గ్రేటర్ నోయిడా: ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా సమీపంలో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న స్లీపర్ బస్సులో అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 9 మంది సజీవ దహనమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అగ్నిప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది.
పొగతో మొదలై.. క్షణాల్లో మంటలు
బిహార్ రిజిస్ట్రేషన్ ఉన్న స్లీపర్ బస్సు గ్రేటర్ నోయిడా నుంచి ఆగ్రా వైపు వెళ్తుండగా దయానత్‌పూర్ గ్రామం సమీపంలో ఈ ఘటన జరిగింది. తొలుత బస్సులో నుంచి పొగ రావడాన్ని ప్రయాణికులు గుర్తించారు. కొద్దిసేపటికే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. డ్రైవర్ వెంటనే బస్సును రహదారి పక్కకు నిలిపివేయడంతో ప్రయాణికులు బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తీవ్ర తొక్కిసలాట, గందరగోళం నెలకొంది.
బస్సులో పర్యాటకులు
బస్సులో ఉన్నవారు పర్యాటకులని సమాచారం. మథుర నుంచి బృందావన్ వెళ్తుండగా జేవర్ సమీపంలో ప్రమాదం జరిగింది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది వృద్ధ మహిళలు, చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొంతమంది దివ్యాంగ పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని కైలాశ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
#WATCH | Greater Noida | A passenger says, "...I was asleep when someone banged on the door. When I woke up, there was already a huge crowd. I didn't pick up any of my belongings; I didn't even put on my shoes. I just grabbed my phone and stepped out. It was so crowded that people were shoving each other. I was pushed around, and someone eventually pulled me out. I don't remember anything else after that. It was completely filled with smoke; the scene was chaotic, and getting out was extremely difficult...It was so smoky that nothing was visible; people were suffocating inside. Very few managed to escape, only those who could push their way out amidst the shoving...Many people lost their lives...There were quite a few people behind me who probably couldn't make it out, as I myself got out quite late..."
— ANI (@ANI) September 24, 2026
మంటలు ఎలా వచ్చాయి?
ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. ఘటనపై పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి ఫైర్ సిబ్బంది గంటల తరబడి శ్రమించారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం బస్సులో మంటల సమయంలో పేలుళ్ల వంటి శబ్దాలు వినిపించాయి. బస్సులో టపాసులు ఉన్నాయా? అనే కోణంలోనూ అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే దీనిపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది.
పైభాగంలో చిక్కుకున్న ప్రయాణికులు
బస్సు డబుల్ డెక్కర్ కావడంతో పైభాగంలో ఉన్న ప్రయాణికులు మంటల్లో చిక్కుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మంటలు తీవ్రంగా వ్యాపించడంతో రహదారిపై వెళ్తున్న వాహనదారులు కూడా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే యమునా ఎక్స్‌ప్రెస్‌వే ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం కారణంగా జేవర్ టోల్, ఫలైదా కట్ వద్ద ట్రాఫిక్‌ను కొంతసేపు నిలిపివేశారు.
బయటపడటం చాలా కష్టమైంది
ప్రమాదం నుంచి బయటపడిన ఓ ప్రయాణికుడు తన అనుభవాన్ని వివరించాడు. తాను నిద్రలో ఉండగా ఎవరో తలుపు కొట్టారని, మేల్కొన్న తర్వాత అప్పటికే బస్సులో భారీగా పొగ కమ్ముకుందని చెప్పాడు. సామాన్లు తీసుకునే అవకాశం లేకపోవడంతో ఫోన్ మాత్రమే తీసుకుని బయటకు వచ్చానని తెలిపాడు. బస్సులో పొగ దట్టంగా ఉండటంతో ఏమీ కనిపించలేదని, బయటకు రావడానికి ప్రయాణికులు ఒకరినొకరు తోసుకుంటూ తీవ్రంగా ఇబ్బంది పడ్డారని వివరించాడు. తన వెనుక చాలామంది ఉన్నారని, వారిలో కొందరు బయటకు వచ్చారా లేదా తెలియదని చెప్పాడు.

ఇదీ చదవండి: ఆ దేశాల్లో విడాకులే లేవు.. మరి విడిపోవాలనుకుంటే..


