దర్యాప్తు ప్రారంభించిన అమెరికా రక్షణ శాఖ
అత్యాధునిక యుద్ధ విమానం పరిజ్ఞానం చైనాకు చేరడంపై ఆందోళన
వాషింగ్టన్: అత్యంత ఆధునిక ఎఫ్–35 యుద్ధ విమానం విడి భాగాలు హాంకాంగ్‌కు మళ్లడంపై అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ దర్యాప్తు చేపట్టింది. ఎఫ్–35 విడిభాగాలు చైనాకు చేరాయంటూ బుధవారం బ్లూమ్‌బర్గ్‌లో వెలువడిన వార్త తీవ్ర సంచలనం రేపింది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అమెరికా పర్యటన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. అత్యంత ఆధునిక యుద్ధ విమానం విడిభాగాలు పక్కదారి పట్టిన అంశం తమ దృష్టికి వచ్చిందని ఎఫ్–35 జాయింట్ ప్రోగ్రామ్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
ఆ విడిభాగాలను తిరిగి తీసుకువచ్చేందుకు, మున్ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు పెంటగాన్ అధికారులు, సంబంధిత కంపెనీ లాక్‌హీడ్ మార్టీన్‌తో చర్చలు జరుపుతున్నామన్నారు. తమకు అందాల్సిన ఎఫ్–35 విడిభాగాలు కొన్ని పొరపాటున హాంకాంగ్‌కు చేరాయంటూ ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ మంగళవారం మొదటిసారిగా బాంబు పేల్చారు. అయితే, అవి నిజంగా కీలకమైన విడిభాగాలేనా అన్న విషయాన్ని ఆయన వెల్లడించలేదు. ఈ అంశాన్ని అమెరికా ప్రభుత్వం, లాక్‌హీడ్ మార్టిన్ చూసుకుంటాయన్నారు. దీనిపై లాక్‌హీడ్ మార్టీన్ స్పందించలేదు.
ఈ విషయం తమకు తెలియదని చైనా విదేశాంగ శాఖ పేర్కొనగా, ఇటువంటి సున్నితమైన అంశాలపై వ్యాఖ్యానించలేమని హాంకాంగ్ ప్రభుత్వం తెలిపింది. అమెరికా నుంచి ఆ్రస్టేలియాకు చేరుకోవాల్సిన ఆ పరికరాలు అందుకు బదులుగా హాంకాంగ్‌కు మళ్లాయి. అత్యంత సున్నితమైన సాంకేతికతతో రూపొందించిన ఈ పరికరాలను చైనా స్వా«దీనం చేసుకుని ఉండొచ్చని పొలిటికో తన కథనంలో అనుమానాలు వ్యక్తం చేసింది. సొంత సైన్యం, విదేశాంగ విధానం లేని హాంకాంగ్‌పై చైనా ప్రభుత్వ పూర్తి నియంత్రణ కొనసాగుతుండటం తెల్సిందే.
ఎఫ్–35కు ఎందుకంత ప్రాముఖ్యత?
ఎఫ్–35 స్టెల్త్ ఫైటర్ జెట్లు అమెరికాలోని టెక్సాస్‌లో 20 ఏళ్ల క్రితం మొదటిసారిగా తయారయ్యాయి. ఇప్పటి వరకు 1,200 వరకు ఇవి తయారయ్యాయి. 19 దేశాల్లో సేవలందిస్తున్నాయి. అత్యంత ఆధునాతన సాంకేతికత కలిగిన ఈ యుద్ధ విమానాలు కలిగిన దేశాల్లో ఆ్రస్టేలియా ఒకటి. 2013లో చైనా సైబర్ దాడుల ద్వారా దొడ్డిదారిన చేజిక్కించుకున్న అమెరికా పరిజ్ఞానంలో ఎఫ్–35కు సంబంధించినవి కూడా ఉన్నట్లు పెంటగాన్ 2013లో వెలువరించిన నివేదికలో పేర్కొనడం గమనార్హం.
ఎఫ్–35 విమానం అమెరికాలోనే అత్యుత్తమమైన, అత్యంత అధునాతనమైన ఫైటర్ జెట్. అమెరికా మిలిటరీ వ్యవస్థలు నిరంతరం అప్‌డేట్ అవుతుంటాయని, ఏళ్ల క్రితం ఎవరైనా కొంత పరిజ్ఞానాన్ని దొంగిలించినా పెద్ద ముప్పేమీ లేదని వాషింగ్టన్‌కు చెందిన ’ఫౌండేషన్ ఫర్ డిఫెన్స్ ఆఫ్ డెమోక్రసీస్’సంస్థ సీనియర్ డైరెక్టర్ బ్రాడ్లీ బౌమన్ తెలిపారు. ఐదో తరం ఫైటర్ జెట్‌గా పేర్కొనే ఎఫ్–35 సాంకేతికతలో స్టెల్త్ కోటింగ్స్‌తో పాటు అధునాతన రాడార్, సెన్సార్లు ఉన్నాయి. శత్రువులను మెరుగ్గా గుర్తించేందుకు అధునాతన సెన్సార్లతో పాటు, యుద్ధ సమయంలో మిత్రదేశాల విమానాలు, యుద్ధక్షేత్రంలోని సైనిక బలగాలతో సమాచారాన్ని పంచుకోవడానికి అవసరమైన నెట్‌వర్కింగ్ సామర్థ్యాలు కూడా ఈ విమానానికి ఉన్నాయని బౌమన్ చెప్పారు.


