సాక్షి, ఆదిలాబాద్: రిమ్స్‌లో అర్ధరాత్రి చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఓ నవజాత శిశువు మృతి చెందగా.. తాజాగా మరో చిన్నారి కూడా మృతిచెందినట్లు సమాచారం. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా చిన్నారులకు స్థానికంగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
అర్ధరాత్రి సమయంలో పిల్లల వార్డులోని ఏసీ వద్ద షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఏసీ పేలి మంటలు చెలరేగడంతో పాటు క్షణాల వ్యవధిలో వార్డు మొత్తం దట్టమైన పొగ వ్యాపించింది. ఒక్కసారిగా పొగ కమ్ముకోవడంతో వార్డులో ఉన్న చిన్నారుల తల్లిదండ్రులు, సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చిన్నారులకు ఊపిరి అందక ఇబ్బందులు ఎదురయ్యాయి.

అద్దాలు పగలకొట్టి చిన్నారుల తరలింపు
ప్రమాద తీవ్రతను గుర్తించిన ఆస్పత్రి సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. వార్డు నుంచి బయటకు వెళ్లేందుకు మార్గం ఇబ్బందికరంగా మారడంతో అద్దాలు పగలకొట్టి బయటకు వచ్చారు. అనంతరం చిన్నారులను ఒక్కొక్కరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ప్రమాద సమయంలో వార్డులో ఉన్న 24 మంది చిన్నారులను తల్లిదండ్రుల సాయంతో సిబ్బంది సకాలంలో కాపాడారు.
అయితే దట్టమైన పొగ కారణంగా ఓ నవజాత శిశువు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఉదయం చికిత్స పొందుతూ.. మరో చిన్నారి కూడా మృతిచెందినట్లు సమాచారం. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
వివిధ ఆస్పత్రులకు తరలింపు
ప్రమాదం తర్వాత చిన్నారులను ఆదిలాబాద్‌లోని వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పొగ పీల్చిన చిన్నారులకు వైద్యులు అత్యవసర వైద్యం అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న చిన్నారులపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోంది.
ఘటనా స్థలానికి కలెక్టర్
రిమ్స్‌లో ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టర్ రాజర్షి షా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు, చికిత్సకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
ప్రమాదానికి అసలు కారణాలు, ఏసీ పేలడానికి దారితీసిన పరిస్థితులపై అధికారులు ఆరా తీస్తున్నారు. రిమ్స్‌లో భద్రతా ఏర్పాట్లు, విద్యుత్ వ్యవస్థపై కూడా పరిశీలన జరిపే అవకాశం ఉంది.


