జంతర్‌మంతర్‌ వద్ద నిరసన.. పలువురి నిర్బంధం  | AISA Protests At Jantar Mantar, Demands Gyanesh Kumar Arrest | Sakshi
Sakshi News home page

జంతర్‌మంతర్‌ వద్ద నిరసన.. పలువురి నిర్బంధం 

Sep 26 2026 6:38 AM | Updated on Sep 26 2026 6:38 AM

AISA Protests At Jantar Mantar, Demands Gyanesh Kumar Arrest

న్యూఢిల్లీ: ఓటరు జాబితా, సర్‌ ప్రక్రియలో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలున్న ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలంటూ శుక్రవారం జంతర్‌మంతర్‌ వద్ద నిరసన జరిగింది. ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ అసోసియేషన్‌(ఏఐఎస్‌ఏ)ఢిల్లీ విభాగం, పౌర సమాజాల సభ్యులు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా, సీఈసీ రాజీనామా చేయాలంటూ వీరు నినాదాలు చేశారు. అయితే, నిరసన కోసం వీరు ఎటువంటి అనుమతులు కోరలేదని పోలీసులు తెలిపారు. అందుకే నిర్వాహకులను అరెస్ట్‌ చేశామన్నారు. 

పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్న వారిలో సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ ప్రధాన కార్యదర్శి దీపాంకర్‌ భట్టాచార్య, ఉద్యమకారుడు యోగేంద్ర యాదవ్, ఏఐఎస్‌ఏ అధ్యక్షురాలు నేహా బోరా తదితరులున్నారు. అయితే, శనివారం, ఆ తర్వాతా తాము నిరసనలను కొనసాగిస్తామని ఏఐఎస్‌ఏ నేతలు తెలిపారు. కంఝావాలా పోలీస్‌స్టేషన్‌ నుంచి నేహా ఒక వీడియో విడుదల చేశారు. అందులో ఆమె..ఎన్నికల సంఘం నుంచి జవాబుదారీతనాన్ని డిమాండ్‌ చేసినందుకే పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. 

‘రాజ్యాంగం అందరికీ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును ప్రసాదించింది, అందుకే మేం జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన తెలపడానికి వెళ్లాం’అని పేర్కొన్నారు. ఈ రోజు తమను అదుపులోకి తీసుకున్నప్పటికీ, రేపు మళ్లీ వస్తాం, ఎల్లుండీ వస్తాం. జ్ఞానేశ్‌ కుమార్‌ జైలుకు వెళ్లే వరకు.. సర్‌ నిలిపివేసే వరకు.. రాజ్యాంగ విరుద్ధంగా ఓటు హక్కు కోల్పోయిన ఓటర్లందరికీ తిరిగి ఓటు హక్కు పునరుద్ధరించే వరకు నిరసనలతో హోరెత్తిస్తాం’అని నేహా ఆ వీడియోలోపేర్కొన్నారు. 

అరెస్ట్‌ సమయంలో పోలీసులు నిరసనకారులపై విచక్షణారహితంగా వ్యవహరించారని భట్టాచార్య ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నిరసన స్థలంలో మోహరించిన కొందరు పోలీసు సిబ్బంది నేమ్‌ ట్యాగ్‌లు (పేరు బిళ్ళలు) ధరించకపోవడంపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ‘ఓట్ల దొంగతనానికి పాల్పడుతూ జ్ఞానేశ్‌ పట్టుబడ్డారు. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తుంటే, సీఈసీగా ఆయన్ను నియమించిన మోదీ, షాలు నిరసనలను అణచివేయడానికి ఢిల్లీ పోలీసులను ప్రయోగిస్తున్నారు. ప్రభుత్వం సీఈసీని కాపాడుతోంది’అని విమర్శించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement