చిక్కుల్లో సీఈసీ జ్ఞానేశ్‌ కూతురు! సీజేఐకి లాయర్ల సంఘం లేఖ | CEC Gyanesh Kumar Daughter Faces Scrutiny Over Supreme Court Case Listing, Lawyers Raise Questions On Hearing Transparency | Sakshi
Sakshi News home page

చిక్కుల్లో సీఈసీ జ్ఞానేశ్‌ కూతురు! సీజేఐకి లాయర్ల సంఘం లేఖ

Sep 26 2026 9:19 AM | Updated on Sep 26 2026 10:25 AM

CEC Gyanesh Kumars Daughter in Controversy Lawyers Write to CJI

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ చుట్టూ ఇప్పటికే వివాదం కొనసాగుతున్న వేళ.. ఆయన కుమార్తె మేధా రూపమ్‌ కూడా ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు. ఆమె దాఖలు చేసిన ఓ పిటిషన్‌ సుప్రీంకోర్టులో ఏ బెంచ్‌ ముందు, ఎలా లిస్ట్‌ అయిందన్న దానిపై లాయర్స్‌ అసోసియేషన్‌ ఫర్‌ కాన్‌స్టిట్యూషన్‌ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అంతేకాదు.. విచారణ మధ్యలో వర్చువల్‌ కోర్టు ఆడియోను మ్యూట్‌ చేయడంపైనా ప్రశ్నలు లేవనెత్తింది. ఈ అంశాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌కు సంఘం ఓ లేఖ రాసింది. 

ఈ వివాదం నోయిడాలో కార్మికుల ఆందోళనకు సంబంధించినది. ఏప్రిల్‌లో జరిగిన కార్మికుల నిరసన నేపథ్యంలో ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని, కార్యకర్త ఆకృతి చౌదరిని జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద నిర్బంధించారు. దీనిపై ఆమె అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించారు. సెప్టెంబర్‌ 2న విచారణ జరిపిన హైకోర్టు.. ఆకృతి చౌదరి నిర్బంధాన్ని రద్దు చేసింది. ఆమెకు రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని, ఆ మొత్తాన్ని నిర్బంధ ప్రక్రియలో భాగమైన అధికారుల జీతాల నుంచి వసూలు చేయాలని ఆదేశించింది. అందులో నోయిడా జిల్లా మేజిస్ట్రేట్‌(ఐఏఎస్‌) మేధా రూపమ్‌ కూడా ఉన్నారు. ఆమె సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ కూతురు. అంతేకాదు నోయిడాకు తొలి మహిళా మెజిస్ట్రేట్‌ కూడా.

హైకోర్టు తన తీర్పులో నోయిడా యంత్రాంగం వ్యవహరించిన తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎన్‌ఎస్‌ఏ వంటి కఠిన చట్టాన్ని ప్రయోగించే ముందు సంబంధిత రికార్డులను అధికారులు జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే మేధా రూపమ్‌ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

అక్కడే కొత్త ప్రశ్నలు
హైకోర్టు తీర్పులో తనపై చేసిన వ్యాఖ్యలు, రూ.5 లక్షల పరిహారాన్ని తన జీతం నుంచి వసూలు చేయాలన్న ఆదేశాలను సవాలు చేస్తూ మేధా రూపమ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కూడా హైకోర్టు తీర్పును సవాలు చేసింది. సెప్టెంబర్‌ 23న జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ ఎన్‌. కోటిశ్వర్‌ సింగ్‌ ధర్మాసనం ఈ వ్యవహారాన్ని విచారించింది. మేధా రూపమ్‌ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదించగా.. యూపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ హాజరయ్యారు.

అయితే విచారణ జరుగుతుండగానే వర్చువల్‌ కోర్టు ఆడియోను మ్యూట్‌ చేశారు. అనంతరం వర్చువల్‌ యాక్సెస్‌ను కూడా మూసివేశారు. దీంతో విచారణలోని కొంత భాగాన్ని మీడియా వినలేని పరిస్థితి ఏర్పడింది. ఈ అంశమే ఇప్పుడు లాయర్ల సంఘం అభ్యంతరాల్లో కీలకంగా మారింది. 

ఆ బెంచ్‌ ముందే ఎందుకు?
ఇక మేధా రూపమ్‌ పిటిషన్‌ లిస్టింగ్‌పైనే లాయర్స్‌ అసోసియేషన్‌ ఫర్‌ కాన్‌స్టిట్యూషన్‌ ప్రధాన ప్రశ్నలు లేవనెత్తింది. జూలై 13 నుంచి అమల్లో ఉన్న సుప్రీంకోర్టు రోస్టర్‌ ప్రకారం.. నిర్బంధం, హెబియస్‌ కార్పస్‌ వంటి అంశాలు వేరే బెంచ్‌ల పరిధిలో ఉన్నాయని సంఘం పేర్కొంది. ఇదే కార్మికుల ఆందోళనకు సంబంధించిన ఇతర నిర్బంధ కేసులు జస్టిస్‌ బీవీ నాగరత్న నేతృత్వంలోని బెంచ్‌ ముందు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. 

అయినప్పటికీ మేధా రూపమ్‌ పిటిషన్‌ అనూహ్యంగా జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ ఎన్‌. కోటిశ్వర్‌ సింగ్‌ ధర్మాసనం ముందు ఎలా లిస్ట్‌ అయిందని ప్రశ్నించింది. దీనిని ‘ఔట్‌ ఆఫ్‌ టర్న్‌’ లిస్టింగ్‌గా పేర్కొంటూ.. కేసును ప్రత్యేకంగా ఒక బెంచ్‌కు కేటాయించారా? అనే సందేహాన్ని సంఘం వ్యక్తం చేసింది. మేధా రూపమ్‌ సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ కుమార్తె కావడంతో.. ఈ వ్యవహారంపై మరింత పారదర్శకత అవసరమని పేర్కొంటూ సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌కు లేఖ రాసింది. 

స్టే విషయంలోనూ గందరగోళమే!
ఈ కేసులో సెప్టెంబర్‌ 23న సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశంపైనా తొలుత కొంత గందరగోళం నెలకొంది. అనంతరం సెప్టెంబర్‌ 24న కోర్టు తన ఆదేశాన్ని సవరించింది. ఆకృతి చౌదరి ఎన్‌ఎస్‌ఏ నిర్బంధాన్ని రద్దు చేసిన అలహాబాద్‌ హైకోర్టు నిర్ణయంపై స్టే లేదని స్పష్టం చేసింది. మేధా రూపమ్‌పై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు, రూ.5 లక్షల పరిహారాన్ని ఆమెతో పాటు ఇతర అధికారుల నుంచి వసూలు చేయాలన్న ఆదేశానికి సంబంధించిన భాగాలపైనే స్టే వర్తిస్తుందని తెలిపింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 7కి వాయిదా వేసింది.

అదే రోజు.. సీఈసీ నియామక కేసులోనూ జస్టిస్‌ శర్మ
సెప్టెంబర్‌ 23నే జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ మరో కీలక కేసులోనూ ధర్మాసనంలో ఉన్నారు. ఎన్నికల కమిషన్‌ నియామక వ్యవస్థకు సంబంధించిన 2023 చట్టాన్ని సవాలు చేసిన పిటిషన్లపై జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాతో కలిసి విచారణ జరిపారు. ఈ వ్యవహారంలో ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో.. తదుపరి చర్యల కోసం అంశం సీజేఐ పరిశీలనకు వెళ్లింది. మేధా రూపమ్‌ కేసుతో పాటు ఈ వ్యవహారాన్ని కూడా లాయర్ల సంఘం తన లేఖలో ప్రస్తావించింది. 

ఇప్పుడు అసలు ప్రశ్న ఇదే..
సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ చుట్టూ ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన వివాదాలు కొనసాగుతున్న సమయంలో.. ఆయన కుమార్తె మేధా రూపమ్‌ కేసు కూడా సుప్రీంకోర్టు లిస్టింగ్‌, విచారణ పారదర్శకతపై ప్రశ్నలకు దారితీసింది. నిర్బంధానికి సంబంధించిన కేసు ఈ బెంచ్‌ ముందుకు ఎలా వచ్చింది? విచారణ మధ్యలో ఆడియో ఎందుకు మ్యూట్‌ అయింది? అన్నదే ఇప్పుడు లాయర్ల సంఘం లేవనెత్తుతున్న ప్రధాన ప్రశ్న. ఈ అంశాలపై సీజేఐకి లేఖ వెళ్లడంతో.. సుప్రీంకోర్టు నుంచి ఎలాంటి వివరణ వస్తుంది? లిస్టింగ్‌ ప్రక్రియపై ఏదైనా స్పష్టత ఇస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇదీ చదవండి: మోదీని ఇలా మునుపెన్నడూ చూసి ఉండరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement