అది... రెండేళ్ల కిందటి సంఘటన. హైదరాబాద్ నగరంలో ప్రజాదర్బార్. పదుల కొద్దీ వీల్ చెయిర్‌లలో దివ్యాంగులు. వారి కష్టాన్ని సీయంకి వివరిస్తోందో మహిళ. అందరూ రోడ్డు పక్కన అడుక్కునే వాళ్లే. ప్రభుత్వం పెన్షన్ ఇస్తే అడుక్కోవడం మానేస్తారు. పెన్షన్ రావాలంటే ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డు రావాలంటే వారికో అడ్రస్ ఉండాలి. ఉండడానికి ఇల్లులేక, తినడానికి తిండి లేక రోడ్డు పక్కన భిక్షమెత్తుకుంటున్న వారిని అడ్రస్ అడిగితే ఏం చెప్పగలుగుతారు? ప్రభుత్వ వైఫల్యమే వీరి అడ్రస్, ఈ ప్రజాభవనే వీరి అడ్రస్... అని వాదించింది.
సీయం పక్కనే రెవెన్యూ మినిస్టర్ కూడా ఉన్నారు. అడ్రస్ అవసరం లేకుండా ఆధార్ కార్డులు జారీ చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వ నియమావళికి, ఆపన్నుల అవసరానికి మధ్య ఉన్న అగాధం తొలగిపోయింది. దిక్కులేని వారికి ఆధారం దొరికింది. సమస్య ఉంది అంటే పరిష్కారం కూడా ఉంటుంది. అయితే సమస్యను సింపతీతో చూసినంత కాలం పరిష్కార మార్గం కనిపించదు, ఎంపతీతో చూసినప్పుడే ఆ దారి గోచరమవుతుంది. బాధితుల కష్టాన్ని తన కష్టంగా భావించి స్పందించే మనసు ఉండడంతోనే ఆమెకు పరిష్కార మార్గం కనిపించింది. ఆమె సోషల్ యాక్టివిస్ట్ శ్రీలక్ష్మి రెడ్డి.
‘నాకు వందమంది శక్తిమంతులైన యువతను ఇవ్వండి, భారతదేశాన్ని మార్చి చూపిస్తాను’ అన్న వివేకానందుడే తనకు స్ఫూర్తి అంటారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలక్ష్మిరెడ్డి. భర్త, ముగ్గురు పిల్లలతో గృహిణిగా ఖమ్మంజిల్లా నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన ఆమె రామకృష్ణ మఠం బోధనలతో స్ఫూర్తి పొందారు. తొంభయ్యవ దశకం మొదట్లోనే లయన్స్ క్లబ్ సభ్యురాలిగా సేవాపథంలో నడిచారు. చదువంటే ఆమెకు తీరని దాహం.
ముగ్గురు పిల్లలను ఉన్నత విద్యావంతులను చేయడంతోపాటు పెళ్లి కారణంగా ఆగిపోయిన తన చదువును కొనసాగించారు. ఇప్పుడామె ఎల్‌ఎల్‌బి స్టూడెంట్. ‘మహిళలు కుటుంబ సమస్యలతో వస్తుంటారు. వారి కాపురం నిలబెట్టడానికి లోకజ్ఞానంతో కౌన్సెలింగ్ ఇచ్చేదాన్ని. న్యాయపరమైన సలహా కోసం తరచూ మా వారిని విసిగించాల్సి వస్తోంది. నా ఫ్రీ సర్వీస్ కోసం ఇంట్లో వాళ్లను ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఆ కోర్సు నేనే చేస్తే మంచిది కదా అని చదువుతున్నాను’ అంటూ తన జీవితాన్ని సేవాపథంలోకి నడిపించిన సంఘటనను గుర్తు చేసుకున్నారామె.
మహిళాౖ ఖెదీ వార్త
‘‘న్యూస్‌పేపర్‌లో ‘అత్త తల పగుల కొట్టిన మహిళ’ అనే వార్త నన్ను కదిలించి వేసింది. ఆ మహిళది సత్తుపల్లి. మా మండలమే. ఎందుకిలా చేసి ఉంటుంది... ఒకసారి మాట్లాడదాం అని చంచల్‌గూడ జైలుకెళ్లి ఆమెను కలిశాను. వ్యభిచారం చేసి డబ్బు సంపాదించమని ఒత్తిడి చేయడం, భర్త ముందు దోషిగా నిలబెట్టడం వంటి బాధలు తట్టుకోలేకపోయింది. మనసు చంపుకుని బతకలేక, పట్టలేని కోపంలో రోకలితో తల మీద మోదింది. చట్టపరంగా ఆ మహిళ చేసింది తప్పే కాబట్టి న్యాయస్థానం శిక్ష విధించింది. ఆమెకు చదువు లేదు. శిక్ష పూర్తయి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె ఎలా బతకాలి అనే ప్రశ్న చాలారోజులు నన్ను తొలిచేసింది.
జైలు శిక్షణ
జైలు శిక్ష కోసం మాత్రమే కాదు శిక్షణ కూడా ఇవ్వాలని మహిళా ఖైదీలకు ఫినాయిల్ మేకింగ్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్, బ్యూటీషియన్, కంప్యూటర్ కోర్సులు నేర్పించడం మొదలుపెట్టాను. డ్వాక్రా గ్రూపు లీడర్ల కు ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ ప్రోగ్రామ్‌లో వందలాది మహిళలకు శిక్షణనిచ్చాను. సమాజంలో నేను చూసిన సమస్యలు, నాకు ఎదురైన సవాళ్ల నుంచి పాఠాలు నేర్చుకున్నాను. ఆ పాఠాలే నా సేవకు సోపానాలు. మా ఉమ్మడి కుటుంబంలో ఏడాది బిడ్డ కంటిని కోల్పోయింది. ఇంటిల్లిపాదీ అనుభవించిన మానసిక క్షోభను దగ్గరగా చూశాను. అందుకే కంటి ఆపరేషన్‌ల మీద ఎక్కువ దృష్టి పెట్టాను. ఖైదీలకు కంటి ఆపరేషన్‌లు చేయించడానికి హోమ్ మంత్రి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది.
‘జైలు నుంచి సరోజినీదేవి కంటి ఆసుపత్రికి తీసుకెళ్లి, ఆపరేషన్ చేయించి కోలుకున్న తర్వాత తిరిగి జైల్లో దించడంలో ఏ మాత్రం తేడా జరిగినా నువ్వు జైల్లో ఉండాల్సి వస్తుందమ్మా జాగ్రత్త’ అని హెచ్చరించారు అప్పటి హోమ్ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి. విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ప్రశంసల వర్షం కురిపిస్తుంటే కానీ నేను చాలా పెద్ద సాహసం చేశానని తెలియలేదు. నిస్వార్థంగా గోరంత సేవ చేస్తే ఆకాశమంత గౌరవం దక్కుతుందని తెలిసింది. పాతికేళ్లు నిండిన సామాజిక సేవలో వర్మీ కంపోస్ట్ సర్వీస్‌కు రాష్ట్రపతి నుంచి పురస్కారం అందుకోవడం, రామకృష్ణ మఠం నుంచి మదర్ థెరిస్సా పురస్కారం నా మది నిండిన జ్ఞాపకాలు’’ అన్నారీ సామాజిక ఉద్యమకారిణి.
ఆటా సభల్లో కొత్త భారతం
జీవితం అంటేనే సవాళ్లమయం. కష్టం వచ్చిందని ఏ ఆడపిల్లా చనిపోకూడదు... తమ కాళ్ల మీద తాము నిలబడాలి, కష్టపెట్టిన వాళ్లు తలదించుకునేలా జీవించి చూపించాలనేదే నా సందేశం. అందుకే నా సర్వీస్‌లో హెల్త్, ఎడ్యుకేషన్, ఎకనమిక్ ఎంపవర్‌మెంట్ మీద దృష్టి పెట్టాను. సివిల్స్ ప్రిపరేషన్ కోసం హైదరాబాద్‌కు వచ్చిన పేదింటి ఆడపిల్లలకు ఉచితంగా బస, భోజనం అందిస్తున్నాను. మా తరంలో మహిళలకు అందని అభివృద్ధిని ఈ తరం యువతుల్లో చూస్తున్నాను. అయితే మనదేశంలో ఆడవాళ్లు ఎంత చదివినా, ఎంత పెద్ద బాధ్యతలు నిర్వర్తిస్తున్నా సరే... ఇంటికి వచ్చేటప్పటికి ఆమె గృహిణిగా మారిపోవాల్సిందే. గరిట ఆమె కోసం చూస్తూ ఉంటుంది. 2012లో ఆటా సభలకు యూఎస్‌లోని ఆట్లాంటాకు వెళ్లినప్పుడు మనం కోరుకుంటున్న స్త్రీ సమానత్వాన్ని అక్కడ చూశాను. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసుకుంటారు, ఇంటిపనులను పంచుకుంటారు. యువతరం ఆలోచనలు సున్నితత్వాన్ని సంతరించుకుంటున్నందుకు సంతోషం కలుగుతోంది.
– శ్రీలక్ష్మి రెడ్డి, సోషల్ యాక్టివిస్ట్
– వాకా మంజులారెడ్డి
‘సాక్షి’ స్టేట్ బ్యూరో
ఫొటో: నోముల రాజేశ్‌రెడ్డి


