breaking news
disabilities
-
గోరంత సేవైనా గౌరవమే!
అది... రెండేళ్ల కిందటి సంఘటన. హైదరాబాద్ నగరంలో ప్రజాదర్బార్. పదుల కొద్దీ వీల్ చెయిర్లలో దివ్యాంగులు. వారి కష్టాన్ని సీయంకి వివరిస్తోందో మహిళ. అందరూ రోడ్డు పక్కన అడుక్కునే వాళ్లే. ప్రభుత్వం పెన్షన్ ఇస్తే అడుక్కోవడం మానేస్తారు. పెన్షన్ రావాలంటే ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డు రావాలంటే వారికో అడ్రస్ ఉండాలి. ఉండడానికి ఇల్లులేక, తినడానికి తిండి లేక రోడ్డు పక్కన భిక్షమెత్తుకుంటున్న వారిని అడ్రస్ అడిగితే ఏం చెప్పగలుగుతారు? ప్రభుత్వ వైఫల్యమే వీరి అడ్రస్, ఈ ప్రజాభవనే వీరి అడ్రస్... అని వాదించింది. సీయం పక్కనే రెవెన్యూ మినిస్టర్ కూడా ఉన్నారు. అడ్రస్ అవసరం లేకుండా ఆధార్ కార్డులు జారీ చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వ నియమావళికి, ఆపన్నుల అవసరానికి మధ్య ఉన్న అగాధం తొలగిపోయింది. దిక్కులేని వారికి ఆధారం దొరికింది. సమస్య ఉంది అంటే పరిష్కారం కూడా ఉంటుంది. అయితే సమస్యను సింపతీతో చూసినంత కాలం పరిష్కార మార్గం కనిపించదు, ఎంపతీతో చూసినప్పుడే ఆ దారి గోచరమవుతుంది. బాధితుల కష్టాన్ని తన కష్టంగా భావించి స్పందించే మనసు ఉండడంతోనే ఆమెకు పరిష్కార మార్గం కనిపించింది. ఆమె సోషల్ యాక్టివిస్ట్ శ్రీలక్ష్మి రెడ్డి.‘నాకు వందమంది శక్తిమంతులైన యువతను ఇవ్వండి, భారతదేశాన్ని మార్చి చూపిస్తాను’ అన్న వివేకానందుడే తనకు స్ఫూర్తి అంటారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలక్ష్మిరెడ్డి. భర్త, ముగ్గురు పిల్లలతో గృహిణిగా ఖమ్మంజిల్లా నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన ఆమె రామకృష్ణ మఠం బోధనలతో స్ఫూర్తి పొందారు. తొంభయ్యవ దశకం మొదట్లోనే లయన్స్ క్లబ్ సభ్యురాలిగా సేవాపథంలో నడిచారు. చదువంటే ఆమెకు తీరని దాహం. ముగ్గురు పిల్లలను ఉన్నత విద్యావంతులను చేయడంతోపాటు పెళ్లి కారణంగా ఆగిపోయిన తన చదువును కొనసాగించారు. ఇప్పుడామె ఎల్ఎల్బి స్టూడెంట్. ‘మహిళలు కుటుంబ సమస్యలతో వస్తుంటారు. వారి కాపురం నిలబెట్టడానికి లోకజ్ఞానంతో కౌన్సెలింగ్ ఇచ్చేదాన్ని. న్యాయపరమైన సలహా కోసం తరచూ మా వారిని విసిగించాల్సి వస్తోంది. నా ఫ్రీ సర్వీస్ కోసం ఇంట్లో వాళ్లను ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఆ కోర్సు నేనే చేస్తే మంచిది కదా అని చదువుతున్నాను’ అంటూ తన జీవితాన్ని సేవాపథంలోకి నడిపించిన సంఘటనను గుర్తు చేసుకున్నారామె. మహిళాౖ ఖెదీ వార్త ‘‘న్యూస్పేపర్లో ‘అత్త తల పగుల కొట్టిన మహిళ’ అనే వార్త నన్ను కదిలించి వేసింది. ఆ మహిళది సత్తుపల్లి. మా మండలమే. ఎందుకిలా చేసి ఉంటుంది... ఒకసారి మాట్లాడదాం అని చంచల్‌గూడ జైలుకెళ్లి ఆమెను కలిశాను. వ్యభిచారం చేసి డబ్బు సంపాదించమని ఒత్తిడి చేయడం, భర్త ముందు దోషిగా నిలబెట్టడం వంటి బాధలు తట్టుకోలేకపోయింది. మనసు చంపుకుని బతకలేక, పట్టలేని కోపంలో రోకలితో తల మీద మోదింది. చట్టపరంగా ఆ మహిళ చేసింది తప్పే కాబట్టి న్యాయస్థానం శిక్ష విధించింది. ఆమెకు చదువు లేదు. శిక్ష పూర్తయి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె ఎలా బతకాలి అనే ప్రశ్న చాలారోజులు నన్ను తొలిచేసింది. జైలు శిక్షణ జైలు శిక్ష కోసం మాత్రమే కాదు శిక్షణ కూడా ఇవ్వాలని మహిళా ఖైదీలకు ఫినాయిల్ మేకింగ్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్, బ్యూటీషియన్, కంప్యూటర్ కోర్సులు నేర్పించడం మొదలుపెట్టాను. డ్వాక్రా గ్రూపు లీడర్ల కు ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ ప్రోగ్రామ్‌లో వందలాది మహిళలకు శిక్షణనిచ్చాను. సమాజంలో నేను చూసిన సమస్యలు, నాకు ఎదురైన సవాళ్ల నుంచి పాఠాలు నేర్చుకున్నాను. ఆ పాఠాలే నా సేవకు సోపానాలు. మా ఉమ్మడి కుటుంబంలో ఏడాది బిడ్డ కంటిని కోల్పోయింది. ఇంటిల్లిపాదీ అనుభవించిన మానసిక క్షోభను దగ్గరగా చూశాను. అందుకే కంటి ఆపరేషన్ల మీద ఎక్కువ దృష్టి పెట్టాను. ఖైదీలకు కంటి ఆపరేషన్లు చేయించడానికి హోమ్ మంత్రి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ‘జైలు నుంచి సరోజినీదేవి కంటి ఆసుపత్రికి తీసుకెళ్లి, ఆపరేషన్ చేయించి కోలుకున్న తర్వాత తిరిగి జైల్లో దించడంలో ఏ మాత్రం తేడా జరిగినా నువ్వు జైల్లో ఉండాల్సి వస్తుందమ్మా జాగ్రత్త’ అని హెచ్చరించారు అప్పటి హోమ్ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి. విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ప్రశంసల వర్షం కురిపిస్తుంటే కానీ నేను చాలా పెద్ద సాహసం చేశానని తెలియలేదు. నిస్వార్థంగా గోరంత సేవ చేస్తే ఆకాశమంత గౌరవం దక్కుతుందని తెలిసింది. పాతికేళ్లు నిండిన సామాజిక సేవలో వర్మీ కంపోస్ట్ సర్వీస్‌కు రాష్ట్రపతి నుంచి పురస్కారం అందుకోవడం, రామకృష్ణ మఠం నుంచి మదర్ థెరిస్సా పురస్కారం నా మది నిండిన జ్ఞాపకాలు’’ అన్నారీ సామాజిక ఉద్యమకారిణి.ఆటా సభల్లో కొత్త భారతంజీవితం అంటేనే సవాళ్లమయం. కష్టం వచ్చిందని ఏ ఆడపిల్లా చనిపోకూడదు... తమ కాళ్ల మీద తాము నిలబడాలి, కష్టపెట్టిన వాళ్లు తలదించుకునేలా జీవించి చూపించాలనేదే నా సందేశం. అందుకే నా సర్వీస్‌లో హెల్త్, ఎడ్యుకేషన్, ఎకనమిక్ ఎంపవర్మెంట్ మీద దృష్టి పెట్టాను. సివిల్స్ ప్రిపరేషన్ కోసం హైదరాబాద్‌కు వచ్చిన పేదింటి ఆడపిల్లలకు ఉచితంగా బస, భోజనం అందిస్తున్నాను. మా తరంలో మహిళలకు అందని అభివృద్ధిని ఈ తరం యువతుల్లో చూస్తున్నాను. అయితే మనదేశంలో ఆడవాళ్లు ఎంత చదివినా, ఎంత పెద్ద బాధ్యతలు నిర్వర్తిస్తున్నా సరే... ఇంటికి వచ్చేటప్పటికి ఆమె గృహిణిగా మారిపోవాల్సిందే. గరిట ఆమె కోసం చూస్తూ ఉంటుంది. 2012లో ఆటా సభలకు యూఎస్‌లోని ఆట్లాంటాకు వెళ్లినప్పుడు మనం కోరుకుంటున్న స్త్రీ సమానత్వాన్ని అక్కడ చూశాను. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసుకుంటారు, ఇంటిపనులను పంచుకుంటారు. యువతరం ఆలోచనలు సున్నితత్వాన్ని సంతరించుకుంటున్నందుకు సంతోషం కలుగుతోంది.– శ్రీలక్ష్మి రెడ్డి, సోషల్ యాక్టివిస్ట్– వాకా మంజులారెడ్డి‘సాక్షి’ స్టేట్ బ్యూరోఫొటో: నోముల రాజేశ్‌రెడ్డి -
యాసిడ్ బాధితుల కోసం చట్టాన్ని సవరించాలి
న్యూఢిల్లీ: నేరగాళ్ల బలవంతంపై యాసిడ్ తాగిన బాధితులను ‘రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్’లో చేర్చేందుకు చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. చట్టాన్ని సవరించి, యాసిడ్ కారణంగా అనేక ఇబ్బందులకు గురవుతున్న బాధితులకు సంక్షేమ పథకాలను ఉపయోగించుకునేలా చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చిల ధర్మాసనం కోరింది. యాసిడ్ దాడి బాధితురాలు షహీన్ మాలిక్ వేసిన పిల్‌పై ఈ నెల 4వ తేదీన విచారణ జరిపిన ధర్మాసనం..ఢిల్లీలోని రోహిణి కోర్టులో 16 ఏళ్లుగా పెండింగ్‌లో ఉండటంపై విస్మయం వ్యక్తం చేయడంతోపాటు, వివిధ హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న యాసిడ్ దాడి కేసుల వివరాలను తెలపాలంటూ ఆదేశాలివ్వడం తెల్సిందే. షహీన్ మాలిక్ కేసు విచారణ రోజువారీగా జరుగుతోందని, ముగింపునకు వచ్చిందని గురువారం విచారణ సందర్భంగా ధర్మాసనానికి రోహిణి కోర్టు సమాచారం అందజేసింది. అదే సమయంలో, యాసిడ్ దాడి కేసుల గురించి మాత్రమే తమకు ఇప్పటి వరకు తెలుసని, నేరగాళ్లు యాసిడ్ తాగించడంతో అంతర్గత వ్యవస్థలు దెబ్బతిన్న కేసులు కూడా ఉన్న విషయం ఇప్పుడే తెలిసిందని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. పిటిషనర్ కోరిన విధంగా, ఇటువంటి బాధితులకు న్యాయం చేసేందుకు, చట్టాన్ని అవసరమైన సవరణ చేపట్టేందుకు కేంద్రం సానుకూలంగా ఉందని ఆయన అన్నారు. చట్టానికి తీసుకురావాల్సిన సవరణలపై ఒక నోట్ అందజేయాల్సిందిగా సీజేఐ ఈ సందర్భంగా పిటిషనర్‌ను కోరారు. అందులోని అంశాలను కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపారు. దీంతోపాటు, బలవంతంగా యాసిడ్ తాగిన వారికి రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం రూ.3 లక్షలు మాత్రమే పరిహారంగా అందజేస్తున్నాయని పిటిషనర్ తెలపగా, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ(నల్సా) నుంచి కూడా పరిహారం అందించే విషయం పరిశీలిస్తామన్నారు. అదేవిధంగా, జమ్మూకశ్మీర్, లద్దాఖ్ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న ఐదు యాసిడ్ దాడి కేసులపై వేగవంతంగా విచారణ పూర్తి చేయాలని ఉత్తర్వు జారీ చేసింది. -
చూపు లేకున్నా.. శరీరం సహకరించకున్నా..
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం 2025: దివ్యాంగులు.. అద్భుతమైన శక్తికి, అసమానమైన దృఢత్వానికి, సృజనాత్మకతకు నిదర్శనంగా నిలుస్తున్నారు. భౌతిక అడ్డంకులను ధైర్యంగా అధిగమిస్తూ, ధృఢ సంకల్పానికి ప్రతీకగా కనిపిస్తున్నారు. కళలు, క్రీడలు, సైన్స్, సాంకేతికతతో సహా జీవితంలోని ప్రతి రంగంలో వారు సాధిస్తున్న అద్భుత విజయాలు అందరికీ స్ఫూర్తినిస్తున్నాయి. తమకున్న వైకల్యం కారణంగా ప్రపంచాన్ని భిన్నమైన కోణం నుండి చూస్తూ, విజయాలు సాధిస్తున్న దివ్యాంగులు మనకెందరో కనిపిస్తారు. సమాజంలో వారి భాగస్వామ్యాన్ని గుర్తించే ఉద్దేశ్యంతో ప్రతీయేటా డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహిస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న దివ్యాంగుల హక్కులు, గౌరవం, సంక్షేమంపై దృష్టి సారించే కీలకమైన వార్షిక వేడుకే అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం (International Day of Persons with Disabilities - IDPD). 1992 నుండి ఐక్యరాజ్యసమితి గుర్తించిన ఈ దినోత్సవం.. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో దివ్యాంగుల సంపూర్ణ భాగస్వామ్య ఆవశ్యకతను నొక్కి చెబుతుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఒక బిలియన్ మంది (15%) ఏదో ఒక వైకల్యంతో జీవిస్తున్నారు.2025లో ఐడీపీడీ థీమ్ ‘సామాజిక పురోగతిని ముందుకు తీసుకెళ్లేందుకు.. దివ్యాంగులను కలుపుకుని వెళ్లే సమాజాలను పెంపొందించడం’. ఈ థీమ్‌ను రెండవ ప్రపంచ సామాజిక అభివృద్ధి సదస్సు సందర్భంగా ప్రపంచ నేతలు ఎంపిక చేశారు. ఈ లక్ష్యం కేవలం అవగాహనకే పరిమితం కాకుండా, కార్యాచరణకు ప్రాధాన్యత ఇస్తుంది. 2030 సుస్థిర అభివృద్ధి ఎజెండాలో వైకల్యాన్ని చేర్చడాన్ని ఈ థీమ్ ప్రోత్సహిస్తుంది. దివ్యాంగుల దినోత్సవం వేళ తమ సంకల్ప బలంతో వైకల్యాన్ని జయించిన దివ్యాంగుల విజయగాథలు కొన్ని గుర్తు చేసుకుందాం.స్టీఫెన్ హాకింగ్ (యునైటెడ్ కింగ్డమ్)యునైటెడ్ కింగ్డమ్కు చెందిన స్టీఫెన్ హాకింగ్, అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ (ALS) అనే వ్యాధితో వీల్‌చైర్‌కే పరిమితమయ్యారు. అయితే విశ్వ రహస్యాలను ఛేదించిన ప్రపంచ ప్రఖ్యాత సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త , కాస్మోలజిస్ట్గా తనను తాను నిరూపించుకున్నారు. ఆయన ‘A Brief History of Time’ వంటి పుస్తకాల ద్వారా బ్లాక్ హోల్స్, సమయం గురించి విప్లవాత్మక సిద్ధాంతాలను ప్రతిపాదించారు. వైకల్యం శరీరానికే తప్ప మేధస్సుకు కాదని నిరూపించిన మహనీయుడు స్టీఫెన్ హాకింగ్.హెలెన్ కెల్లర్ (అమెరికా)యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందిన హెలెన్ కెల్లర్, చిన్నతనంలో అంధత్వంతో పాటు చెవుడును ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఆమె పట్టుదలతో చదువుకుని, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందిన మొదటి అంధురాలుగా చరిత్ర సృష్టించారు.ఇరా సింఘాల్ (ఢిల్లీ)ఢిల్లీకి చెందిన ఇరా సింఘాల్, స్కోలియోసిస్ (వెన్నెముక వైకల్యం) ఉన్నప్పటికీ, యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలో అత్యున్నత లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. 2014లో అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంకు సాధించి, చరిత్ర సృష్టించారు. అంగవైకల్యం కారణంగా గతంలో తన అభ్యర్థిత్వాన్ని తిరస్కరించినా, న్యాయ పోరాటం చేసి గెలిచిన ఆమె, దృఢ సంకల్పానికి ప్రతిరూపంగా నిలిచారు.దీపా మాలిక్ (హర్యానా)హర్యానాకు చెందిన దీపా మాలిక్.. గుండెల్లో కణితి కారణంగా నడుము కింద పక్షవాతానికి గురయ్యారు. అయినప్పటికీ ఆమె షాట్‌పుట్, జావెలిన్ త్రో వంటి క్రీడలలో పాల్గొని, పారా ఒలింపిక్స్‌లో పతకం (రజతం) సాధించిన మొదటి భారతీయ మహిళా అథ్లెట్‌గా గుర్తింపు పొందారు. ఆమెకు పద్మశ్రీ , ఖేల్ రత్న అవార్డులు లభించాయి.సుధా చంద్రన్ (ముంబై/తమిళనాడు)ముంబై/తమిళనాడు మూలాలున్న సుధా చంద్రన్ రోడ్డు ప్రమాదంలో ఒక కాలు కోల్పోయారు. అయినా కూడా కృత్రిమ కాలు (Jaipur Foot) సహాయంతో తిరిగి భరతనాట్యం సాధన చేసి గొప్ప నర్తకిగా, నటిగా ఎదిగారు.మరియప్పన్ తంగవేలు (తమిళనాడు)తమిళనాడుకు చెందిన మరియప్పన్ తంగవేలు, చిన్నతనంలోనే ఒక కాలు వైకల్యానికి గురయ్యారు. అయినప్పటికీ పట్టుదలతో పారా ఒలింపిక్స్ హైజంప్‌లో రాణించి, 2016లో స్వర్ణం, 2020లో రజతం సాధించి భారతదేశ క్రీడారంగానికి కీర్తిని తెచ్చారు.అమృత్ (ఆంధ్రప్రదేశ్)ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన యువకుడు అమృత్, తీవ్ర శారీరక వైకల్యంతో ఉన్నప్పటికీ, కేవలం రెండు చూపుడు వేళ్ల సాయంతో కంప్యూటర్‌పై పనిచేయడం నేర్చుకుని, అమెజాన్ సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించారు.మధు కుమార్ (తెలంగాణ)తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాకు చెందిన మధు కుమార్, విద్యుదాఘాతంలో రెండు చేతులు, కాళ్లు కోల్పోయారు. అయినప్పటికీ తన సంకల్పంతో పుస్తకాల్లోని పేజీలను నోటితో మార్చుకుంటూ, నోటి సహాయంతో పెన్ను పట్టుకుని రాస్తూ, పదవ తరగతిలో 86% మార్కులు సాధించి. దృఢ సంకల్పశీలిగా నిలిచారు.మురళీకాంత్ పేట్కర్ (మహారాష్ట్ర)మహారాష్ట్రకు చెందిన మురళీకాంత్ పేట్కర్, 1965 యుద్ధంలో తీవ్రంగా గాయపడి నడుము కింది భాగం పక్షవాతానికి గురయ్యారు. అయినా స్విమ్మింగ్‌ను ఎంచుకుని, పారా ఒలింపిక్స్‌లో (1972) భారతదేశానికి మొదటి బంగారు పతకం సాధించిన క్రీడాకారునిగా నిలిచారు.ఇది కూడా చదవండి: ఊపిరి కోసం యుద్ధం.. రెండు లక్షల మందికి అస్వస్థత! -
వైకల్యాలకు చికిత్స అందాలి
అన్ని అవయవాలూ సరిగా ఉన్నవారే ఈ లోకంలో మనుగడ సాగించడం కష్టమయ్యే ఈ రోజుల్లో ఏదైనా కారణాలవల్ల ఏదైనా అవయవం కోల్పోతే? ఎంతో కష్టమయ్యే ఆ జీవితాన్ని ఏదో విధంగా మళ్లీ నార్మల్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు నిపుణులైన డాక్టర్లు. ఈ నెల (డిసెంబరు) 3న ప్రపంచ డిజ్ఎబిటిటీ డే (ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజ్‌ఎబిలిటీస్) సందర్భంగా దివ్యాంగుల వైకల్యాలను సరిదిద్దడంలో నిపుణులైన డాక్టర్ ప్రేమ్‌నాథ్ బల్లా అనేక వైకల్యాల గురించి అందించిన వివరాలు తెలుసుకుందాం.ప్రశ్న: వైకల్యాలు ఎన్ని రకాలుగా ఉండవచ్చు? డాక్టర్ ప్రేమ్‌నాథ్ : వైకల్యాలు దాదాపుగా వందల రకాలుగా ఉండవచ్చు. అయితే ప్రధానంగా రెండు రకాలుగా చెప్పవచ్చు. మొదటిది శారీరక వైకల్యాలూ (ఫిజికల్ / విజిబుల్ డిజ్‌ఎబిలిటీస్), రెండోది మానసిక వైకల్యాలు. వీటిని మెంటల్ ఇల్నెస్ / డిజ్ఎబిలిటీస్గా చెప్పవచ్చుగానీ ఆధునికమైన భాషలో అదంత నాగరికంగా ఉండకపోవచ్చు కాబట్టి సైకలాజికల్ / ఇన్విజిబుల్ అని చెప్పడమే ఔచిత్యంగా ఉంటుంది. వాటిని అధ్యయనం చేయడానికి, ఒక కేటగిరీలో ఉంచడం ద్వారా వైద్యం అందించడం సులభతరం చేయడానికి వాటిని ప్రధానంగా (బ్రాడ్‌గా) నాలుగు రకాలుగా విభజించవచ్చు. అవి..1. భౌతికమైన వైకల్యాలు 2. ప్రవర్తనా పూర్వకమైనవి 3. అభివృద్ధి లోపించడం వల్ల కలిగినవి 4.జ్ఞానేంద్రియాలకు సంబంధించినవి. ప్రశ్న : కాస్త వాటిని విపులీకరిస్తారా? డాక్టర్ ప్రేమ్‌నాథ్ : తప్పకుండా...⇒ మొదటగా ఫిజికల్ డిజ్ఎబిలిటీ: తలకు ఏదైనా దెబ్బతగిలి మెదడుకు గానీ, వెన్నుపూసకు గానీ గాయమైందనప్పుడు మెదడు కంట్రోల్ చేసే సెంటర్ తాలూకు అవయవానికీ లేదా వెన్నుపూస నుంచి వెళ్లే నరాల నుంచి ఆ అవయవానికి తగిన సిగ్నల్స్ అందక సదరు అవయవం చచ్చుబడవచ్చు. ఇందులో రోడ్డు ప్రమాదాలు వల్ల వచ్చిన వైకల్యాలూ ఉండవచ్చు. ⇒ రెండో రకం బిహేవియరల్ డిజ్‌ఎబిలిటీస్ అంటే... ప్రవర్తనలో లోపాలు. ఇవి చాలారకాలుగా ఉండవచ్చు. పిల్లల విషయానికి వస్తే... స్కూల్లో పిల్లల ప్రవర్తన అతిగా ఉండటం, ఇక పెద్దల విషయానికి వస్తే... సామాజికంగా వ్యవహరించాల్సిన తీరులో వ్యవహరించకపోవడం... దాంతో వ్యక్తిగత బంధాలూ, సంబంధాలూ దెబ్బతినడం జరుగుతాయి. ఉదాహరణకు పిల్లల్లో అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ (పిల్లలు కంట్రోల్ చేయలేనంత అతి చురుగ్గా ఉండటం) అపోజిషనల్ డీఫియెంట్ డిజార్డర్ (పిల్లలు చాలా తిరుగుబాటుదనంగా వ్యవహరించడం) వంటివి. పెద్దల విషయానికి వస్తే యాంగై్జటీ డిజార్డర్, ఈటింగ్ డిజార్డర్స్, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్స్ (ఓసీడీ) వంటివి ఉండవచ్చు. ఈ లోపాల్లో అంగవైకల్యాలు పెద్దగా ఉండవుగానీ మానసిక వైకల్యాలు ఉంటాయి.⇒మూడోది డెవలప్మెంటల్ డిజ్‌ఎబిలిటీస్: ఇందులో కొన్ని చిన్న చిన్న బాహ్య లక్షణాలు మినహాయించి పిల్లలు చూడటానికి అన్ని విధాలా అన్ని అవయవాలతో కనిపిస్తారు. కానీ వాళ్లలో ఏ వయసు తగినంతగా ఆ వయసుకు సరిపడిన వికాసం (మైల్‌స్టోన్స్) లేనందున ఇటు పిల్లలకూ, అటు వారి తల్లిదండ్రులకూ ఈ వైకల్యాలు ఎంతో బాధగా పరిణమిస్తాయి. ఉదాహరణకు ఆటిజమ్ స్పెక్ట్రమ్ డిసీజ్, సెరిబ్రల్ పాల్సీ, సరిగా మాట్లాడలేని / కమ్యూనికేట్ చేయలేని లాంగ్వేజ్ డిజార్డర్స్, డౌన్స్ సిండ్రోమ్... ఇలా వివరించుకుంటూపోతే ఒక్కోటీ ఒక పుస్తకమే రాసేంత సబ్జెక్టులు ఇవి. ⇒ నాలురో రకం వైకల్యాలను సెన్సరీ డిజ్ఎబిలిటీస్గా చెప్పవచ్చు. ఇవి జ్ఞానేంద్రియాలకు సంబంధించినవి. అంటే చూపు జ్ఞానం ఇచ్చే కళ్లకు ఏదైనా దెబ్బతగలడం వల్ల అంధత్వం, చెవులకు వచ్చే వినికిడి సమస్యలు... జ్వరం లేదా జలుబు వచ్చినప్పుడు తాత్కాలికంగా రుచి, వాసన తెలియకపోవడం (ఇది చాలా తాత్కాలికం). ఇలా మన జ్ఞానేంద్రియాలల్లో ఏదైనా అడ్డంకులు కలగడం వల్ల ఏర్పడే వీటికి సంబంధించిన చికిత్సలు అందించి సాధ్యమైనంతవరకు సెన్సరీ డిజ్ఎబిలిటీస్ను సరిచేయడానికి ప్రయత్నిస్తారు. ఇలా మన వైకల్యాలను వర్గీకరించి, వాటికి అనుగుణంగా చికిత్సలు అందిస్తాం. ప్రశ్న : ఇప్పుడు ఎలాంటి వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? డాక్టర్ ప్రేమ్‌నాథ్ : వైకల్యాన్ని బట్టి చికిత్స అందించాల్సి ఉంటుంది. ఉదాహరణకు... మొదట భౌతిక వైకల్యాల విషయానికి వస్తే... గతంలో క్యాన్సర్ సోకి... అది కాళ్లూ లేదా చేతుల ఎముకలకు పాకిందంటే... దాన్ని దేహం నుంచి వేరు చేయాల్సి వచ్చేది. అలా ఒక అవయవాన్ని తొలగించడాన్ని ‘యాంపుటేషన్’ అంటారు. దాంతో ఆ వ్యక్తి జీవితాంతం అంగవైకల్యంతో బాధపడాల్సి వచ్చేది. అయితే ఇప్పటి సాంకేతిక పురోగతి, అధునాతన వైద్యవిజ్ఞానాలతో కాళ్లూ, చేతుల యాంపుటేషన్ చేయకుండా... వాటిని రక్షించేందుకు ‘లింబ్ సాల్వేజ్ శస్త్రచికిత్సల’తోనూ, ఆపైన ఫిజియోథెరపీలతో ఇలాంటి వారికీ వైకల్యం తగ్గేలా చూసేందుకు అవకాశముంది.ఇందులోనూ బ్రెయిన్‌డెడ్‌గా మృతిచెందిన వ్యక్తుల నుంచి గుండె, లంగ్స్, కిడ్నీల మాదిరిగానే మృతిచెందిన వ్యక్తి దేహం నుంచి సేకరించిన ఎముకలను బాధితుడికి అమర్చే అల్లోగ్రాఫ్ట్ బోన్ రీప్లేస్మెంట్ అనే ప్రక్రియ; ఇక మృతుడి శరీరం నుంచి కాకుండా... కృత్రిమంగా, ఎలాంటి రసాయన చర్యలకు లోనుకాని/గురికాని లోహం (ఇనర్ట్ మెటల్)తో తయారైన ఎండో్రపోస్థెసిస్ ను అమర్చడం; ఇక బాధితుడి సొంత కణాలనే సేకరించి, వాటిని ‘ప్యూరిఫైడ్ప్రోటీన్ గ్రోత్ ఫ్యాక్టర్’లాంటి చర్యలతోనూ, ‘సింథటిక్ మాట్రిక్స్ మెటీరియల్’ లాంటి పదార్థాలతో బాధితుడు కోల్పోయిన అవే కణాలూ, కణజాలాలను... మళ్లీ ముందులాగే పెరిగేలా చేసే ‘టిష్యూ రీజనరేషన్’ వంటి అధునాతన ప్రక్రియలు ఉంటాయి. ప్రశ్న : మరి బిహేవియరల్ డిజ్ఎబిలిటీస్కు? డాక్టర్ ప్రేమ్‌నాథ్ : ప్రధానంగా బిహేవియరల్ డిజ్ఎబిలిటీస్కు సైకియాట్రిస్టులు / రీహ్యాబిలిటేషన్ స్పెషలిస్టులు / క్లినికల్ సైకాలజిస్టుల ఆధ్వర్యంలో బిహేవియర్ థెరపీ వంటి ప్రక్రియలతో చికిత్స అందిస్తారు. ప్రశ్న : డెవలప్మెంటల్ డిజ్‌ఎబిలిటీస్ గురించి వివరించండి. డాక్టర్ ప్రేమ్‌నాథ్ : డిజ్ఎబిటీస్లో అన్నిటికంటే ప్రధానమైనవి ఈ డెవలప్మెంటల్కు సంబంధించినవి. వీటిలో ఆటిజమ్ స్పెక్ట్రమ్ డిసీజ్ తీసుకుంటే ఇది ఇదమిత్థంగా ఎలా వస్తుందో తెలియదు. నిర్ణీతమైన చికిత్స ప్రక్రియలు ఉండవు. అంటే ప్రతి బిడ్డకూ ఒకేలాంటి చికిత్స కాకుండా వ్యక్తిగతమైన (పర్సనలైజ్డ్) చికిత్స అందించాల్సి వస్తుంది. ఇక సెన్సరీ డిజార్డర్స్‌లో కొన్నిటికి చికిత్స ఉంటుంది. మరికొన్నింటికి ఉండదు. ఉదాహరణకు ఒక వ్యక్తికి కంటిలో క్యాటరాక్ట్ వస్తే... దాన్ని చిన్న శస్త్రచికిత్సతో సరిదిద్ది మళ్లీ చూపు కనిపించేలా చేయవచ్చు. అలాగే వినికిడి కోసం కాక్లియర్ ఇం΄్లాంట్ అమర్చగానే సమస్య సరైపోతుంది. కొన్నిసార్లు హియరింగ్ ఎయిడ్స్తోనూ వినికిడి సమస్యను సమసిపోతుంది. ఇలా సెన్సోరియల్ డిజెబిలిటీస్లో చాలావరకు చికిత్స ఉంటుంది. కానీ డెవలప్మెంట్ డిజ్‌ఎబిలిటీస్ విషయంలో చాలా అనుభవం, నైపుణ్యం అవసరం.బిడ్డలోని లోపాన్నీ, లోపం తీవ్రతనూ, దాన్ని ఏ మేరకు మెరుగుపరచగలమనే అంశాన్ని బట్టి అనేక కోణాలలో చిన్నారి తాలూకు డిజ్ఎబిలిటీస్ను విశ్లేషించి చికిత్స అందించాలి. బిడ్డను చాలావరకు నార్మల్ చేయగలిగేలా, కనీసం తాను ఎవరికీ భారం కాకుండా తన పనులు తాను చేసుకోగలిగేలా తీర్చిదిద్దాలి. సరిగా మాట్లాడలేనివారికి స్పీచ్ థెరపీ ఇవ్వాలి. తన చేతులు సరిగా వాడగలిగేలా ఆక్యుపేషనల్ థెరపీ ఇవ్వాలి. ఇలా రకరకాల పద్ధతుల్లో చికిత్స అందించాల్సి వస్తుంది. ప్రశ్న : మెడికల్ రిహాబిలిటేషన్ చికిత్సలో ప్రధానమైన విభాగాలు ఏమిటి? డాక్టర్ ప్రేమనాథ్ : స్పీచ్ థెరపీ, ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ... ఇలా వాళ్ల రుగ్మతలను బట్టి, లోపాలూ, అవసరాలను బట్టి ఈ విభాగాల ద్వారా చికిత్స అందిస్తారు. ప్రశ్న : ఇప్పుడు డిజెబిలిటీ ఉన్న దాదాపు అందరికీ చికిత్స అందే పరిస్థితిగానీ, అవకాశాలుగానీ ఇప్పుడు ఉన్నాయా? డాక్టర్ ప్రేమ్‌నాథ్ : దురదృష్టవశాత్తూ పూర్తిగా లేవనే చెప్పాలి. పెద్ద నగరాల్లో ఉండేవారికే ఈ వైకల్యాలపై తగినంత అవగాహన లేదు. మారుమూల పల్లెల్లోవాళ్ల సంగతి గురించి చెప్పనే అక్కర్లేదు. ఇక మన దగ్గర ఆడపిల్ల అంటే ఉన్న వివక్ష ఉండనే ఉంది. ఉదాహరణకు ఆటిజమ్ మగ, ఆడపిల్లల్లో 2:1 నిష్పత్తిలో ఉంది. కానీ మన సమాజంలో ఆడపిల్లలకు జబ్బు ఉందంటే తాను ఎంతో వివక్షకు గురవుతుంది కాబట్టి వారిని చికిత్స కోసం తీసుకురారు. ఆటిజమ్ మొదలుకొని అన్నిరకాల వైకల్యాలలోనూ ఎంత త్వరగా చికిత్స కోసం తీసుకువస్తే అంత మంచిది.ఆటిజమ్ వంటి కొన్ని వైకల్యాల విషయంలో నిర్ణీతమైన చికిత్స లేకపోవడం వంటి అంశాలను ఆసరాగా చేసుకుని కొందరు ఏమాత్రం పరిజ్ఞానమూ, అనుభవమూ, సరైన విద్యార్హతలు లేనివారు కూడా చికిత్స పేరిట పేరెంట్స్‌ను దోచుకుంటున్నారు. ఎంతో అనుభవం, నైపుణ్యం అవసరమైన ఈ వైకల్యాలకు చికిత్స అందించే విషయంలో శిక్షణపొందిన చికిత్సకుల అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం నేనూ, మాలాంటి కొందరు... తగిన శిక్షణ ద్వారా అలాంటి అనుభవజ్ఞులను అనేక మందిని తయారు చేసి వారిని సమాజానికి అందించడం అనే పని కూడా చేస్తున్నాం. అది మా బాధ్యత అని అనుకుంటున్నాం. – యాసీన్డాక్టర్ ప్రేమ్‌నాథ్ బల్లా, సీనియర్ న్యూరో రీ–హ్యాబిలిటేషన్ మెడిసిన్ స్పెషలిస్ట్ అండ్ స్పీచ్ పాథాలజిస్ట్ -
‘ప్రత్యేక’ విద్య అందించాలి!
వైకల్యం అనేది శరీరానికి సంబంధించిన ఒక పరిమితి మాత్రమే, మనసుకు కాదు. ఈ మహత్తరమైన సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న ‘అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం’ ప్రపంచవ్యాప్తంగా జరుపుకొంటున్నాం. శారీ రక, మానసిక, దృశ్య, శ్రవణాల్లో ఏ వైకల్యం ఉన్నవారికైనా మిగతా వారితో పాటు సమాన హక్కులు, సమాన అవకాశాలు, గౌరవ ప్రదమైన జీవితం ఉండాలని గుర్తు చేసే రోజు ఇది. మిగతా రంగాల్లో ఎలా ఉన్నా... క్రీడా రంగంలో వికలాంగులు ప్రపంచ వ్యాప్తంగా అద్భుత నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు. ప్యారా అథ్లెటిక్స్ వారి ధైర్యానికీ, పట్టుదలకూ, నిశ్చయానికీ ప్రతీక. మన దేశం ప్యారా అథ్లెట్ల వల్ల ప్రపంచ వేదికపై వెలుగొందు తోంది. భారతదేశానికి తొలి ప్యారాలింపిక్ స్వర్ణ పతకాన్ని అందించిన మురళీకాంత్ పేట్కర్ 1965 ఇండో–పాక్ యుద్ధంలో శత్రువుల దాడిలో తీవ్రంగా గాయపడి శాశ్వత వైకల్యం పాలయ్యారు. దీంతో వీల్ చైర్‌పై కొత్త జీవితం ప్రారంభించారు. 1972లో పశ్చిమ జర్మనీ లోని హీడెల్బర్గ్లో జరిగిన ప్యారాలింపిక్ క్రీడల్లో చరిత్ర సృష్టించారు. 50 మీటర్ల ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్ ఈవెంట్లో 37.33 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని ప్రపంచ రికార్డుతో పాటు భారతదేశానికి మొట్ట మొదటి వ్యక్తిగత ప్యారాలింపిక్ స్వర్ణ పతకాన్ని అందించారు. క్రీడ లకు ఆయన చేసిన సేవకు గుర్తింపుగా, భారత ప్రభుత్వం 2018లో ‘పద్మశ్రీ’, 50 ఏళ్లకు పైగా నిరీక్షణ తర్వాత 2024 సంవ త్సరానికిగానూ ‘అర్జున’ అవార్డు ఇచ్చి సత్కరించింది. ఆయన అసాధారణ జీవిత కథ ఆధారంగా హిందీ చిత్రం ‘చందు ఛాంపి యన్’ 2024లో విడుదలైంది. భారతదేశం ఇప్పటివరకు ప్యారాలింపిక్స్‌లో 60 పతకాలను గెలుచుకుంది. దేవేంద్ర ఝాఝరియా తన బాల్యంలోనే ప్రమాదవ శాత్తు తన ఎడమ చేతిని కోల్పోయాడు. ప్యారా అథ్లెటిక్స్ విభాగంలో ఏథెన్స్ (2004), రియో డీజెనీరో (2016)లో జావలిన్‌త్రోలో స్వర్ణాలు గెలిచాడు. అవనీ లేఖరా 11 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తీవ్ర కారు ప్రమాదం కారణంగా రెండు కాళ్లు దాదాపు పనిచేయడం మానుకున్నాయి. ప్యారాప్లీజియా వ్యాధిని ఎదుర్కొంది. ఈ స్థితిలో షూటింగ్లో కెరీర్ ప్రారంభించి ప్రపంచ స్థాయికి ఎదిగింది. ప్యారాలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మొదటి భారతీయ మహిళ అయ్యింది. మారియప్పన్ తంగవేలు భారతీయ పారా హైజంపర్, వరుసగా మూడు ప్యారాలింపిక్స్‌లో పతకాలు గెలుచు కున్న మొదటి భారతీయుడు.పుట్టుకతోనే రెండు చేతులు లేకుండా జన్మించిన శీత్లా దేవి కాళ్లతో, నోటితో విల్లును, బాణాన్ని పట్టుకుని వదలడంలో శిక్షణ పొంది. 2024 ప్యారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది. 2023లో రాష్ట్రపతి చేతుల మీదుగా ‘అర్జున’ అవార్డు అందుకుంది. ప్రపంచ దేశాల్లో అనేకం ఇటువంటి విజయగాథలు కనిపిస్తాయి. మనదేశంలో అందరికీ చదువుకునే హక్కు ఉంది కానీ అంగ వైకల్యం ఉన్నవారికి అది ఇంకా దూరంగానే ఉండిపోయింది. అంగ వైకల్య విద్యార్థుల కోసం ప్రత్యేక శారీరక విద్య అందించాలని చట్టం ఉన్నా అది సరిగా అమలుకు నోచుకోవడం లేదు. భారత దేశంలో సుమారు 78 లక్షల అంగవైకల్యం ఉన్న విద్యార్థులు ఉన్నారు. వారిలో 70% విద్యార్థులు ప్రత్యేక శారీరక విద్య పొందడం లేదు. పాఠశాలల్లో వీరికి బోధించగల అర్హతలు ఉన్న టీచర్లు 15 శాతమే. అంగవైకల్యం ఉన్న విద్యార్థులు ఆటల ద్వారా ఎదగాలి, గెలవాలి, ప్రపంచాన్ని మార్చాలి. ప్రత్యేక శారీరక విద్య అంటే ఒక కార్యక్రమం కాదు, వారి భవిష్యత్తుకు తలుపులు తెరచే బంగారు తాళం చెవి. – జక్కుల వెంకటేశ్ యాదవ్ ‘ విద్యార్థి నాయకుడు(రేపు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం) -
లక్షకు పైగా వికలాంగుల పెన్షన్లు తొలగించాం
నర్సీపట్నం: ఇప్పటివరకు రాష్ట్రంలో లక్షకు పైగా వికలాంగుల పెన్షన్లు తొలగించామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. అనర్హులైన వికలాంగులకు పింఛన్ తొలగించమని సీఎం చంద్రబాబుకు తానే లేఖ రాశానని చెప్పారు. రాష్ట్రంలో 14 నెలల్లో 4.5 లక్షల పెన్షన్లు తొలగించారు. వికలాంగ పెన్షన్లు లక్ష వరకు తొలగించామని సాక్షాత్తు స్పీకరే చెబుతున్నారు. రానున్న కాలంలో మరెన్ని పెన్షన్లకు మంగళం పలుకుతారోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో స్పీకర్ మీడియాతో మాట్లాడుతూ.. అర్హత లేకుండా పెన్షన్ పొందుతున్న వికలాంగులు రాష్ట్రంలో లక్షల మంది ఉన్నారన్నారు.ఈ విషయమై రెండు నెలలు క్రితం తానే స్వయంగా సీఎం చంద్రబాబుకు లేఖ రాసినట్టు తెలిపారు. నిబంధనల ప్రకారం 40 శాతానికి పైగా వైకల్యం ఉన్న వారిని మాత్రమే అర్హులుగా గుర్తించాల్సి ఉందన్నారు. 40 శాతం కంటే తక్కువ ఉన్నవారిని అనర్హులుగా గుర్తించాలన్నారు. అనకాపల్లి జిల్లాలో 4,148 మంది వికలాంగుల్లో 40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్న వారిని గుర్తించారన్నారు. అందులో 120 మందిని ఆరోగ్య పింఛన్లకు ఎంపిక చేసినట్టు తెలిపారు. 679 మందిని వృద్ధాప్య పింఛన్లలోకి మార్చగా.. 3,349 మంది వికలాంగుల పింఛన్లు రద్దు చేసినట్టు వెల్లడించారు. -
YS Jagan: వైకల్యం అనేది శరీరానికే కానీ.. సంకల్పానికి కాదు.
-
సమాజాన్ని చూసే తీరును నా కూతుళ్లు మార్చేశారు
న్యూఢిల్లీ: దివ్యాంగుల పట్ల, ముఖ్యంగా దివ్యాంగ బాలల పట్ల సమాజం వ్యవహరించే తీరులో మార్పు రావాల్సిన అవసరముందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. దివ్యాంగ బాలలు లైంగిక హింసకు సులువైన లక్ష్యాలుగా మారుతున్నారంటూ ఆవేదన వెలిబుచ్చారు. ఈ దారుణాల నుంచి కాపాడుకోవడం, వాటి బారిన పడేవారి పట్ల సహానుభూతితో వ్యవహరించడం మనందరి బాధ్యత అన్నారు. శనివారం ఆయన దివ్యాంగ బాలల హక్కుల పరిరక్షణపై 9వ జాతీయ సదస్సులో పాల్గొన్నారు. దివ్యాంగుల హక్కులపై సుప్రీంకోర్టు హాండ్‌బుక్‌ను విడుదల చేశారు. అనంతరం ప్రారంభోపన్యాసం చేశారు. ‘‘దివ్యాంగ బాలల భద్రత, సంక్షేమానికి నా హృదయంలో ప్రత్యేక స్థానముంది. నేను దివ్యాంగులైన ఇద్దరు ఆడపిల్లల తండ్రిని. సమాజం పట్ల నా దృక్కోణాన్ని నా కూతుళ్లు పూర్తిగా మార్చేశారు’’ అని చెప్పారు. నైపుణ్యం, సామర్థ్యాలతో నిమిత్తం లేకుండా బాలల హక్కులను పరిపూర్ణంగా పరిరక్షించే ఆదర్శ సమాజమే మనందరి లక్ష్యం కావాలని సూచించారు. ఇందుకోసం పలు కీలకాంశాలపై దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు. ‘‘దివ్యాంగ బాలల సమస్యలను గుర్తించాలి. లైంగిక దాడుల వంటి హేయమైన నేరాల బారిన పడే దివ్యాంగ బాలికలను అక్కున చేర్చుకుని వారిలో ధైర్యం నింపాలి. పూర్తిగా కోలుకునేందుకు అన్నివిధాలా దన్నుగా నిలవాలి. పోలీస్‌స్టేషన్ మొదలుకుని కోర్టు దాకా ప్రతి దశలోనూ వారి పట్ల అత్యంత సున్నితంగా, సహానుభూతితో వ్యవహరించాలి. ఇందుకు అవసరమైన మేరకు బాలల న్యాయ వ్యవస్థకు, దివ్యాంగుల హక్కుల చట్టానికి మార్పులు చేయాలి. ఇందుకు అంతర్జాతీయ చట్టాల నుంచి స్ఫూర్తి పొందాలి. వారిపై అకృత్యాలను నివారించడంపై ప్రధానంగా దృష్టి సారించాలి. ఆ బాలలకు నాణ్యతతో కూడిన విద్య, అనంతరం మెరుగైన ఉపాధి తదితర అవకాశాలు కల్పించాలి. తద్వారా అడుగడుగునా అండగా నిలవాలి. ఈ విషయమై వారి తల్లిదండ్రులతో పాటు పోలీసులకు, లాయర్లకు, న్యాయమూర్తులకు కూడా మరింత అవగాహన కల్పించాలి’’ అని సీజేఐ పిలుపునిచ్చారు. -
ప్రభుత్వ ప్రోత్సాహం తోడై.. ఆత్మ విశ్వాసం నీడై
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వ ప్రోత్సాహం తోడైంది. దానిని అందిపుచ్చుకుంటూ వారంతా ఆత్మ విశ్వాసంతో నిలబడుతున్నారు. నాలుగున్నరేళ్లలో విభిన్న ప్రతిభావంతుల కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. రాష్ట్ర జనాభాలో 2.23 శాతం (సుమారు 11.04లక్షలు) మంది విభిన్న ప్రతిభావంతులు ఉన్నారు. వివిధ వైకల్యాలతో బాధపడుతున్న 21 రకాల వారిని విభిన్న ప్రతిభావంతులుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారంతా సమాజంలో నిలదొక్కుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వీరంతా స్వయం ప్రతిపత్తి, సాధికారత సాధించేలా.. ప్రతిభావంతులుగా నిలబెట్టేందుకు కృషి చేస్తోంది. ప్రత్యేకంగా విద్య, ఉద్యోగం, ఉపాధి కల్పించేందుకు అనేక చర్యలు చేపట్టింది. వారి సమస్యలు గుర్తించి పరిష్కరించే దిశగా రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ, వయో వృద్ధులు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ మంత్రి అధ్యక్షతన రాష్ట్రస్థాయి సలహా మండలిని నియమించింది. కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి కమిటీలను సైతం ఏర్పాటు చేసింది. విభిన్న ప్రతిభావంతుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేలా ప్రతి శాఖలోను ప్రత్యేక అధికారిని నియమించింది. ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో వారికి 4 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఏపీ స్టేట్, సబార్డినేట్ రూల్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. వైకల్యం ఉందన్న కారణంతో వారికి పదోన్నతి నిరాకరించడం, ఉన్న పోస్టు నుంచి తగ్గించడం, తొలగించడం చేయకూడదని ప్రభుత్వం అన్ని శాఖలకూ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. సదరం ద్వారా వైకల్యం ధ్రువీకరణ పత్రాలు అందించడాన్ని సైతం సులభతరం చేసింది. ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థల్లో వారికి 5 శాతం రిజర్వేషన్ కల్పించింది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రవేశానికి సైతం గరిష్టంగా ఐదేళ్ల వయోపరిమితిని సడలించింది. దీంతోపాటు విద్యాలయాలు, ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాలకు విభిన్న ప్రతిభావంతులు వెళ్లి వచ్చేందుకు ఎటువంటి అవాంతరాలు (అడ్డంకులు) లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. పెద్ద మనసుతో ఎన్నో చర్యలు రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతులకు విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్ద మనసుతో అనేక చర్యలు చేపట్టారు. ఈ ఏడాది 1,750 మూడు చక్రాల మోటార్ సైకిళ్లు, అనేక సహాయక పరికరాలు అందించాం. అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో వారికి సీట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవడంతో పాటు, బడికి వెళ్లేలా సౌకర్యాలు కల్పించాం. చెవిటి, మూగ వారికి, అంధ విద్యార్థులకు 640 మందికి ప్రత్యేకంగా ఆరు ప్రత్యేక విద్యాసంస్థల్ని నిర్వహిస్తున్నాం. జగనన్న వసతి దీవెన, స్కాలర్షిప్లు అందిస్తున్నాం. ప్రత్యేక భర్తీతో 691 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. – కేవీ ఉషశ్రీ చరణ్, మహిళా, శిశు, వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతుల శాఖ మంత్రి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది విభిన్న ప్రతిభావంతులను అన్నివిధాల ఆదుకోవడంలో ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. విద్య, వైద్యం, ఉపాధి, సంక్షేమంలో వారి పట్ల వైఎస్ జగన్ అభిమానం చాటుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణ సెలవులు 15 రోజులు ఉంటే.. విభిన్న ప్రతిభావంతులకు మరో 7 రోజులు అదనంగా స్పెషల్ క్యాజువల్ లీవ్స్ ఇస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.సామాజిక భద్రత పెన్షన్లు అందించడంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఈ ఏడాది బడ్జెట్లో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి ప్రభుత్వం రూ.4,201.26 కోట్లు కేటాయించింది. – బి.రవిప్రకాశ్‌రెడ్డి, సంచాలకుడు, వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ -
హిమాచల్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా దివ్యాంగ మహిళలు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో ఇద్దరు దివ్యాంగ మహిళలు అరుదైన ఘనత సాధించారు. అంధులైన వీరిద్దరూ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమితులయ్యారు. పట్టుదల, అంకితభావంతో తమ కలలను నిజం చేసుకున్నారు. రైతు కుటుంబంలో జని్మంచిన ముస్కాన్ ప్రముఖ గాయకురాలు. హిమాచల్‌ప్రదేశ్ నుంచి ఎన్నికల సంఘం యూత్ ఐకాన్‌గా ఇప్పటికే గుర్తింపు పొందారు. దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. 2013లో రాజ్‌కియా కన్య మహావిద్యాలయలో సంగీతంలో ప్రవేశం పొందారు. ఇప్పుడు అదే విద్యాసంస్థలో సంగీతంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ముస్కాన్ చురుగ్గా ఉంటున్నారు. సాధారణమధ్య తరగతి కుటుంబంలో జని్మంచిన ప్రతిభా ఠాకూర్ సైతం అంధురాలు. పీహెచ్డీ పూర్తిచేశారు. విద్యా రంగంలో సేవలు అందించాలన్నది ఆమె చిన్నప్పటి కల. రాజీవ్ గాంధీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పొలిటికల్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమితురాలైంది. -
‘ప్రత్యేక అవసరాల’ పిల్లలకు ప్రవేశాలు ఇవ్వాల్సిందే..
సాక్షి, అమరావతి: ప్రత్యేక అవసరాల(దివ్యాంగ) విద్యార్థులకు పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించని పాఠశాలలు, ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకునేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. వైకల్యాన్ని సాకుగా చూపి తమ పిల్లలకు పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించడం లేదని రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన తల్లిదండ్రుల నుంచి సమగ్ర శిక్ష, విద్యా శాఖ ఉన్నతాధికారులకు అందిన ఫిర్యాదుల మేరకు సమగ్ర శిక్ష ఈ నిర్ణయం తీసుకుంది. కొన్నిచోట్ల ప్రభుత్వ పాఠశాలలు, అత్యధికంగా ప్రైవేటు పాఠశాలలపై ఈ తరహా ఫిర్యాదులు అందుతున్నాయి. దివ్యాంగ విద్యార్థులనూ సాధారణ విద్యార్థులతో సమానంగా పరిగణించాలని, సమాన హక్కులు కల్పించాలని సమగ్ర శిక్ష ఉత్తర్వుల్లో ఉంది. సమగ్ర శిక్ష రాష్ట్ర విభాగం లెక్కల ప్రకారం రాష్ట్రంలో 93 వేల మంది దివ్యాంగ విద్యార్థులు ఒకటి నుంచి 10వ తరగతి చదివే వయసుగలవారున్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో కొన్ని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల హెచ్ఎంలు ప్రవేశాలిచ్చేందుకు నిరాకరించడంతో సమగ్ర శిక్ష రాష్ట్రాధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. అయితే ఇటీవల ప్రయివేటు పాఠశాలలపై కూడా ఇదే తరహా ఫిర్యాదులు అందడంతో విచారణ చేసి చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖను సమగ్ర శిక్ష ఆదేశించింది. వారి ప్రవేశాలను అడ్డుకుంటే చర్యలు కొన్ని పాఠశాలల్లో దివ్యాంగ విద్యార్థులకు ప్రవేశాలు ఇవ్వడం లేదని ఫిర్యాదులందాయి. ఇలాంటి ప్రయివేటు పాఠశాలలపైన, ప్రభుత్వ పాఠశాలల్లో అయితే ప్రధానోపాధ్యాయులపైనా విచారణ నిర్వహించి చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలిచ్చాం. రాష్ట్రంలో ఉన్న 93 వేల మంది దివ్యాంగ పిల్లల్లో పాఠశాల వయసువారే అధికం. ప్రభుత్వ స్థాయిలో 672 భవిత సెంటర్లలో సుమారు 900 మంది ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్‌ను నియమించి పిల్లలకు ప్రాథమిక స్థాయిలో సౌకర్యాలు కల్పించి ఎలిమెంటరీ విద్యనందిస్తున్నాం. ఉన్నత పాఠశాలల్లోనూ 652 మంది స్పెషల్ ఎడ్యుకేటర్స్ దివ్యాంగుల కోసం పనిచేస్తున్నారు. – బి.శ్రీనివాసరావు, సమగ్ర శిక్ష రాష్ట్ర ఎస్పీడీ దివ్యాంగ విద్యార్థుల ప్రవేశాలకు మార్గదర్శకాలు ► ఆరు నుంచి 18 ఏళ్ల వయసు గల ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలపై వివక్ష చూపకుండా తప్పనిసరిగా వయసు ప్రకారం ఆయా తరగతుల్లో ప్రవేశం కల్పించాలి. ► వైకల్యాన్ని సాకుగా చూపి ప్రవేశాన్ని నిరాకరించకూడదు. ► విద్యా సంవత్సరంలో ఎప్పుడైనా వీరికి ప్రవేశాలు కల్పించొచ్చు. ► నూరు శాతం వైకల్యం గల పిల్లలకు హాజరు నుంచి మినహాయింపునివ్వాలి. -
Jayanthi Narayanan: ఒక అమ్మ .. 1000 మంది పిల్లలు
Best Teacher Jayanthi Narayanan: స్పెషల్ చిల్డ్రన్‌కి ఆమె తల్లి, తండ్రి, గురువు. ఇటీవలే తమిళనాడు ప్రభుత్వం నుంచి బెస్ట్ టీచర్ అవార్డ్ అందుకున్న జయంతి ‘దేవుడు నన్ను ఈ పిల్లల కోసమే పుట్టించినట్టున్నాడు’ అని నమ్ముతుంది. దాదాపు 36 ఏళ్లుగా ఆమె చెన్నై మైలాపూర్‌లోని క్లార్క్స్కూల్లో ఇప్పటికి కనీసం వెయ్యిమంది స్పెషల్ చిల్డ్రన్కు కనీస చదువు, ప్రవర్తన నేర్పించింది. ‘నా జీవితం వారికే అంకితం’ అంటోంది జయంతి. మైలాపూర్‌లో ‘ది క్లార్క్ స్కూల్ ఫర్ ది డెఫ్’లో జయంతిని పిల్లలు ఎవరూ టీచర్‌గా చూడరు. వాళ్లు స్పెషల్ చిల్డ్రన్. కొంతమందికి వినిపించదు. కొందరు చూడలేదు. మరికొందరికి బుద్ధి వికాసంలో లోపం. వారికి ఆమే అమ్మ. గురువు. తండ్రి కూడా. ‘లాక్డౌన్లో నాకు చాలా కష్టమైంది. పిల్లల్ని విడిచి నేను ఉండలేకపోయాను. వాళ్లు నన్ను చూడక ఇరిటేట్ అయ్యి ఇంట్లో తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టారు’ అంటుంది జయంతి. ఆమె చూస్తేనే వారికి సగం స్వస్థత. 1984 నుంచి ఆమె ఆ స్కూల్లో పని చేస్తోంది. ఎందరో పిల్లలు ఆమె చేతుల మీదుగా కనీస అవసర ప్రవర్తనను నేర్చుకుని స్కూలు దాటి పోయారు. వారందరూ ఇలాగే ఆమెకు ప్రేమను పంచి ఆమె ప్రేమను పొంది వెళ్లారు. అందుకే ఆమెను ప్రభుత్వం బెస్ట్ టీచర్‌గా గుర్తించింది. సహనమే శక్తి ఇది ఎడమ చేయి ఇది కుడి చేయి అని మూడేళ్ల పసివాడికి కూడా అర్థమవుతుంది. కాని బుద్ధి వికాసంలో లోపం ఉంటే పదేళ్లు వచ్చినా తెలియదు. ‘మనకు అది చాలా చిన్న విషయం అనిపిస్తుంది. వీళ్లకు ఎందుకు అర్థం కాదు అనిపిస్తుంది. కాని బుద్ధి వికాసం లేని పిల్లలకు అది అతి పెద్ద పనితో సమానం’ అంటుంది జయంతి. ఆమె పని చేస్తున్న స్కూల్లో ప్రతి సంవత్సరం రకరకాల శారీరక, మానసిక లోపాలతో పిల్లలు చేరుతారు. వారి వారి లోపాలను, వాటి స్థాయులను బట్టి తర్ఫీదు ఇవ్వాల్సి వస్తుంది. ‘స్పెషల్ విద్యార్థులకు చదువు చెప్పే డిప్లమా కోర్సు చేశాక ఎం.ఎస్సీ సైకాలజీ చేశాను. ఆ తర్వాత ఎన్నో ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లు చేశాను. పిల్లల పట్ల సానుభూతి, కరుణతో ఉండాల్సిన టీచర్‌గా మారిపోయాను’ అంటుంది జయంతి. ఆమె కుటుంబం ఆమెను ఈ పనిలో ప్రోత్సహిస్తుంది. కాకపోతే వారికి ఒకటే సందేహం. ఇంత ఓపిక ఎలా? అని. ‘ఈ స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లల తల్లిదండ్రులే ఒక్కోసారి విసిగిపోయి డస్సిపోతారు. తమ పిల్లల మీద తామే చిరాకు పడతారు. కాని నేను పొరపాటున కూడా వారిని విసుక్కోను. ఎన్నిసార్లు అర్థం కాకపోయినా చెబుతాను. ఒక పిల్లవాడు ప్లేటు కింద పడకుండా భోజనం ప్లేటు తీసుకుంటే, తనకు తాను వాష్‌రూమ్‌కు వెళ్లి వస్తే అదే ఆ పిల్లవాడికి నాకూ కూడా పెద్ద ఘనవిజయంగా భావిస్తాను’ అంటుంది జయంతి. ఈ మహమ్మారి రోజుల్లో స్కూళ్లు తిరిగి తెరిచాక ఆ పిల్లలకు సరిగ్గా మాస్క్ ధరించేలా చేయడం పెద్ద పనిగా ఉంది. వారికి దానిని పెట్టుకోవడం కూడా పెద్ద పనే. కాని జయంతి ఓపిగ్గా చేస్తుంది. వీడియో పాఠాలు కొందరు తమది ఉద్యోగం మాత్రమే అనుకుంటారు. కొందరు తమది కర్తవ్యం అనుకుంటారు. అందుకే ఎన్ని విధాలుగా పని చేయవచ్చో అన్ని విధాలుగా చేస్తూ పోతారు. లాక్డౌన్ సమయంలో స్పెషల్ చిల్డ్రన్కు ఆన్లైన్ క్లాసులు తీసుకునే సాహసం చేసింది జయంతి. వారికి ఫోన్, లాప్టాప్ ఉపయోగించడం కష్టం. కాని ప్రయత్నించి తన పిల్లలతో కాంటాక్ట్‌లో ఉంది. అంతే కాదు స్పెషల్ పిల్లల తల్లిదండ్రులకు, వారికి పాఠాలు చెప్పే టీచర్లకు ఉపయోగపడేలా వీడియో పాఠాలు తయారు చేసి యూట్యూబ్‌లో పెట్టింది. ఈమె తయారు చేసిన 34 వీడియోలు ప్రశంసలు పొందాయి. ఎన్నో చేయాలి స్పెషల్ చిల్డ్రన్కు అవసరమైన ప్రత్యేక స్కూళ్లు, క్లాస్రూమ్ లు ప్రతి ఊళ్లో ఉండాలని అంటుంది జయంతి. ‘వారికి ఇండివిడ్యుయెల్ కోర్సులు ఉండాలి. వాళ్లు ఉపయోగించాల్సిన సాఫ్ట్వేర్లతో కంప్యూటర్లు ఉండాలి. బ్రెయిలీ ప్రింటర్లు ఉండాలి. స్పెషల్ పిల్లలు చదువును ఎంజాయ్ చేసే వాతావరణం ఏర్పాటు చేయాలి. వారికీ అన్ని సౌకర్యాలు పొందే హక్కు ఉంది’ అంటుంది జయంతి. ఇలాంటి మంచి మనసున్న టీచర్, అమ్మలాంటి టీచర్ ప్రతి స్పెషల్ చైల్డ్‌కు దక్కాలని కోరుకుందాం. -
దివ్యాంగ్జన్‌కు సంపూర్ణ సహకారం: గవర్నర్
కంటోన్మెంట్: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజేబులిటీస్ (దివ్యాంగ్జన్)కు అవసరమైన సహకారం రాజ్‌భవన్ నుంచి అందిస్తామని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బోయిన్‌పల్లిలోని దివ్యాంగ్జన్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ మానసిక వైకల్యాన్ని చిన్నతనంలోనే గుర్తిస్తే తగిన చికిత్స ద్వారా మా మూలు స్థితికి తెచ్చే అవకాశం ఉంటుందన్నారు. సంస్థలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, శిక్షకులను ప్రత్యేకంగా అభినందించారు. దివ్యాంగ్జన్లో చదువుతున్న, చికిత్స పొందుతున్న విద్యార్థులు ప్రదర్శి ంచిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. తోచిన సాయం చేయండి సాక్షి, హైదరాబాద్: డిజిటల్ అంతరాలను నివారించాలంటే అందరూ తోచిన సాయం చేయాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. అవసరమైన వారికి, అణగారిన వర్గాలకు డిజిటల్ పరికరాలు దూరం కావడం మంచిది కాదని, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లవంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పేదలకు కూడా అందాలని ఆమె అన్నారు. రాజ్‌భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన ‘డొనేట్ ఏ డివైస్’కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. రామ్స్ హెల్పింగ్ హ్యాండ్స్ అనే స్వచ్ఛంద సంస్థ అందజే సిన 20 ల్యాప్‌టాప్‌లు, 2 ట్యాబ్‌లను ఉన్నత విద్య చదువుకుంటున్న పేదలకు ఆమె అందజేశారు. -
సియాచిన్ హిమ శిఖరాన్ని అధిరోహించి ...రికార్డు సృష్టించిన వికలాంగులు
న్యూఢిల్లీ: కొందరూ అన్ని సక్రమంగా ఉండి ఏం సాధించలేక నిరాశ నిస్ప్రుహలకి లోనైన ఆత్మనూన్యత భావంతో బాధపడుతుంటారు. అలాంటి వారికి కనువిప్పు కలిగించేలా వికలాంగులు ప్రంపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన హిమ శిఖరాలలో ఒకటైన సియాచిన్ హిమశిఖరాన్ని అధిరోహించి ప్రపంచ రికార్డు సృష్టించారు. వివరాల్లోకెళ్లితే.... ఎనిమిది మంది వికలాంగుల బృందం ఆదివారం 15 వేల అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్ హిమ శిఖరం దగ్గర కుమార్ పోస్ట్ వద్దకు చేరుకుని ప్రపంచ రికార్డ్ సృష్టించారు. ప్రపంచంలోనే క్లిష్టమైన హిమనీనదాల్లో ఒకటైన సియాచిన్ హిమనీనదాన్ని అధిరోహించిన తొలి వికలాంగ బృందంగా నిలిచింది. భారత సైన్యం కాంకర్ ల్యాండ్ వాటర్ ఎయిర్(క్లావ్)ని ట్రెక్కింగ్ చేయడానికీ సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చింది. దీంతో క్లావ్, మాజీ ఆర్మీ అధికారులు ఏప్రిల్ నెలలో ఈ ట్రెక్కింగ్‌లో వికలాంగులు పాల్గొనేలా దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు. మాజీ పారా ఆఫీసర్ మేజర్ వివేక్ జాకబ్ నేతృత్వంలో 20 మందికి శిక్షణ ఇచ్చి ఎనిమిది మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేసినట్లు భారత సైన్యం పేర్కొంది(చదవండి: 70 ఏళ్లుగా అడవిలోనే.. కర్పూరమే ఆహారంగా) ఈ మేరకు స్వాతంత్య్ర దినోత్సవం రోజున "ఆపరేషన్ బ్లూ" పేరుతో ఈ యాత్ర ప్రారంభించారు. దీన్ని క్లావ్ టీమ్, భారతసైనిక దళలు వికాంగుల సాధికారత దిశగా ప్రోత్సహించేలా ఈ ఆపరేషన్ని అమలు చేశారు. ఆపరేషన్ బ్లూ విజయవంతమవ్వడమే కాక ప్రపంచ రికార్డు సృష్టించారంటూ ...భారత సైన్య్ం ట్వీట్ చేసింది. (చదవండి: పని చేస్తున్న చోటే తింటే చాలా ప్రమాదమట..!) -
దేశ తొలి రాష్ట్రపతికి సీఎం జగన్ నివాళి
సాక్షి, అమరావతి : భారతదేశ తొలి రాష్ట్రపతి భారతరత్న డా. బాబూ రాజేంద్ర ప్రసాద్ 135వ జయంతి సందర్భంగా ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి చేసిన సీఎం గుర్తుచేశారు. దేశ నిర్మాణంలో రాజేంద్ర ప్రసాద్ ప్రముఖ పాత్రను పోషించారని అభిప్రాయపడ్డారు. నేటి తరం ఆయన సేవలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని, స్వాతంత్య్ర పోరాటంలో ఆయన చూపిన తెగువ స్పూర్తిదాయకమైందని స్మరించుకున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మంగళవారం ఓ ప్రకటన వెలువడింది. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ‘విభిన్న సామర్థ్యం గల సోదరులు, సోదరీమణులు అభివృద్ధి చెందడానికి సహకరిస్తాం. అన్ని రంగాల్లో సమాన హక్కులు, అవకాశాలతో అనుకూలమైన వాతావరణాన్ని నిర్మించడం ద్వారా మంచి ఫలితాల వైపు వారి దృష్టిని ఆకర్షించవచ్చు. వారిలోని ఆత్మ సైర్థ్యం మనకు ఎంతో ప్రేరణ’ అని ఓ ప్రకటన ద్వారా తెలిపారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన దివ్యాంగులు
-
సంక్షేమానికి వైకల్యం
దివ్యాంగులకు చంద్రబాబు సర్కారు మొండిచేయి... పింఛన్ కోసం నాలుగు లక్షలమంది ఎదురుచూపు ధ్రువీకరణ ఉన్నా 2.5 లక్షల మందికి పింఛన్ లేదు పరీక్షల కోసం మరో లక్షన్నరమంది పడిగాపులు మెడికల్ క్యాంపులకు నిధులివ్వని రాష్ర్ట ప్రభుత్వం సర్కారు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న వికలాంగులు రెండున్నరేళ్లలో తగ్గిన వికలాంగ పింఛన్లు సాక్షి, అమరావతి అసలే వైకల్యం.. కాళ్లు, చేతులు సరిలేక, శరీరం సహకరించక.. ఒక చోట నుంచి మరో చోటకు కదలాలంటే నరకయాతన.. అలాంటి దివ్యాంగులు ప్రతిరోజూ ఎంపీడీవో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. బాధనంతటినీ పంటిబిగువున భరిస్తున్నారు. వైకల్య సర్టిఫికెట్ కోసం అవసరమైన వైద్య పరీక్షల కోసం కొంత మంది.... సర్టిఫికెట్ ఉన్నా పింఛన్ ఇచ్చే నాథుడు కానరాక మరికొంతమంది... సర్కారు కార్యాలయాల బైట పడిగాపులు పడుతున్నారు. ఈ రెండు కేటగిరీల సంఖ్య చూస్తేనే నాలుగులక్షలు దాటిందంటే ఆశ్చర్యం కలగక మానదు. సర్కారు సరిగ్గా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తే ఇంకా ఎన్నో లక్షల మంది గురించి తెలిసే అవకాశం ఉంది. కానీ నిధులివ్వని కారణంగా మెడికల్ క్యాంపులే జరగడం లేదు. రెండున్నరేళ్లుగా రాష్ర్టంలో దివ్యాంగుల దీనావస్థ ఇది. వారి సంఖ్య ఎంత ఉన్నా పెన్షన్ పొందేవారి సంఖ్య మాత్రం పెరగడమే లేదు. పైగా తగ్గింది కూడా... అలాగే అన్నిరకాల పింఛన్లదీ అదే పరిస్థితి. పెరగాల్సిందిపోయి తగ్గాయి. రెండున్నరేళ్ల క్రితం 43 లక్షలున్న పింఛన్లు ఇపుడు 42 లక్షలకు తగ్గిపోయాయి. రెండేళ్లుగా తిరుగుతున్న వికలాంగులు.. వికలాంగ పింఛను పొందాలంటే 40శాతానికి పైబడి అంగవైకల్యం ఉండాలనే నిబంధన ఉంది. రాష్ర్టంలోని 13 జిల్లాల్లో వైకల్య ధృవపత్రాల కోసం 11,39,829 మంది ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం నిర్వహించిన మెడికల్ క్యాంపులలో 9,83,977 మందికి వైద్య పరీక్షలు జరిగాయి. ఇంకా లక్షన్నరమందికి పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. మొత్తం దరఖాస్తు చేసుకున్న 11.39 లక్షల మందిలో 7,71,281 మందికి 40 శాతం పైబడి అంగవైకల్యం ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. అయితే వీరిలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 5,36,223 మందికి మాత్రమే పింఛన్లు మంజూరు చేస్తోంది. 40 శాతం పైగా అంగవైకల్యం ఉన్నట్లుగా సర్టిఫికెట్లు పొందిన 2,35,058 మంది గత రెండేళ్లుగా కొత్త పింఛన్ల కోసం మండల పరిషత్ కార్యాలయాల చుట్టూ నిత్యం తిరుగుతూనే ఉన్నారు. పరీక్షల కోసం 1.55 లక్షల మంది ఎదురుచూపు అంగవైకల్య సర్టిఫికెట్ల జారీ చేయడానికి ఉద్దేశించిన మెడికల్ క్యాంపుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా నిధులు విడుదల చేయడం లేదు. దాంతో లక్షలాదిమంది దివ్యాంగులకు వైద్య పరీక్షలు చేయించుకునే వెసులుబాటే లేకుండా పోయింది. అంగవైకల్య సరిఫికెట్ల కోసం దరఖాస్తుచేసుకున్న వారిలో 9,83,977 మందికి మాత్రమే మెడికల్ క్యాంపుల ద్వారా ప్రభుత్వం వైద్య పరీక్షలు నిర్వహించింది. ఇంకా 1.55 లక్షల మంది ఇప్పటికీ వైద్య పరీక్షల కోసం ఎదురుచూస్తున్నారు. తమ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఎప్పుడు ఏర్పాటు చేస్తారో, ఎవరిని సంప్రదించాలో తెలియక అవస్థలు పడుతున్నారు. ఎవరన్నా చనిపోతేనే కొత్తవారికి పింఛన్ పింఛన్ తీసుకుంటున్నవారు ఎవరన్నా చనిపోతేనే కొత్తవారికి పింఛన్ మంజూరు చేయాలనేది చంద్రబాబు గత తొమ్మిదేళ్ల హయాంలో అనుసరించిన పద్ధతి. ఇపుడు మరలా అదే పునరావృతమైనట్లు కనిపిస్తోంది. వృద్ధులు, వికలాంగులు, వింతంతువులకు కొత్త పింఛన్ల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తెలపకపోతుండడంతో అధికారులు ప్రస్తుతం ఉన్న పింఛనుదారుల్లో ఎవరైనా చనిపోతేనే వారి స్థానంలో కొత్త పించన్లు మంజూరు చేస్తున్నారు. అయితే వికలాంగుల పింఛన్లు అలా ఖాళీ ఏర్పడిన సందర్భంలోనూ గ్రామాల్లో ఉండే జన్మభూమి కమిటీల రాజకీయాలతో ఆయా ఫించన్లను కొత్తగా వికలాంగులకు కాకుండా వృద్ధులకో, వితంతువులకో మంజూరు చేయిస్తున్నారన్న విమర్శలున్నాయి. తగ్గిన వికలాంగ పింఛన్లు రాష్ర్టంలో రెండున్నరేళ్లలో వికలాంగుల పింఛన్ల సంఖ్య పెరగకపోగా తగ్గింది. అదెలాగ అనుకుంటున్నారా? రెండున్నరేళ్ల క్రితం చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినపుడు 5.37లక్షల మంది వికలాంగులకు పింఛన్లు అందేవి. ప్రస్తుతం 5.36 లక్షల మంది వికలాంగులకు మాత్రమే ఫ్రభుత్వం నెలవారీ పింఛన్లు అందజేస్తోంది.అంటే వెయ్యికి పైగా వికలాంగ పింఛన్లు తగ్గిపోయాయన్నమాటేగా.. గత నెలలో.. అంటే సెప్టెంబర్‌లోనూ రాష్ట్ర ప్రభుత్వం 5.36 లక్షల మందికి మాత్రమే పింఛన్లు విడుదల చేసింది. -
సెప్టెంబర్ 26న బస్‌భవన్ ముట్టడి
తమ సమస్యలు తీర్చకపోతే సెప్టెంబర్ 26న హైదరాబాద్‌లోని బస్‌భవన్‌ను ముట్టడిస్తామని దివ్యాంగులు హెచ్చరించారు. చిక్కడ్‌పల్లిలోని ఎంఆర్‌పీడీ కార్యాలయంలో 'వికలాంగ హక్కుల జాతీయ వేదిక' ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తమ న్యాయమైన హక్కులు తీర్చాలని డిమాండ్ చేశారు. మెట్రో, హైటెక్ బస్సుల్లో పాసులు అనుమతించాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగ నియామకాల్లో 3 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులను వెంట నే భర్తీ చేసి, బస్సుస్టేషన్లలో ర్యాంపులు, వీల్చైర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 70 శాతం వైకల్యం ఉన్న వారికి ఎస్కార్డ్ సౌకర్యం కల్పించాలని, 40 శాతం వైకల్యం ఉన్న వారందరికీ బస్సు పాసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఆర్టీసీ బస్సు స్టేషన్‌లోని షాపింగ్ మాల్స్‌ను దివ్యాంగులకు కేటాయించాలని కోరుతూ ఎంఆర్‌పీడీ కార్యాలయంలో బస్‌భవన్ ముట్టడికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. -
రిమ్స్‌లో వికలాంగుల సర్టిఫికెట్ల మంజూరు
కడప అర్బన్: జిల్లాలోని వికలాంగులు తమ వైకల్య ధ్రువీకరణ పత్రాలను తీసుకునే ప్రక్రియను రిమ్స్‌లో గురువారం ప్రారంభించారు. కడపలోని డీఆర్డీఏ కార్యాలయం సిబ్బంది రిమ్స్‌లో ఉదయం 9 గంటల నుంచే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. గురువారం చాపాడు, వల్లూరు, సిద్ధవటం, రాజంపేట, ఓబులవారిపల్లె మండలాల నుంచి వికలాంగుల ధ్రువీకరణ పత్రాల మంజూరును కోరుతూ దరఖాస్తు చేసుకున్న వారిని రిమ్స్‌కు రావాలని ఆయా మండలాల అభివృద్ధి అధికారుల ద్వారా సూచనలు చేశారు. వీరిలో కొంతమంది వచ్చి ఆయా విభాగాల ద్వారా పరీక్షలు చేయించుకుని వెళ్లారు. – పోటీపరీక్షలు, ఉద్యోగాల నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యతను కల్పిస్తామని, వారు కూడా ఆయా మండల అభివృద్ధి అధికారి వద్ద కచ్చితంగా తమ పేరును నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. – కేటాయించిన తేదీల్లో (గురు, శుక్ర )వారాల్లో మాత్రమే ఉదయం 9 గంటలలోపు రిమ్స్ ఓపీ విభాగం వద్దకు చేరుకోవాలన్నారు. గతంలో లాగా ప్రతిరోజు కాకుండా, వారానికి రెండు రోజులు చొప్పున గురు, శుక్రవారాల్లో మాత్రమే ఈ సర్టిఫికెట్లను ఇవ్వనున్నారు. -
నేటినుంచి ‘సదరం’
ప్రగతినగర్ : వికలాంగులకు సదరం సర్టిఫికెట్లు ఇప్పించే విషయంలో కలెక్టర్ రొనాల్డ్ రోస్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. అందులో భాగంగా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. సోమవారం నుంచి వారం పాటు నియోజకవర్గాల వారీగా శిబిరాలు నిర్వహించనున్నారు.వికలాంగులకు సదరం సర్టిఫికెట్ల జారీ విషయంలో జాప్యం జరుగుతుండడంపై చాలా ఫిర్యాదులు వచ్చాయి. సదరం ధ్రువీకరణ పత్రాలు జారీ కాకపోవడం, జారీ అయిన వాటిలోనూ వైద్యుల సంతకాలు లేకపోవడం వంటి పొరపాట్లు దొర్లాయి. దీంతో వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిని గమనించిన కలెక్టర్.. నియోజకవర్గాల వారీగా సదరం ప్రత్యేక శిబిరాల ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సోమవారంనుంచి 16వ తేదీ వరకు శిబిరాలు కొనసాగుతాయి. జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని ఆస్పత్రులలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. అయితే గతంలో మాదిరిగా నామమాత్రంగా కాకుండా పకడ్బందీగా క్యాంపులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఈసారి సదరం క్యాంపులకు సూపర్వైజర్లను, క్యాంపు ఇన్చార్జి వైద్యుడిని, కోఆర్డినేటర్లును నియమించారు. క్యాంప్‌ల సూపర్వైజర్లు, ఇన్చార్జి వైద్యులు, కోఆర్డినేటర్లుగా నియమితులైనవారు తప్పనిసరిగా ఆయా క్యాంపులను సందర్శించాలని కలెక్టర్ సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. క్యాంపులు, అధికారులు వీరే.. నిజామాబాద్ మండలంలోని వికలాంగులకోసం జిల్లా ఆస్పత్రిలో సదరం క్యాంపు ఏర్పాటు చేశారు. క్యాంపు సూపర్వైజర్గా జడ్పీ సీఈఓ రాాజారాం, క్యాంప్ ఇన్చార్జి వైద్యుడిగా రజనీకాంత్, కోఆర్డినేటర్‌గా ఐకేపీ ఏపీఎం మోహన్ వ్యవహరిస్తారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని నిజామాబాద్ మండలం మినహా మిగిలిన మండలాల వికలాంగుల కోసం డిచ్పల్లి సీహెచ్‌సీలో శిబిరం ఏర్పాటు చేశారు. క్యాంప్ సూపర్వైజర్గా డీపీఓ కృష్ణమూర్తి, ఇన్చార్జి వైద్యుడిగా రాథోడ్, కోఆర్డినేటర్ రవీందర్ సేవలందిస్తారు. బోదన్ నియోజకవర్గంలో బోధన్ ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన క్యాంప్‌లో మెప్మా పీడీ సత్యనారాయణ సూపర్వైజర్గా, ఇన్చార్జి వైద్యుడిగా భానుప్రసాద్, కోఆర్డినేటర్‌గా సాయిలు ఉంటారు. బాన్సువాడ నియోజకవర్గంలో బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో సదరం క్యాంప్ ఏర్పాటు చేశారు. సూపర్వైజర్గా డీసీహెచ్ఎస్ శివదాస్, ఇన్చార్జి డాక్టర్‌గా శ్రీనివాస్, కోఆర్డినేటర్‌గా రవీందర్ సేవలందిస్తారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఆర్మూర్‌లో ఏర్పాటుచేసిన క్యాంప్ సూపర్వైజర్గా డీఎంహెచ్ఓ గోవింద్ వాగ్మారే, ఇన్చార్జి వైద్యుడిగా నారాయణ, కోఆర్డినేటర్ నీలిమ వ్యవహరిస్తారు. కామారెడ్డి నియోజకవర్గంలో కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో సదరం క్యాంప్ ఏర్పాటు చేశారు. సూపర్వైజర్గా డీఆర్డీఏ పీడీ వెంకటేశం, ఇన్చార్జి వైద్యుడిగా అజయ్‌కుమార్, కోఆర్డినేటర్‌గా సుధాకర్ ఉంటారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి సీహెచ్‌సీలో ఏర్పాటు చేసిన క్యాంప్ కోఆర్డినేటర్‌గా మండల ప్రత్యేకాధికారి గంగాధర్, ఇన్చార్జి వైద్యుడిగా బాలోజీ, కోఆర్డినేటర్‌గా రచ్చయ్య వ్యవహరిస్తారు. బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ సీహెచ్‌సీ క్యాంప్ సూపర్వైజర్గా డీఎంహెచ్ఓ గోవింద్ వాగ్మారే, ఇన్చార్జి డాక్టర్‌గా మోహన్‌బాబు, కోఆర్డినేటర్ శ్రీనివాస్ ఉంటారు. జుక్కల్ నియోజకవర్గంలో జుక్కల్ పీహెచ్సీలో సదరం క్యాంప్ ఏర్పాటు చేశారు. క్యాంప్ సూపర్వైజ ర్గా డీసీహెచ్ఎస్ శివదాస్, ఇన్చార్జి డాక్టర్‌గా బాల మురళి, కోఆర్డినేటర్‌గా రవీందర్ వ్యవహరిస్తారు. -
వికలాంగుల సాంస్కృతిక కార్యక్రమాలు, నిరసనలు
-
పింఛన్లలో కోత విధిస్తే ఉద్యమిస్తాం
నల్లగొండ టౌన్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వేల పేరుతో వికలాంగులు, వితంతువులు, వృద్ధుల పింఛన్లలో కోత విధిస్తే ఉద్యమిస్తామని వికలాంగులహక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జేరిపోతుల పరుశరాం హెచ్చరించారు. గురువారం స్థానిక టౌన్హాల్లో నిర్వహించిన.. సమితి నల్లగొండ డివిజన్ సదస్సులో ఆయన మాట్లాడారు. పింఛన్లను పెంచుతామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత వికలాంగులను విభజించి 40 శాతం నుంచి 79 శాతం వికలత్వం ఉన్నవారికి రూ.1000, 80 శాతం నుంచి 100 శాతం వికలత్వం ఉన్నవారికి రూ.1500 పింఛన్ ఇస్తామని చెప్పడం అన్యాయమన్నారు. శాతాలతో సంబంధంలేకుండా అర్హులైన వికలాంగులందరికీ రూ.1500 పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎలాంటి షరతులు లేకుండా గతంలో ఉన్న వృద్ధులు,వితంతువులు, ఒంటరి స్త్రీల పెన్షన్లను యథావిధిగా కొనసాగించాలన్నారు. కలెక్టర్ బంగ్లా ఎదుట ధర్నా సమావేశం అనంతరం వికలాంగులు, వితంతువులు, వృద్ధులు కలిసి కలెక్టర్ బంగ్లా ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. రెండు గంటల పాటు ఆందోళన చేయడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో పోలీసులు ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. హైదరాబాద్‌లో ఉన్న కలెక్టర్ చిరంజీవులు ఫోన్‌ద్వారా వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులతో మాట్లాడారు. అర్హులైన వికలాంగుల పెన్షన్లను ఒక్కటి కూడా తొలగించమని కలెక్టర్ హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో సమితి రాష్ట్ర కార్యదర్శి పువ్వాల్ వెంకట్‌సింగ్, జిల్లా అధ్యక్షుడు చింతల సైదులు, గడ్డం కాశీం, బొల్లెపల్లి గోపరాజు, సైదులు, జలందర్, ఇందిర, సుధాకర్, యాదగిరి, బోగరి రవి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
అసలు వైకల్యం ఎవరిది?!
అంతర్దృష్టి లేకపోవడం అంధత్వం కంటే అధమమైనదని విఖ్యాత రచయిత్రి హెలెన్ కెల్లర్ అంటారు. మన పాలకులకు అలాంటి లోచూపు లోపించింది కనుకనే వికలాంగులకు ప్రభుత్వోద్యోగాల్లో 3శాతం రిజర్వేషన్లు కల్పించే పద్దెనిమిదేళ్ల నాటి చట్టాన్ని ప్రభుత్వాలన్నీ అమలు చేసి తీరాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించాల్సి వచ్చింది. ఉద్యోగాల్లో ఇచ్చే కోటా 50 శాతం మించరాదని గతంలో సుప్రీంకోర్టే ఆదేశించింది గనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని అమలుచేయడం సాధ్యంకాదన్న కేంద్ర ప్రభుత్వ వాదనను న్యాయమూర్తులు తోసిపుచ్చారు. అలాగే, గుర్తించిన కొన్ని పోస్టుల్ని మాత్రమే వికలాంగులకు కేటాయించాలని 2005లో కేంద్ర ప్రభుత్వం ఒక మెమో ద్వారా చేసిన సూచనను కూడా న్యాయమూర్తులు తిరస్కరించారు. గ్రూప్ ఏ, గ్రూప్ బీ పోస్టులకు కూడా వికలాంగ అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని వారు తెలిపారు. ఖాళీ అయిన మొత్తం పోస్టుల సంఖ్యలో 3 శాతం వికలాంగులకు కేటాయించాలితప్ప, ఎంపికచేసిన కొన్నింటిని మాత్రమే వారికి ఇస్తామనడం న్యాయబద్ధం కాదని స్పష్టంచేశారు. సాంకేతిక అభివృద్ధి పర్యవసానంగా వైకల్యం ఉన్నవారు సైతం ఇతరులతో సమానంగా అన్ని పనులనూ చేయగలిగే పరిస్థితులు వచ్చాయని... ఇలాంటి పరిస్థితుల్లో వారికి పరిమితులు విధించాలని చూడటం సరైన విధానం కాబోదని వారన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు కారణంగా కంటిచూపు కరువైనవారికి లేదా పాక్షికంగా చూపుదెబ్బతిన్నవారికి... వినికిడిలోపం ఉన్నవారికి... సెరిబ్రల్ పాల్సీ వ్యాధిగ్రస్తులకు ఇకపై ఒక్కోశాతం చొప్పున ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోనూ... ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ, ప్రభుత్వ సంస్థల్లోనూ అలాంటివారికి ఇకపై ఉద్యోగావకాశాల్లో కోటా ఉంటుంది. దేశ జనాభాలో వివిధ రకాల వైకల్యంతో బాధపడుతున్నవారి సంఖ్య 2.1 శాతం ఉంటుందని 2001 జనాభా లెక్కలు చెబుతున్నాయి. 2011 జనాభా గణాంకాల్లో వికలాంగులకు సంబంధించిన వివరాలు ఇప్పటికింకా లభ్యంకాలేదు గానీ వారి శాతం జనాభాలో 5నుంచి 6 శాతం ఉండొచ్చని ఒక అంచనా. మన ప్రణాళికా సంఘం, ఐక్యరాజ్యసమితి అనుబంధ విభాగాల లెక్క ప్రకారం ఇది 10 శాతం వరకూ కూడా ఉండే అవకాశం ఉంది. ఈ లెక్కలన్నీ ఎంతవరకూ సరైనవో చెప్పలేం. ఎందుకంటే... జనాభా లెక్కలు సేకరించేవారికి, ఇతరత్రా సర్వేలు చేసేవారికి వైకల్యానికి సంబంధించి ప్రత్యేక అవగాహన కల్పించకపోతే సరైన గణాంకాలు లభ్యంకావు. కనుక మన జనాభా లెక్కలు వెల్లడించే సంఖ్యను మించి వికలాంగులు ఉండే అవకాశం లేకపోలేదు. అధికారిక గణాంకాలను గమనించినా మన దేశంలో వికలాంగుల సంఖ్య కొన్ని దేశాల జనాభా కంటే ఎక్కువ! వికలాంగుల్లో అధికశాతంమంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారూ, దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నవారే. బిడ్డ కడుపులో ఉండగా తల్లికి సరైన పోషకాహారం అందకపోవడంవల్లా... తల్లిదండ్రులకు ఆరోగ్యంపై అవగాహన కొరవడటంవల్లా, పోలియో, మశూచి వగైరా అంటువ్యాధులవల్లా, రకరకాల ప్రమాదాలవల్లా వైకల్యం సంభవిస్తుంది. సమాజానికి చోదకశక్తిగా ఉండవలసిన ప్రభుత్వాలు ఇలాంటివారి బాధ్యతను స్వీకరించి ఆదుకోవాల్సి ఉంటుంది. అది వాటి బాధ్యత. కానీ, ఏవో పైపై చర్యలు తప్ప ప్రభుత్వాలేవీ వికలాంగుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషిచేయడంలేదు. వికలాంగుల సంక్షేమానికి సంబంధించిన చేపట్టే పథకాల్లో కూడా ఏకరూపత లేదు. ఒకచోట ఉండే సంక్షేమ పథకం మరో రాష్ట్రంలో లభించదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వికలాంగుల సంక్షేమానికి సంబంధించి ఎన్నో చర్యలు తీసుకున్నారు. వికలాంగులకు అంతక్రితం నెలకు రూ.75 మాత్రమే పింఛనుగా ఇవ్వగా, అధికారంలోకి వచ్చినవెంటనే దాన్ని ఆయన రూ. 200కు పెంచారు. 2007లో దాన్ని రూ. 500 చేశారు. వైకల్యాన్ని బట్టి దీన్ని పెంచే ఏర్పాటుకూడా చేశారు. వికలాంగుల సంక్షేమం కోసమని ప్రత్యేక నిధిని ఏర్పర్చడం, వేర్వేరు గృహ పథకాల్లో వారికి ప్రాధాన్యతనివ్వడం, ఉన్నత చదువులు చదివే వికలాంగులకు పూర్తి ఫీజును ప్రభుత్వమే చెల్లించడం... బధిర, మూగ పిల్లలకు లక్షల రూపాయలు ఖర్చయ్యే కాక్లియర్ ఆపరేషన్లను ఆరోగ్యశ్రీద్వారా ఉచితంగా చేయించడంవంటి ఎన్నో చర్యలకు ఆయన శ్రీకారం చుట్టారు. కానీ, ఆయన కనుమరుగయ్యాక అలాంటి సంక్షేమ కార్యక్రమాలు మందగించాయి. పింఛన్ల పంపిణీ సక్రమంగా లేకపోవడంవల్ల ప్రతి నెలా వికలాంగులకు అగచాట్లు తప్పడంలేదు. వైకల్యం శాతాన్ని తగ్గించి చూపి పింఛన్లు తొలగించడమూ మొదలైంది. దాదాపు 2 లక్షలమంది ఈరకంగా అనర్హులయ్యారు. ప్రభుత్వాలు ఇలా వికలాంగుల సంక్షేమానికి క్రమేపీ తూట్లు పొడుస్తున్న తరుణంలో సుప్రీంకోర్టు తీర్పు ఆశావహమైనది. రాజ్యాంగంకిందగానీ, మానవ హక్కులకు సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారంగానీ వికలాంగుల హక్కులను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలకు ఉండగా... ఎన్నడో 1995లో రూపొందించిన వికలాంగుల చట్టం ఇంతవరకూ అమల్లోకి రాకపోవడం సిగ్గుచేటైన విషయం. ఉద్యోగమనేది నిజంగా ఒక యోగం. అందునా వికలాంగులకు అది అందరికన్నా మించిన జీవితావసరం. ఒకరిపై ఆధారపడే స్థితిని తప్పించే ముఖ్యావసరం. కానీ, ప్రభుత్వాలు తమ అచేతనత్వంతో అలాంటివారందరికీ 18 ఏళ్లపాటు ఆ యోగాన్ని దక్కకుండా చేశాయి. ప్రజల ద్వారా అధికారంలోకొచ్చే ప్రభుత్వాలు నిజానికి తమంతతామే ఇలాంటి సమస్యలను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉండగా... అందుకు భిన్నంగా సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని చెప్పాల్సివచ్చింది. ఇకనైనా పాలకులు తాము ఎంతగా మొద్దుబారుతున్నామో, బండబారుతున్నామో తెలుసుకోవాలి. ఎలాంటి వైకల్యం తమను ఇలా మార్చిందో గుర్తెరగాలి. గుర్తించి సరిదిద్దుకోవాలి. -
మా హయాంలోనే వికలాంగులకు పెద్దపీట
వేలూరు, న్యూస్‌లైన్: అన్నాడీఎంకే ప్రభుత్వంలోనే వికలాంగులకు పెద్ద పీట వేశామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కేసీ వీరమణి అన్నారు. వేలూరు కలె క్టరేట్‌లో ఎమ్మెల్యేల నిధి నుంచి వికలాంగులకు స్కూటర్లు, వికలాంగ పరికరాలు, చెవిటి వారికి మిషన్లను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం వికలాంగులకు విద్య, ఉద్యోగాల్లో మూడు శాతం రిజర్వేషన్ కల్పించిందన్నారు. వివాహ నిధి, పెట్రోల్ వాహనాలను అందజేస్తున్నామన్నారు. వీటిని సద్విని యోగం చేసుకోవాలన్నారు.గత రెండు బడ్జెట్లలో ఒక్కో ఎమ్మెల్యే నిధి నుంచి రూ.1.30 లక్షలు కేటాయించామన్నారు. మొదటి విడతగా 250 మందికి రూ.28,54,160 విలువ చేసే పరికరాలను అందజేస్తున్నామన్నారు. వికలాంగులను ఆదుకునేందుకు పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టామన్నారు. బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి దుకాణాలు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిం చామని చెప్పారు. అమ్మ ప్రవేశ పెడుతున్న పథకాలను చూసి ఇతర రాష్ర్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఆశ్చర్య పోతున్నారన్నారు. అనంతరం వికలాంగులకు పెట్రోల్ వాహనాలు, ఇతర పరికరాలు, వివాహ సహాయ నిధి అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శంకర్, ఎమ్మెల్యేలు మహ్మద్‌జాన్, డాక్టర్ విజయ్, రవి, మేయర్ కార్తియాయిని, డెప్యూటీ మేయర్ ధర్మలింగం, వికలాంగుల సంక్షేమ శాఖాధికారి చార్లెస్ ప్రభాకరన్, జిల్లా రెవెన్యూ అధికారి బలరామన్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్టు అధికారి శ్రీనివాసన్ పాల్గొన్నారు.


