అమెరికా–చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరుదైన స్వాగతం పలికారు. ప్రత్యేక విమానంలో వాషింగ్టన్ చేరుకున్న జిన్‌పింగ్, ఆయన భార్య పెంగ్ లియువాన్‌లను ట్రంప్, ఆయన సతీమణి మెలానియా స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ఆహ్వానించారు. దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత.. అమెరికా గడ్డపై ఓ విదేశీ నేతకు లభించిన అత్యంత అరుదైన స్వాగతంగా దీని గురించి చర్చ నడుస్తోంది.
జాయింట్ బేస్ ఆండ్రూస్ ఎయిర్‌బేస్‌లో జిన్‌పింగ్ విమానం దిగగానే రెడ్ కార్పెట్‌పైకి వచ్చిన ట్రంప్ దంపతులు ఆయనకు కరచాలనం చేసి స్వాగతం పలికారు. 21 మంది సభ్యులతో కూడిన గౌరవ వందనం, సైనిక బ్యాండ్, రెండు బి-1 బాంబర్ విమానాల విన్యాసంతో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ట్రంప్, జిన్‌పింగ్ కొద్దిసేపు మాట్లాడుకుని అనంతరం ఫొటోలకు పోజులిచ్చారు. ఈ మూడు రోజుల పర్యటనలో గురువారం వైట్‌హౌస్‌లో అధికారిక స్వాగత కార్యక్రమం, సైనిక పరేడ్, ద్వైపాక్షిక చర్చలు, స్టేట్ డిన్నర్ జరగనున్నాయి.
Chinese President Xi Jinping and his wife, Peng Liyuan, were warmly greeted by U.S. President Donald Trump and his wife, Melania Trump, at the airport in a rare planeside welcome. pic.twitter.com/IoUSosQZ8d
— Mulan Chun-Li (@chunlimulan) September 24, 2026
ఓ విదేశీ నేతను అమెరికా అధ్యక్షుడు ఈ స్థాయిలో స్వయంగా స్వాగతించడం.. అదీ సుమారు ఆరు దశాబ్దాల తర్వాత కావడంతో చర్చనీయాంశంగా మారింది. ఇంతకు ముందు అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నడీ 1962లో పలువురు విదేశీ నేతలను వ్యక్తిగతంగా స్వాగతించారు. ఆ తర్వాత బుష్, ఒబామా కాలంలో పోప్‌లను మాత్రం స్వాగతించారు. పోటోకాల్ పేరిట అధ్యక్షుడిని మినహాయించి.. విదేశీ నేతలకు అధికార యంత్రాంగం వెల్‌కమ్ చెప్పటం అక్కడ ఆనవాయితీగా మారిపోయింది. అయితే జిన్‌పింగ్ కోసం ట్రంప్ ఇప్పుడు దానిని చెరిపేశారు.
ఎందుకింత ప్రత్యేకం?
అమెరికా అధ్యక్షులు సాధారణంగా విదేశీ నేతలను విమానాశ్రయానికి వెళ్లి స్వయంగా ఆహ్వానించరు. జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో ఇలాంటి స్థాయి స్వాగతాలు అత్యంత అరుదు. జిన్‌పింగ్ పర్యటనకు ముందు ట్రంప్ అక్కడికి వెళ్లి స్వయంగా స్వాగతం పలకనున్నట్లు అమెరికా అధికారులు ప్రకటించడంతోనే ఆసక్తి నెలకొంది.
ఈ పర్యటనకు మరో ప్రత్యేకత ఉంది. 2015 తర్వాత అమెరికా రాజధానికి చైనా అధ్యక్షుడి తొలి స్టేట్ విజిట్ ఇది. అయితే 2023లో అప్పటి అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన అమెరికా–చైనా శిఖరాగ్ర భేటీ, APEC సదస్సులో పాల్గొనేందుకు వెళ్లారు. ఇప్పుడు మాత్రం అధికారిక స్టేట్ విజిట్‌లో భాగంగా వాషింగ్టన్ చేరుకున్నారు. గత మేలో ట్రంప్ చైనాలో పర్యటించినప్పుడు జిన్‌పింగ్ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ఆయనను కలవలేదు. ఈసారి మాత్రం ట్రంప్ స్వయంగా జిన్‌పింగ్‌ను స్వాగతించడం రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ప్రాధాన్యతను స్పష్టం చేస్తోంది.
వాణిజ్య యుద్ధానికి తాత్కాలిక బ్రేక్?
జిన్‌పింగ్ అమెరికాలో అడుగుపెట్టిన రోజే రెండు దేశాల మధ్య వాణిజ్య అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ప్రకారం.. అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య సంధిని జనవరి 10 వరకు పొడిగించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ ఒప్పందం నవంబర్‌లో ముగియాల్సి ఉంది. సుంకాలను తగ్గించడం, కొత్త వాణిజ్య ఆంక్షలు విధించకుండా ఉండటం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఇరు దేశాల మధ్య సుంకాలు, అరుదైన ఖనిజాలు, చిప్స్, సాంకేతికత వంటి అంశాల్లో విభేదాలు ఇంకా కొలిక్కి రావాల్సి ఉంది.
టేబుల్‌పై ట్రేడ్.. ఏఐ.. ఇరాన్.. తైవాన్
ట్రంప్–జిన్‌పింగ్ భేటీలో వాణిజ్యంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా కీలక అంశంగా ఉండనుంది. ఏఐ రంగంలో ఆధిపత్యం కోసం అమెరికా, చైనా తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఈ సాంకేతికతపై ఆందోళనలను చర్చించేందుకు ఇరు దేశాల మధ్య ప్రత్యేక కమ్యూనికేషన్ ఛానల్ ఏర్పాటు చేసే అంశం కూడా ప్రాథమిక చర్చల్లోకి వచ్చింది.
అరుదైన ఖనిజాల సరఫరా కూడా కీలకంగా మారింది. ఎలక్ట్రానిక్స్ నుంచి సైనిక పరికరాల వరకు అనేక రంగాలకు అవసరమైన రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో చైనాకు ఉన్న ఆధిపత్యం అమెరికాకు ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు కీలక చిప్స్, ఇతర సాంకేతిక ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న ఎగుమతి నియంత్రణలను చైనా వ్యతిరేకిస్తోంది.
ఇరాన్ అంశం కూడా ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశముంది. ఇరాన్‌తో చైనా సంబంధాలు, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న పరిణామాలు, తైవాన్ అంశాలపై రెండు దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అందువల్ల మూడు రోజుల పర్యటనలో అసలు చర్చలు గురువారం జరిగే ట్రంప్–జిన్‌పింగ్ సమావేశంపైనే కేంద్రీకృతం కానున్నాయి.
భారీ ఏర్పాట్లు.. టెక్ దిగ్గజాలతో విందు
జిన్‌పింగ్ పర్యటనలో భాగంగా గురువారం వైట్‌హౌస్‌లో స్టేట్ డిన్నర్ నిర్వహించనున్నారు. ఇందులో అమెరికా టెక్ రంగానికి చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు. ఏఐ, చిప్స్, టెక్నాలజీ రంగాల దిగ్గజాల హాజరు ఈ విందుకు మరింత ప్రాధాన్యతను తెచ్చింది.
శుక్రవారం జిన్‌పింగ్, పెంగ్ లియువాన్‌లు ట్రంప్ దంపతులతో వైట్‌హౌస్‌లో టీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అమెరికా చరిత్రకు సంబంధించిన కీలక పత్రాలు భద్రపరిచిన నేషనల్ ఆర్కైవ్స్‌ను సందర్శించనున్నారు. ఆ తర్వాత జాయింట్ బేస్ ఆండ్రూస్ నుంచి జిన్‌పింగ్ తిరుగు ప్రయాణం కానున్నారు.
అమెరికా–చైనా మధ్య వాణిజ్య, సాంకేతిక, భౌగోళిక రాజకీయ విభేదాలు పూర్తిగా సమసిపోలేదు. అయితే చర్చల ద్వారా సంబంధాలను అదుపులో ఉంచి, మరోసారి పెద్ద స్థాయి ఘర్షణకు దారితీయకుండా చూడాలన్న ప్రయత్నం మాత్రం ఈ పర్యటనలో స్పష్టంగా కనిపిస్తోంది.


