ఢిల్లీలో ప్రధాని మోదీతో కరచాలనం చేసిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. ఇప్పుడు వాషింగ్టన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కీలక చర్చలు జరిపారు. సెప్టెంబర్ 12న న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా మోదీ-జిన్‌పింగ్ భేటీ జరగగా.. సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్-జిన్‌పింగ్ సమావేశమయ్యారు. రెండు పర్యటనల మధ్య కేవలం 12 రోజుల వ్యవధి ఉండటం ప్రపంచ దౌత్య వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది. వీరిద్దరి మధ్య చర్చల్లో వాణిజ్యం, తైవాన్, AI, టెక్నాలజీ, అరుదైన ఖనిజాలు, ఇరాన్ వంటి అంశాలు కీలకంగా మారాయి. అమెరికా-చైనా వాణిజ్య సంధిని మరో రెండు నెలలు పొడిగించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి.
మోదీతో భేటీ తర్వాతే ట్రంప్‌తో సమావేశం
బ్రిక్స్ సదస్సు సందర్భంగా మోదీ, జిన్‌పింగ్ ఇరుదేశాల సంబంధాలపై కీలక చర్చలు జరిపారు. సరిహద్దుల్లో శాంతి, ద్వైపాక్షిక సంబంధాల స్థిరీకరణ, వాణిజ్య అసమతుల్యత, సరఫరా చైన్, వ్యాపార సంబంధాలను మెరుగుపరచడం వంటి అంశాలపై చర్చ జరిగింది. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ఇరుదేశాల ఒప్పందాలను పాటించడం ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి కీలకమని మోదీ స్పష్టం చేశారు. చైనా కూడా భారత్‌తో సంబంధాలను దీర్ఘకాలిక వ్యూహాత్మక దృష్టితో అభివృద్ధి చేయాలని చెబుతోంది. జిన్‌పింగ్-మోదీ భేటీ తర్వాత చైనా ప్రకటనలో ఇరుదేశాలు భాగస్వాములుగా ఉండాలనే అంశాన్ని ప్రస్తావించింది.
అసలు టెన్షన్ ఇదే
ఇప్పటివరకు అమెరికా-చైనా పోటీ కారణంగా చైనా నుంచి దూరమయ్యే కంపెనీలకు భారత్ ఒక ప్రత్యామ్నాయ తయారీ కేంద్రంగా ఎదిగే అవకాశం వచ్చింది. ‘China+1’ వ్యూహం ద్వారా పెట్టుబడులు, సరఫరా గొలుసులు భారత్ వైపు మళ్లే అవకాశం ఏర్పడింది. అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గి.. చైనా మళ్లీ అమెరికా మార్కెట్‌తో స్థిరమైన సంబంధాలు ఏర్పరచుకుంటే, ఈ అవకాశాల్లో కొంత భాగం తగ్గే అవకాశం ఉందని విశ్లేషణలు చెబుతున్నాయి. తైవాన్, AI, టెక్నాలజీ నియంత్రణలు, వాణిజ్య సుంకాలు, ఇరాన్ యుద్ధంపై ఇరుదేశాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రేర్ ఎర్త్స్ సరఫరాలో చైనాకు ఉన్న ఆధిపత్యం కారణంగా ఈ రంగంలో కుదిరే ఏదైనా అమెరికా-చైనా అవగాహన ప్రపంచ సరఫరా గొలుసులపై ప్రభావం చూపవచ్చు. దాని ప్రభావం భారత్ తయారీ, టెక్నాలజీ రంగాలపై కూడా పరోక్షంగా పడే అవకాశం ఉంది.
చైనా లెక్కల్లో భారత్ ఎందుకు?
ఇక్కడే భారత్ అంశం ఆసక్తికరంగా మారుతోంది. అమెరికా ఇప్పటికే ఇండో-పసిఫిక్‌లో భారత్‌ను కీలక వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తోంది. మరోవైపు భారత్ చైనాతో సంబంధాలను పూర్తిగా తెంచుకోకుండా.. సరిహద్దు సమస్యలు, వాణిజ్య అంశాలను పరిష్కరించుకుంటూ సంబంధాలను స్థిరీకరించే ప్రయత్నం చేస్తోంది. అంటే.. అమెరికాతో భారత్‌కు వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది.. చైనాతో భారత్‌కు ఆర్థిక, భౌగోళిక సంబంధాలు ఉన్నాయి. ఈ రెండు సమీకరణాల మధ్య న్యూఢిల్లీ తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కొనసాగిస్తోంది.
రష్యా అంశం కూడా కీలకమే..
రష్యా చమురు, ఇరాన్ అంశాల్లో భారత్, చైనాలపై అమెరికా విధానం కూడా న్యూఢిల్లీకి ముఖ్యమే. అమెరికా-చైనా చర్చల్లో బీజింగ్‌కు రష్యా, ఇరాన్ విషయంలో ఏదైనా ప్రత్యేక వెసులుబాటు లభిస్తే.. ప్రాంతీయ శక్తి సమీకరణాలపై దాని ప్రభావం భారత్ లెక్కలను కూడా మార్చవచ్చు. అందుకే ఢిల్లీ తర్వాత వాషింగ్టన్‌లో జిన్‌పింగ్ భేటీపై భారత్ నిశితంగా గమనిస్తోంది. అమెరికా-చైనా సంబంధాలు పూర్తిగా తెగిపోవడం భారత్‌కు ఒక రకమైన అవకాశాలను తెస్తే.. ఇరుదేశాల మధ్య అవగాహన పెరగడం మరో రకమైన అవకాశాలను, సవాళ్లను తీసుకురావచ్చు.
ఇదీ చదవండి: హార్ముజ్ కోసం ట్రంప్-ఇరాన్ కీలక భేరం!


