సాక్షి, తాడేపల్లి: కేంద్ర ఎన్నికల సంఘంలో విభేదాలపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కమిషనర్ల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తటంపై ఎక్స్‌లో వైఎస్ జగన్ పోస్టు చేశారు. ‘‘ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ సంస్థలపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉండాలి.. అప్పుడే ప్రజాస్వామ్యం బలంగా నిలబడుతుంది. ఎన్నికల సంఘంలోనే ఇద్దరు ఎన్నికల కమిషనర్ల మధ్య అభిప్రాయ భేదాలు అనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
‘‘ముఖ్యంగా ఓటర్ల జాబితాల నిర్వహణ సహా అనేక అంశాల్లో బేధాభిప్రాయాలు వచ్చినట్టు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇవి ప్రజల్లో అనేక ప్రశ్నలకు దారితీశాయి. ఆ మీడియా కథనాల ప్రకారం గత పది నెలల్లోనే 14 సందర్భాల్లో అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఎన్నికల సంఘం మాత్రం ఇవన్నీ సహజమే అంటోంది. బేధాభిప్రాయాలు ఉన్నా తుది నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నామని చెప్తోంది. కానీ ప్రజల్లో నెలకొన్న సందేహాలను ఎన్నికల సంఘం నివృత్తి చేయాలి
..ఆరోపణలు–ప్రత్యారోపణలకు పరిమితం కాకుండా ఏయే అంశాలపై అభ్యంతరాలు నమోదయ్యాయి?. వాటిపై ఏ చర్యలు తీసుకున్నారో ప్రజలకు తెలియాలి. ఓటర్ల జాబితాలో పేర్ల చేర్పులు, తొలగింపులు, పునరుద్ధరణ ప్రక్రియ ఎంత పారదర్శకంగా జరిగింది?. ఓటర్ల జాబితాల నిర్వహణలో క్షేత్రస్థాయి అధికారులకు ఎంత స్వతంత్రత ఉంది?. అనే అంశాలపై స్పష్టత అవసరం. ప్రతి పౌరుడి ఓటు హక్కును పరిరక్షించడం, ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు నమ్మకాన్ని కలిగించటం అత్యంత ముఖ్యం. ప్రజాస్వామ్యంలో పారదర్శకత ఉండటమే కాదు. పారదర్శకత ఉందనే నమ్మకం కూడా ప్రజలకు కలగాలి. 2023లో తీసుకొచ్చిన నూతన చట్టానికి మేము మద్దతు ఇచ్చాం. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ చట్టాన్ని మరోసారి సమీక్షించాల్సిన అవసరం ఉంది
..ఎన్నికల సంఘంపై ఎలాంటి అనుమానాలకు తావులేకుండా చూడాలి. ప్రజల్లో విశ్వాసాన్ని పెంచే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఎన్నికల కమిషనర్ల నియామకానికి ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభ ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉండే ముగ్గురు సభ్యుల కమిటీ విధానాన్ని తిరిగి తీసుకు రావాలి. ఆ మేరకు చట్ట సవరణపై ఆలోచించాలి. విద్యార్థే పరీక్ష పెట్టే వారిని నియమించే పరిస్థితి ఉంటే.. ఆ వ్యక్తి ఎంత నిజాయితీపరుడైనా అనుమానాలకు తావిస్తుంది. అందుకే నియామకాలు పారదర్శకంగా ఉండేలా వ్యవస్థ ఉండాలి
ఇదీ చదవండి: సాయం అంటే ఇది.. థాంక్యూ జగన్ మామయ్య
..అలాంటి మార్పు ఎన్నికల సంఘం ప్రతిష్ఠను, దానిపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో SIR ప్రక్రియ సందర్భంగా ప్రతిపక్షంగా మేము అనేక అభ్యంతరాలను చెప్పాం. కానీ వాటికి సరైన స్పందన ఎన్నికల సంఘం నుండి రాలేదు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన డీలిమిటేషన్ ప్రక్రియలోనూ.. వార్డులు, డివిజన్ల పునర్విభజనపై ప్రతిపక్షంగా మేము అనేక అభ్యంతరాలను తెలిపాం. కానీ వేటినీ పరిగణనలోకి తీసుకోకపోవటం ఆందోళనకరం. ఇలాంటి పరిస్థితులే ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో సందేహాలకు కారణమవుతాయి
..అందుకే పారదర్శకత, జవాబుదారీతనం ఎన్నికల వ్యవస్థకు ప్రాథమిక ప్రమాణాలుగా ఉండాలి. ప్రతి అర్హుడైన పౌరుడి ఓటు హక్కును కాపాడటం.. ఎలాంటి భయం లేదా అనుమానం లేకుండా ఆ హక్కును వినియోగించుకునేలాబుండాలి. ఆ వ్యవస్థను బలోపేతం చేయడం ఎన్నికల వ్యవస్థ ముందున్న అత్యంత ముఖ్యమైన బాధ్యత’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
Democracy can stand only when people have complete confidence in constitutional institutions such as the Election Commission. National media reports that two Election Commissioners raised objections on several occasions to decisions, electoral rolls and the management of ECINet…
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 25, 2026


