సాక్షి, విశాఖ: విశాఖ బీచ్ రోడ్డులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫార్చ్యూన్ అపార్ట్‌మెంట్‌లో ఉవ్వెత్తున అగ్ని కీలలు ఎగసిపడుతున్నాయి. దీంతో స్థానికంగా భయాందోళనకర వాతావరణం ఏర్పడింది. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక వాహనాలు మంటలను అదుపులోనికి తెస్తున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
కాగా ఇటీవలే విశాఖపట్టణంలోని కింజ్ జార్జ్ ఆస్పత్రి(కేజీహెచ్)లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆస్పత్రిలోని కార్డియాలజీ విభాగంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆస్పత్రిలోని పలు టేబుల్లు, కంప్యూటర్లు దగ్ధమయ్యాయి. నాడు కేజీహెచ్ ఆర్ ఎం ఓ బంగారయ్య మాట్లాడుతూ ఆస్పత్రిలోని డేటా ఎంట్రీ రూమ్ నుంచి పొగలు రావడాన్ని సిబ్బంది గమనించారని, వెంటనే మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారన్నారు.
ఆస్పత్రిలోని రోగులు అందరినీ షిఫ్ట్ చేశామని, ప్రమాదంలో ఎవరికీ, ఎటువంటి ఇబ్బంది ఎదురుకాలేదన్నారు. ప్రమాదంపై వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ స్పందించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. రోగుల పట్ల ప్రభుత్వానికీ, అధికారులకు శ్రద్ద లేదన్నారు. కేజీహెచ్‌లో అధికారుల మధ్య సమన్వయం లేదని, ఎక్కడా సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదని గణేష్ పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని, ఓవర్ లోడ్ కారణంగానే షార్ట్ సర్క్యూట్ జరిగిందన్నారు. ఇంత జరిగినా కలెక్టర్ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.


