చేయూత అందేనా? | Anxiety Mounts Among Persons with Disabilities Awaiting New Pensions | Sakshi
Sakshi News home page

చేయూత అందేనా?

Sep 22 2026 2:06 AM | Updated on Sep 22 2026 2:06 AM

Anxiety Mounts Among Persons with Disabilities Awaiting New Pensions

కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న దివ్యాంగుల్లో ఆందోళన 

నత్తనడకన సాగుతున్న అప్లికేషన్ల పరిశీలన 

ఈ నెల 25తో ముగుస్తున్న గడువు..ఇంకా పెండింగ్‌లో 85 వేలకు పైగా దరఖాస్తులు

కొన్ని ఆసుపత్రులలో వారానికి ఒకటి కూడా జరగని పరీక్షలు

సాక్షి, హైదరాబాద్‌: కొత్త చేయూత పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులను ఓ కొత్త సమస్య వేధిస్తోంది. వీరి చేయూత దరఖాస్తుల పరిశీలన నత్తనడకన సాగుతుండడంతో తమకు పింఛను వస్తుందా..రాదా? అని ఆందోళనకు గురవుతున్నారు. గత బుధవా­రం సాయంత్రంతో దరఖాస్తులకు గడువు ముగియగా.. 33 జిల్లాల పరిధిలో మొత్తం 5,98,193 కొత్త దరఖాస్తులు వచి్చనట్టుగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. ఈ దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన, అర్హుల వడపోత ప్రక్రియను ఈ నెల 25 లోగా పూర్తి చేయాలని జిల్లా అధికారులు ఆదేశించారు.

మొత్తం దాఖలైన దరఖాస్తుల్లో సగానికి పైగా వితంతు పింఛన్లు (55 శాతానికి పైగా) ఉండగా, ఆ తర్వాతి స్థానంలో దివ్యాంగులు (1,48,882 దరఖాస్తులు) ఉన్నాయి. ఈ నెల 25న అంటే మరో 4 రోజుల్లోనే దరఖాస్తుల పరిశీలన ముగియనుండగా, దివ్యాంగుల దరఖాస్తుల్లో 85 వేలకు పైగా దరఖాస్తుల పరిశీలన ఇంకా పెండింగ్‌లోనే ఉన్నట్టు సమాచారం. గత నెలలో (ఆగస్టు) కేవలం 13 వేల దరఖాస్తుల పరిశీలనే పూర్తికావడం, గత వారంలో 2,326 అప్లికేషన్ల వెరిఫికేషన్‌ మాత్రమే జరగడంతో...ఈ నెల 25వ తేదీకల్లా 85 వేలకు పైగా అప్లికేషన్ల వెరిఫికేషన్‌ పూర్తి అవుతుందా? లేదా అన్న సందేహాలు దివ్యాంగులను వేధిస్తు­న్నాయి. పరిశీలనలో భాగంగా దివ్యాంగులకు పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా..కొన్ని ఆసుపత్రులలో వారానికి ఒక పరీక్ష కూడా పూర్తికాక పోవడం గమనార్హం. 

నల్లగొండలో అత్యధికంగా.. 
రాష్ట్రవ్యాప్తంగా చూస్తే...నల్లగొండ గవర్నమెంట్‌ జనరల్‌ ఆసుపత్రి (జీజీహెచ్‌) అత్యధికంగా 6,799 దరఖాస్తుల పెండింగ్‌తో అగ్రస్థానంలో నిలుస్తోంది. ఆ తర్వాత అత్యధికంగా పెండింగ్‌లో ఉన్న జిల్లాల విషయానికొస్తే... నారాయణపేట జిల్లా ఆసుపత్రిలో 3,774, నిర్మల్‌ జీజీహెచ్‌లో 3,745, నిజామాబాద్‌ జీజీహెచ్‌ 3,645, సూర్యాపేట జీజీహెచ్‌ 3,574, జగిత్యాల జీజీహెచ్‌ 3,465, కామారెడ్డి జీజీహెచ్‌ 3,377, కరీంనగర్‌ జీజీహెచ్‌ 3,313, ఆదిలాబాద్‌ రిమ్స్‌ 2,823, నాగర్‌కర్నూల్‌ జీజీహెచ్‌లో 2,811 దివ్యాంగుల అప్లికేషన్ల వెరిఫికేషన్‌ పెండింగ్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. పెండింగ్‌ దరఖాస్తులపై ప్రభుత్వం దృష్టి పెట్టి అర్హులందరికీ పింఛన్లు అందేలా చూడాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement