హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్ చలాన్లను మాఫీ చేయడానికి లంచాలు తీసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నర్సింగరావుపై సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ వేటు వేశారు. ఆయనను వెంటనే బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఇన్స్పెక్టర్ నర్సింగరావుతో పాటు ఎస్ఐ అశోక్, హోంగార్డు కేశవులు, కోర్టు కానిస్టేబుల్ సుధాకర్‌లను కూడా బదలీ చేస్తూ సీపీ సజ్జనార్ చర్యలు తీసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు సంబంధించిన చలాన్లను క్లియర్ చేయడానికి పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ సిబ్బందిపై ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ సజ్జనార్ మరోసారి స్పష్టం చేశారు. ఇప్పటికే ఇద్దరు ఏసీపీలు, నలుగురు ఇన్స్పెక్టర్లపై చర్యలు తీసుకున్న ఆయన, పోలీస్ వ్యవస్థలో అవినీతికి తావులేదని హెచ్చరిస్తున్నారు.


