‘మన్ కీ బాత్’లో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: ఉగ్రవాద భూతాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించే ప్రసక్తే లేదని, ఉగ్రవాదానికి మద్దతిచ్చే శక్తులను కఠినంగా అణచివేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. టెర్రరిజంపై ‘జీరో టాలరెన్స్’ విధానం అమలు చేస్తున్నామని ప్రకటించారు. ఉగ్రవాదం ఎక్కడ, ఏ రూపంలో ఉన్నాసరే సహించడానికి వీల్లేదని స్పష్టంచేశారు.
ఉగ్రవాద దాడుల వల్ల కలిగిన వేదనకు భారత్ ఇచ్చిన నిర్ణయాత్మక సమాధానమే ‘2016 నాటి సర్జికల్ దాడులు’ అని పునరుద్ఘాటించారు. భారతదేశ ఉగ్రవాద వ్యతిరేక విధానానికి అవి ఒక కొత్త ఉదాహరణగా నిలిచాయని, నూతన ప్రమాణాన్ని(బెంచ్‌మార్క్) నెలకొల్పాయని అన్నారు. ప్రధాని మోదీ ఆదివారం ‘మన్ కీ బాత్’లో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే...
మన లక్ష్యం ‘డ్రగ్స్ రహిత భారత్’
‘‘మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా మనం పోరాడుతున్నాం. నషా ముక్త్ యువ అభియాన్‌లో భాగంగా ఇటీవల లక్షలాది మంది యువత డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. డ్రగ్స్‌కు దూరంగా ఉంటామని, ఈ సందేశాన్ని ఇతరులకు చేరవేస్తామని హామీ ఇచ్చారు. డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో యువత చురుగ్గా పాలుపంచుకోవాలి. అక్టోబర్ 2న గాం«దీజీ జయంతిని నిర్వహించుకోబోతున్నాం.
అనేక మార్గదర్శక సూత్రాలను గాం«దీజీ అందించారు. నేను ఇటీవల అనేక స్ఫూర్తిదాయకమైన పరిశుభ్రతా కార్యక్రమాలను చూశా. మధ్యప్రదేశ్‌లో యువకులు నదిని శుభ్రం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో యువత వారసత్వ సంపదను పునరుద్ధరిండానికి సాయం అందిస్తున్నారు. పాత మెట్ల బావులను శుభ్రం చేస్తున్నారు’’ అని చెప్పారు.
అలాంటి వారు కనుమరుగైపోయారు
‘‘ఈ ఏడాది సోమ్‌నాథ్ స్వాభిమాన్ పర్వ్‌ను ఘనంగా నిర్వహించుకున్నాం. 1,000 ఏళ్ల క్రితం మహ్మద్ గజనీ సోమ్‌నాథ్ ఆలయాన్ని మొదటిసారిగా ధ్వంసం చేశాడు. సోమనాథ్‌ను నాశనం చేసి, భారతదేశ అస్థిత్వాన్ని తుడిచిపెట్టడానికి వచ్చిన వారు ఇప్పుడు కనుమరుగైపోయారు. కానీ, సోమ్‌నాథ్ ఆలయం మాత్రం సముద్ర తీరాన ఇప్పటికీ వైభవంగా నిలిచి ఉంది. విశ్వ హిందూ పరిషత్ నాయకుడు అశోక్ సింఘాల్ శత జయంతి సందర్భంగా ఆయనకు నివాళులరి్పస్తున్నా. ఆయన తన జీవితంలో తగినంత గుర్తింపునకు నోచుకోలేదు. రామమందిర ఉద్యమంతో పాటు సామాజిక వివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. లక్షలాది మంది ఆయన అభిమానుల తరఫున అశోక్ సింఘాల్‌కు నమస్కరిస్తున్నా’’ అని అన్నారు.


