సాక్షి,హైదరాబాద్: బీఆర్‌ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు ఎమ్మెల్యేలకు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే, స్పీకర్ నిర్ణయాన్ని పిటిషన్ దాఖలు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్పీకర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించనున్నారు. ఈ మేరకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు ఎమ్మెల్యేలకు ఊరట దక్కింది. అరికపూడి గాంధీ,గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తీర్పును వెలువరించారు.
ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారారని, వారిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై స్పీకర్ విచారణ చేపట్టారు. ఆ ఐదుగురు పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వారికి అనర్హత వేటు నుంచి ఉపశమనం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ వరుస పరిణాలపై బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. స్పీకర్ తీర్పు ఇచ్చిన ఐదుమంది ఎమ్మెల్యేల కేసులో హైకోర్టుకు వెళ్లాలని భావిస్తోంది. స్పీకర్ నిర్ణయంపై కేసీఆర్, కేటీఆర్‌తో పిటిషనర్లు వివరించినట్లు తెలుస్తోంది.
స్పీకర్ నిర్ణయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్ స్పందించారు. స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. స్పీకర్ నిర్ణయంపై న్యాయపోరాటం చేస్తాం’ అని వ్యాఖ్యానించారు.


