రాష్ట్ర భవిష్యత్తుతో బాబు చెలగాటం! | KSR Comment: Chandrababu Wrong Turn For AP Debitsp | Sakshi
Sakshi News home page

రాష్ట్ర భవిష్యత్తుతో బాబు చెలగాటం!

Dec 17 2025 10:47 AM | Updated on Dec 17 2025 10:47 AM

KSR Comment: Chandrababu Wrong Turn For AP Debitsp

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి బాగా తెలిసినవారు ఒక సంగతి చెబుతుంటారు. ఏదైనా చేయకూడని, లేదా విమర్శలకు ఆస్కారమిచ్చే కార్యక్రమం చేయదలచుకుంటే ముందుగా దానిని తన ప్రత్యర్దులకు చుడుతుంటారు. తాను తప్పు చేసేందుకు ప్రత్యర్ధి రాజకీయ పార్టీనే కారణమన్న భావన కల్పిస్తారు. ఆ తర్వాత తనకు అనుకూలమైన వాదనను తెరపైకి తీసుకువచ్చి పని ముగించుకుంటారు అని. కొద్ది రోజుల క్రితం నల్లజర్లలో జరిగిన ఒక సభలో అప్పులు పుట్టడం లేదన్న చంద్రబాబు కొద్ది రోజులకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సజావుగా ఉందన్న ప్రజెంటేషన్ ఇచ్చారు. 

ఆ క్రమంలో ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వాన్ని, మాజీ ముఖ్యమంత్రి జగన్ పాలనను విధ్వంసమని విమర్శించారు. జగన్ ప్రభుత్వం భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టుపెట్టి రుణాలు తీసుకువచ్చిందని అన్నారు.  అధిక వడ్డీకి అప్పు చేసిందని ఆరోపించారు. తన ప్రభుత్వం 18 నెలలు కష్టపడి ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోసిందని చెప్పుకొచ్చారు. సహజంగానే ఈ వివరాలను ఎల్లో మీడియా ఈనాడు, ఆంద్రజ్యోతులు భజన చేశాయి. దాంతో ఆయన లక్ష్యం నెరవేరినట్లు అయ్యింది. ఆ తర్వాత అసలు సినిమా మొదలైంది. 

కొత్తగా మరో సుమారు రూ.13 వేల కోట్ల అప్పు చేసేశారు. దీనికోసం ప్రజలను మానసికంగా సిద్ధం చేసేందుకు గత ప్రభుత్వంపై విమర్శలు చేశారన్నమాట. ఆ క్రమంలో చంద్రబాబు సర్కార్ మద్యంపై వచ్చే భవిష్యత్తు ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టేసింది. ఎక్సైజ్ బాండ్ల ద్వారా 9.15 శాతం వడ్డీకి  సుమారు రూ.5500 కోట్ల అప్పులు చేసినట్లు ‘సాక్షి’ ద్వారా ప్రపంచానికి తెలిసింది. రాజధాని పేరుతో మళ్లీ అప్పులు చేశారని సమాచారం వచ్చింది. ఈ రకంగా వేలకు వేల కోట్ల అధిక వడ్డీకి అప్పులు తెచ్చి ఎక్కడ ఖర్చు పెడుతున్నారో, దానివల్ల సమకూరుతున్న ప్రయోజనం ఏమిటో ప్రజలకు తెలియకుండా కథ నడిపిస్తున్నారు. 

ఇన్నివేల కోట్ల అప్పులు తెచ్చినా ఎన్నికల సమయంలో ఇచ్చిన  హామీలను ఏవో అరకొర తప్ప పూర్తిగా  నెరవేర్చడానికి  పూనుకోవడం లేదు. ప్రభుత్వం రెగ్యులర్‌గా అమలు చేసే స్కీముల బకాయీలు తీర్చడం లేదు. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలే రూ.35 వేల కోట్ల వరకు ఉంది. ఈ మధ్య  చిన్న కాంట్రాక్టర్ల బిల్లులు కూడా సకాలంలో చెల్లించడం లేదు. గతంలో జగన్ టైమ్ లో మద్యం అమ్మకాల ఆధారంగా రుణాలు తీసుకుంటే చాలా పెద్ద తప్పు చేసినట్లు చంద్రబాబుతోపాటు ఎల్లో మీడియా విస్తారంగా ప్రచారం చేసింది. ఇప్పుడు మాత్రం కిమ్మనడం లేదు. 

వారికి ఇప్పుడు రాష్ట్రం శ్రీలంక అయినట్లు అనిపించదు.  చంద్రబాబు  అప్పు చేస్తే అమెరికా అవుతుందని ప్రచారం చేయడమే ఎల్లోమీడియాకు  తరువాయి అన్నమాట. అంతేకాదు.మైనింగ్ కార్పొరేషన్ కు చెందిన సుమారు రూ.రెండు లక్షల కోట్ల విలువైన గనులను తాకట్టుపెట్టి తొమ్మిదివేల కోట్ల  అప్పు చేయడమే  కాకుండా, ఆ రుణం చెల్లింపులో సమస్య వస్తే, ఏకంగా ఆర్బీఐ నుంచే డ్రా చేసుకునేలా కూటమి సర్కార్ హామీ ఇచ్చిన విషయాన్ని మాత్రం చంద్రబాబు చెప్పినట్లు కనబడదు.  

ఆర్థిక నిపుణుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ తాను ఎక్కువ వడ్డీకి రుణం తీసుకోవడం కోసం ముందుగా గత ప్రభుత్వంపై అవే ఆరోపణలు చేశారన్నమాట. అంటే ఎవరైనా ఏమిటి ఈ వడ్డీలు అని అడిగినా, గతంలో కూడా ఇలాగే జరిగిందని అనుకోవాలన్న మాట. అందులో నిజానిజాల ఎంత అన్నది వేరే విషయం.  అప్పులు ఒక సమస్య అయితే, ఏపీ ప్రజలను పచ్చి తాగుబోతులుగా మార్చడానికి వెనుకాడకపోవడం ఇంకో సమస్య. మద్యం ద్వారా 2024-2025లో రూ.24 వేల కోట్ల ఆదాయం వస్తే 2025-2026లో  రూ.35 వేల కోట్లకు పెంచాలని ఆదేశించారట. 

మీడియా కథనం ప్రకారం గతేడాది కన్నా రూ.11 వేల కోట్లు మద్యం ద్వారా ప్రభుత్వం అదనంగా సంపాదిస్తుందని చెప్పి రూ.5500 కోట్లు రుణం తీసుకున్నారన్న మాట. అంతేకాదు. ఆపై ఏడాది ఈ ఆదాయం రూ.50 వేల కోట్లు చేస్తారట. ఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా? ఇలా మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మించడంలో ఏ హిందూమత ధర్మం, ఏ సనాతన ధర్మం కనిపిస్తుందో ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణే చెప్పాలి. మద్యం మత్తులో మోటారు సైకిల్ నడుపుతూ ఒక బస్ తగలబడిపోయేందుకు కనీసం 19 మంది మరణించేందుకు కారణమైన విషయం జనం మదిలో నుంచి ఇంకా పోలేదు. 

ఆ అనుభవాన్ని గుణపాఠంగా తీసుకోకపోగా,  ఎవరైనా మద్యం బెల్టు షాపుల గురించి, నకిలీ మద్యం గురించి మాడ్లాడితే  వారిపై వీర విధేయులైన  కొందరు పోలీసు అధికారులతో తప్పుడు కేసులు పెట్టించి భయపెట్టాలని యత్నిస్తున్నారు. స్వర్ణాంధ్ర సాధిస్తామని ఊదరగొట్టిన చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రాన్ని మద్యాంధ్ర ప్రదేశ్ గా మార్చుతున్నారా అన్న విమర్శలు వస్తున్నాయి. రుణాలపై వడ్డీ గురించి చూస్తే గరిష్టంగా ఏడు శాతం వరకు  ఉంటుంది. అలాంటిది 9.5 శాతం వడ్డీ అంటే ఆ మేరకు ప్రజలపై భారం పడినట్లే. 

అప్పుల మీద అప్పులు చేసుకుంటూ చేస్తూ ఇప్పటికి రూ.2.66 లక్షల కోట్ల రుణం తీసుకుని దేశంలోనే నెంబర్ ఒన్ స్థానంలో నిలిచి అప్రతిష్టను మూటకట్టుకుంది. రాజధాని పేరుతో తీసుకునే అప్పులపై కూడా ఎక్కడా తగ్గడం లేదు. తాజాగా మరో రూ.7387 కోట్ల అప్పు తీసుకుంటున్నారు. నాబార్డు ద్వారా తీసుకుంటున్న ఈ రుణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఉంటుంది. అంటే దీని అర్థం ఏపీ ప్రభుత్వం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చెల్లించాల్సిందని అనేగా! ఈ తాజా అప్పుకూడా కలుపుకుంటే రాజధాని రుణం రూ.47387 కోట్లకు చేరిందన్నమాట. 

రాజధానిలో ఎన్ని పనులు చేస్తారో తెలియదు కాని రుణాలకు మాత్రం కొదవలేదు. దీనివల్ల రాజధాని చుట్టుపక్కల గ్రామాలకు ఏమైనా కాస్తో, కూస్తో లాభం ఉంటుందేమో కాని ఏపీ ప్రజలందరికి కలిసివచ్చేది ఎంత ఉంటుందన్నది ఎవరికి తెలియదు. అప్పుల భారం మాత్రం అన్ని ప్రాంతాల వారు భరించాల్సి ఉంటుంది. సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని, ప్రభుత్వం సొంత వనరుల నుంచి రూపాయి ఖర్చు చేయనక్కర్లేదని చంద్రబాబు గతంలో ఒక పాట మాదిరి పాడేవారు. కాని ప్రభుత్వం వచ్చాక అసలు విషయం బయటపడింది.

సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అన్నది ప్రజలను మభ్యపెట్టడానికే అని తేలిపోతోంది. పోనీ తెచ్చిన డబ్బును పొదుపుగా ఖర్చు పెడుతున్నారా అంటే అదేమీ కనిపించడం లేదు. దుబారాకు ఆకాశమే హద్దుగా ఉంటోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కిలోమీటర్ రోడ్డు నిర్మాణానికి రూ.180 కోట్ల వరకు ఖర్చు చేయబోతున్నారు. అలాగే చదరపు అడుగుకు రూ.తొమ్మిది వేల నుంచి రూ.10 వేల వ్యయం చేయడానికి సిద్ధపడ్డారు. సీఎం నివసించే కరకట్ట రోడ్డుపై మంచి విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తారట. అందుకు రూ.ఐదున్నర కోట్లు వ్యయం చేస్తారట. 

ఇది దుబారా కాదా?మరో వైపు రైతులకు అభివృద్ధి  చేసిన ప్లాట్లు ఎప్పటికి ఇస్తారో తెలియదు. ఈ భూమి చాలదని ఇంకో 44 వేల ఎకరాలకు టెండర్ పెడుతున్నారు. సీఎంతోపాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్‌ల విమాన, హెలికాఫ్టర్ ప్రయాణాలకు తడిసి మోపెడు ఖర్చు అవుతోంది. ఈ ఏడాది ఇప్పటికే చంద్రబాబు పర్యటనల ఖర్చు రూ.40 కోట్లు  దాటిందట. నాలుగు వేల రూపాయల ఫించన్‌ పంపిణీకి లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారంటేనే ప్రభుత్వం ఎంత బాధ్యతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ చూస్తే చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి  ఏపీ భవిష్యత్తును  ఎంతగా విధ్వంసం చేస్తుందో అన్న ఆందోళన కలుగుతుంది.


-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement