సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. మొదటి దశ విచారణలో భాగంగా.. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తీర్పు వెలువరించే అవకాశం కనిపిస్తోంది. ఆ ఐదుగురు ఎమ్మెల్యేలపై నిర్ణయం ఏంటి?.. ఐదుగురిపై వేటు వేస్తారా? లేదంటే ఫిరాయింపే లేదంటారా? స్పీకర్ ఏం చెప్పబోతున్నారు?.. అనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.
పార్టీ ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీపై దాఖలైన పిటిషన్లపై నిర్ణయాన్ని స్పీకర్ వెల్లడించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆయా ఎమ్మెల్యేల అడ్వొకేట్లకు మధ్యాహ్నాం రావాలని కబురు పంపినట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే.. మధ్యాహ్నం 3.30 గంటలకు ఓపెన్ కోర్టులో తీర్పు వెలువరించనున్నారు. ఆపై శాసనసభ వెబ్‌సైట్‌లో తీర్పు ప్రతులను అధికారులు అప్‌లోడ్ చేయనున్నారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ BRS (భారత రాష్ట్ర సమితి) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై పలుమార్లు విచారణ జరిగింది. ఈ నెల 18వ తేదీ లోపు ఏదో ఒకటి తేల్చాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు డెడ్‌లైన్ నేపథ్యంలో స్పీకర్ తన నిర్ణయాన్ని నేడు ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
మిగతా ఐదుగురు ఎమ్మెల్యేల పిటిషన్లు ఇంకా పెండింగ్‌లో ఉండడంతో.. నిర్ణయం కాస్త ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే.. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లు మాత్రం స్పీకర్ నోటీసులకు వివరణలు ఇచ్చుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి విషయంలో స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతోందోనని చర్చా నడుస్తోంది.


