ఆర్టీసీ బస్టాండ్లలోని దుకాణాలు, క్యాంటీన్లపై నేతల కన్ను
మంచి ఆదాయం ఉండటంతో ఎలాగైనా దక్కించుకునేందుకు యత్నాలు
ఇంతకాలం స్థానిక అధికారుల చేతుల్లో టెండర్లు, కేటాయింపు అధికారం
ఇప్పుడు బస్‌భవన్‌లోనే కేటాయింపులు జరిగేలా కసరత్తు
కొత్త టెండర్లు పిలవద్దంటూ స్థానిక అధికారులకు మౌఖిక ఆదేశాలు
హనుమకొండ క్యాంటీన్ విషయంలో వరంగల్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే ఒత్తిడి!
హనుమకొండ బస్టాండులోని ఆర్టీసీ క్యాంటీన్ పాత టెండర్ గడువు పూర్తి కావటంతో కొత్త టెండర్ నోటిఫికేషన్ జారీ అయింది. దాఖలైన టెండర్లలో ఎక్కువ కోట్ చేసిన వ్యక్తి/సంస్థకు టెండర్ కేటాయించాల్సి ఉంది. ఈ సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యే రంగంలోకి దిగారు. ఓ వ్యక్తిని అధికారుల వద్దకు తీసుకెళ్లి అతనికి క్యాంటీన్ నిర్వహణ బాధ్యత అప్పగించాలని హుకుం జారీ చేశారు. టెండర్ ద్వారానే కేటాయింపు జరుగుతుందని అధికారులు వివరించినా వినకుండా పలుమార్లు ఒత్తిడి తెచ్చారు.
టెండర్ లేకుండా కేటాయింపు తమ స్థాయిలో తీసుకునే నిర్ణయం కాదని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో ఎమ్మెల్యే చెప్పాల్సిన వారికి చెప్పేశాడు. కొద్ది రోజుల్లోనే అక్కడి ఆర్టీసీ అధికారిని ఆదిలాబాద్‌కు బదిలీ చేస్తూ ఆర్డర్ అందింది. అయితే ఈ అంశం ఒక్క ఆ అధికారి బదిలీకే పరిమితం కాలేదు. కొన్ని దశాబ్దాలుగా ఆయా ప్రాంత ఆర్టీసీ అధికారుల పర్యవేక్షణలో టెండర్ల ప్రక్రియ ద్వారా జరుగుతున్న ఆర్టీసీ బస్టాండ్లలోని దుకాణాల కేటాయింపు వ్యవహారాన్ని ఇక నేరుగా హైదరాబాద్‌లోని బస్‌భవన్‌కు బదిలీ చేసే కసరత్తు జరుగుతోంది.
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీకి పెద్ద ఆదాయ వనరుగా ఉన్న బస్టాండ్లలోని దుకాణాలపై నేతల కన్ను పడింది. నిబంధనలతో సంబంధం లేకుండా ఆ దుకాణాలను తమ బినామీలకు, తమ అనుచరులకు కేటాయించేలా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఒత్తిళ్లు తెస్తున్నారు. అయితే కచ్చితంగా టెండర్లు పిలిచి ఎవరు ఎక్కువ కోట్ చేస్తే వారికే ఇచ్చే పద్ధతి అమలులో ఉండటం, స్థానిక డిప్యూటీ రీజినల్ మేనేజర్‌లు, ఆర్‌ఎంల పర్యవేక్షణలో వ్యవహారం కొనసాగాల్సి ఉండటం వారికి పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది.
నిబంధనలు ఉల్లంఘిస్తే ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని, ఉద్యోగానికే ఎసరు రావొచ్చనే భయంతో కిందిస్థాయి ఉద్యోగులు ఒత్తిళ్లకు లొంగడం లేదు. దీంతో ఈ వ్యవహారం బస్ భవన్‌కు చేరింది. స్థానికంగా దుకాణాలకు కొత్తగా టెండర్లు పిలవవద్దంటూ రీజియన్లకు మౌఖికంగా ఆదేశాలు అందాయి. ఇక నుంచి బస్‌భవన్ నుంచే స్వయంగా వాటి కేటాయింపు వ్యవహారం ఉంటుందని పలు సమావేశాల రూపంలో రీజియన్‌ల అధికారులకు, డిపో మేనేజర్లకు సమాచారం ఇచ్చారు. ఈ బాధ్యతను పర్యవేక్షించేందుకు బస్‌భవన్‌లో ఓ విభాగాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది.
ఫుల్ డిమాండ్..భారీ ఆదాయం
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీకి 364 వరకు బస్టాండ్లు ఉన్నాయి. వాటిల్లో 5,616 దుకాణాలు, క్యాంటీన్లు ఉన్నాయి. వీటన్నింటి అద్దె ఒకేరకంగా లేదు. ఈ బస్టాండ్లను వాటి స్థాయి ఆధారంగా మేజర్, ఏ క్లాస్, బీ క్లాస్, సీ క్లాస్‌లుగా విభజించారు. నగరంలోని ఎంజీబీఎస్, జేబీఎస్, వరంగల్, కరీంనగర్... ఇలాంటి పెద్ద బస్టాండ్లు మేజర్ కేటగిరీలో ఉన్నాయి. వీటిల్లో క్యాంటీన్లు లాంటి వాటికి నెలవారీ అద్దె రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఉంది. పాప్‌కార్న్ లాంటి సాధారణ దుకాణాలకు కూడా రూ.లక్షకు పైగా అద్దె ఉంటుంది. ఆ తర్వాత ఏ క్లాస్ బస్టాండ్లలో సగటున ఒక్కో దుకాణానికి రూ.60 వేల వరకు అద్దె ఉంటుంది.
బీ, సీ కేటగిరీ బస్టాండ్లలో అద్దెలు తక్కువగా ఉంటాయి. కొన్ని దుకాణాలకు అసలు డిమాండ్ కూడా ఉండదు. మొత్తంగా ఈ దుకాణాల ద్వారా ఆర్టీసీకి నెలవారీ రూ.10 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుంది. రద్దీ ఎక్కువగా ఉండే బస్టాండ్లలో దుకాణాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. టెండర్లలో పొల్గొంటే పోటీలో వీటి అద్దె పెరుగుతుంది. దీంతో తక్కువ అద్దెకు ఈ దుకాణాలు చేజిక్కించుకోవాలని, అయినవారికి కట్టబెట్టాలని నేతలు యతి్నస్తున్నారు. ఈ క్రమంలోనే స్థానిక అధికారుల వద్ద ఉన్న దుకాణాల కేటాయింపు అధికారం బస్‌భవన్‌కు మార్చే కసరత్తు జరుగుతోంది.
మాట వినకుంటే వేటే..
ఇటీవల ఓ మంత్రి కార్యాలయం నుంచి మెదక్ రీజియన్‌లో కాంట్రాక్టు కండక్టర్ల కేటాయింపునకు సంబంధించి అభ్యర్థుల పేర్లతో జాబితా వెళ్లింది. అధికారికంగా ఉన్న కాంట్రాక్టర్లు సూచించిన వారికి కేటాయించాల్సి ఉన్నా, దాన్ని కాదని మంత్రి కార్యాలయం ఈ జాబితా పంపింది. దీంతో ఈ వ్యవహారం వివాదాస్పదమైంది. దాన్ని ‘సాక్షి’వెలుగులోకి తేవటంతో మంత్రి కార్యాలయ అధికారులు వెనక్కు తగ్గారు.
అయితే ఆ వెంటనే అక్కడి రీజియన్‌లో ఈ వ్యవహారాన్ని చూసే ఓ అధికారిని దూర ప్రాంతానికి బదిలీ చేశారు. తనకు ఆరోగ్య సమస్యలున్నందున వెళ్లలేనని వేడుకున్నా వినలేదు. దీంతో ఆ అధికారి వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్నారు. ఈ విధంగా పైస్థాయిలో చర్యలుంటాయన్న భయంతో నిబంధనలను అనుసరించే కిందిస్థాయి అధికారులను ఎడాపెడా బదిలీ చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలా కుదరకపోతే ఏకంగా నిబంధనలనే మార్చేస్తున్నారనే ఆరోపణలు విని్పస్తున్నాయి.


