రూపంలోకి మార్చడానికి సల్ఫ్యూరిక్ యాసిడ్ అవసరం. అందువల్ల సల్ఫర్ లేకపోతే డీఏపీ, ఎస్‌ఎస్‌పీ వంటి మిశ్రమ ఎరువుల తయారీకి ఆటంకాలు ఏర్పడతాయి.
ఒకప్పుడు వ్యర్థం.. ఇప్పుడు బంగారమైంది!
సల్ఫర్‌కు సంబంధించిన ధరల చరిత్ర కూడా ఆసక్తికరంగా ఉంది. భారత్ ఏటా సుమారు 38–39 లక్షల టన్నుల సల్ఫర్ వినియోగిస్తుండగా, అందులో 20–21 లక్షల టన్నులు ఎరువుల పరిశ్రమకు అవసరం. చమురు, గ్యాస్ పరిశ్రమలో ఇది ఉప ఉత్పత్తిగా లభించడం వల్ల గతంలో చాలా చౌకగా ఉండేది. ఒక దశలో టన్ను ధర 200 డాలర్ల కంటే తక్కువగా ఉండేది. 2019–20లో కొన్ని నెలల్లో 100 డాలర్ల కంటే కూడా దిగువకు వెళ్లింది. 2020లో జపాన్, దక్షిణ కొరియాలోని కొన్ని లోహ పరిశ్రమల నుంచి భారత్ టన్నుకు మైనస్ 20 డాలర్లకే సల్ఫర్ తెచ్చుకున్న సందర్భం కూడా ఉంది. అయితే 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ధరలు 400–500 డాలర్లకు చేరాయి. 2022 చివరి నుంచి 2025 ప్రారంభం వరకు మళ్లీ 200 డాలర్ల కంటే దిగువకు వచ్చినా, 2025 ఆగస్టు నుంచి పరిస్థితి మారింది. రష్యా చమురు శుద్ధి కేంద్రాలపై ఉక్రెయిన్ దాడులు పెరగడంతో డిసెంబర్ నాటికి ధర 500 డాలర్లను దాటింది. అనంతరం పశ్చిమాసియా ఘర్షణలతో మరింత పెరిగింది.
ఈవీ బ్యాటరీల డిమాండ్‌తో..
సల్ఫర్ ధర పెరగడానికి యుద్ధాలే ఏకైక కారణం కాదు. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలకు అవసరమైన నికెల్ ఉత్పత్తి కూడా దీనిపై ప్రభావం చూపుతోంది. నికెల్‌ను లేటరైట్ ఖనిజం నుంచి వెలికితీసి బ్యాటరీలకు అనువైన రూపంలోకి మార్చే ప్రక్రియలో సల్ఫ్యూరిక్ యాసిడ్‌ను భారీగా ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియలో ఏర్పడే ఎంహెచ్‌పీ(మిక్స్‌డ్ హైడ్రాక్సైడ్ ప్రెసిపిటేట్) ఈవీ బ్యాటరీల్లో ఉపయోగపడుతుంది. నికెల్ కోసం సల్ఫ్యూరిక్ యాసిడ్ డిమాండ్ 2021లో 35 లక్షల టన్నుల నుంచి 2025లో 1.5 కోట్ల టన్నులకు పైగా పెరిగింది. ఇందులో ఇండోనేషియా కీలక పాత్ర పోషిస్తోంది. అదే సమయంలో రష్యా ఎరువుల ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తూ సల్ఫర్, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎగుమతులను నిలిపివేయగా, చైనా కూడా సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎగుమతులపై ఆంక్షలు విధించింది.
భారత్‌కు ఎంత పెద్ద సవాలు?
భారత ఎరువుల కంపెనీలు దేశీయ చమురు శుద్ధి కేంద్రాల నుంచి కొంత సల్ఫర్‌ను పొందుతున్నప్పటికీ, అవసరాల్లో ఎక్కువ భాగం దిగుమతులపైనే ఆధారపడి ఉంది. ఇఫ్కో, కోరమాండల్ ఇంటర్నేషనల్, పారాదీప్ ఫాస్ఫేట్స్ వంటి సంస్థలకు సమీకృత తయారీ కేంద్రాలు ఉన్నాయి. ఇవి సల్ఫర్, రాక్ ఫాస్ఫేట్‌ను దిగుమతి చేసుకుని సల్ఫ్యూరిక్ యాసిడ్, ఫాస్ఫారిక్ యాసిడ్ ద్వారా డీఏపీ, ఎస్‌ఎస్‌పీ వంటి ఎరువులను తయారు చేస్తాయి. ఒక టన్ను సల్ఫర్‌తో సుమారు 3 టన్నుల సల్ఫ్యూరిక్ యాసిడ్ తయారవుతుంది. భారత్‌కు 1.5–1.6 కోట్ల టన్నుల ఫాస్ఫేట్ ఎరువుల తయారీకి 43–45 లక్షల టన్నుల ఫాస్ఫారిక్ యాసిడ్ అవసరం కాగా, దేశీయ ఉత్పత్తి సామర్థ్యం సుమారు 22 లక్షల టన్నులే. జోర్డాన్, సెనెగల్, మొరాకోలో భాగస్వామ్యాల ద్వారా రాక్ ఫాస్ఫేట్ సరఫరాను కంపెనీలు సమకూర్చుకున్నప్పటికీ, సల్ఫర్ లేకుండా దాన్ని ఎరువుగా మార్చడం సాధ్యం కాదు.
ఇదీ చదవండి: నోయిడా నిరసనలు: చదువులు, ఉద్యోగాలకు దూరమైన ‘జెన్ జీ’


