ఏపీ ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు
ఈవీఎంలపై ప్రజల్లో అనుమానాలున్నాయి.. బ్యాలెట్ పేపరే శరణ్యం
కౌంటింగ్ రోజున ఈవీఎం బ్యాటరీ చార్జింగ్ ఎలా పెరిగింది?
వీవీపాట్ స్లిప్పులు అడిగితే తగులబెట్టామన్నారు
ఎన్నికల సంస్కరణలపై లోక్‌సభలో గళమెత్తిన వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలని, అప్పుడే గెలిచిన వారికైనా, ఓడిన వారికైనా వ్యవస్థపై నమ్మకం ఉంటుందని వైఎస్సార్‌సీపీ లోక్‌సభ పక్ష నేత, ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి చెప్పారు. ఎన్నికల సంస్కరణలపై లోక్‌సభలో మంగళవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఈవీఎంలపై నెలకొన్న అనుమానాలను, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో గత ఎన్నికల్లో జరిగిన వింత పోకడలను ఎండగట్టారు. ప్రపంచంలోని అత్యాధునిక సాంకేతికత కలిగిన దేశాలే ఈవీఎంలను పక్కనపెట్టి బ్యాలెట్ పేపర్‌వైపు వెళుతుంటే.. మనం ఇంకా ఈవీఎంలను పట్టుకుని వేళ్లాడటంలో అర్థం లేదని చెప్పారు.
ఏపీ ఎన్నికల్లో పోలింగ్ సరళిపై మిథున్‌రెడ్డి తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 3 కోట్ల 38 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. కానీ ఆశ్చర్యకరంగా సాయంత్రం 6 గంటల తర్వాత ఏకంగా 15 శాతం ఓట్లు.. అంటే సుమారు 51 లక్షల ఓట్లు రికార్డయ్యాయి. రాష్ట్ర చరిత్రలో 2014లోగానీ, 2019లోగానీ ఎప్పుడూ ఇలా జరగలేదు. ఈ ఆకస్మిక పెరుగుదల ఎలా సాధ్యమైందో అర్థం కావడం లేదు. ఒడిశాలోనూ ఇలాంటి ఫిర్యాదులే వచ్చాయి’ అని ఆయన సభ దృష్టికి తెచ్చారు.
చార్జింగ్ పెరగడం.. స్లిప్పులు తగులబెట్టడం..
‘విజయనగరంలో కౌంటింగ్ రోజున ఈవీఎం బ్యాటరీ చార్జింగ్ 99 శాతంగా ఉంది. కానీ పోలింగ్ రోజున అది 60 శాతమే ఉంది. వాడకం తర్వాత బ్యాటరీ చార్జింగ్ తగ్గాలి. కానీ, ఎలా పెరుగుతుంది? అని మా మాజీ ఎంపీ ఫిర్యాదు చేశారు. దీనిపై ఈసీ నుంచి స్పందన లేదు. స్ట్రాంగ్‌రూమ్ సీసీటీవీ ఫుటేజీ అడిగితే ఇవ్వలేదు. కనీసం వీవీపాట్ స్లిప్పులు లెక్కించమని అడిగితే.. వాటిని తగులబెట్టేశాం, ధ్వంసం చేశాం అని సమాధానం ఇచ్చారు. అనుమానం ఉన్న ఈవీఎంలను కాకుండా వేరేవాటిపై మాక్ పోలింగ్ నిర్వహించారు’ అని మిథున్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక పోలింగ్ బూత్‌లో మరీ విడ్డూరం
‘హిందూపురం నియోజకవర్గంలోని ఒక పోలింగ్ బూత్‌లో మరీ విడ్డూరం జరిగింది. ఒకేరోజు, ఒకే సమయాన జరిగిన ఎన్నికల్లో.. ఒక బూత్‌లో మా ఎంపీ అభ్యర్థికి 472 ఓట్లు వచ్చాయి. కానీ అదే బూత్‌లో మా ఎమ్మెల్యే అభ్యర్థికి కేవలం ఒక్క ఓటు మాత్రమే వచ్చింది. అక్కడ మాకు ఐదుగురు ఏజెంట్లున్నారు. వాళ్ల కుటుంబసభ్యుల ఓట్లే 30 వరకు ఉంటాయి. గత 30 ఏళ్లుగా మేము గెలుస్తున్న బూత్ అది. ఎంపీ అభ్యర్థికి 472 ఓట్లు పడినచోట, ఎమ్మెల్యే అభ్యర్థికి ఒక్క ఓటు పడటం ఈవీఎంల పనితీరుపై అనుమానాలకు తావిస్తోంది’ అని చెప్పారు.
అమెరికానే బ్యాలెట్ వైపు వెళ్తోంది
టెక్నాలజీలో ఎంతో ముందున్న ఎలాన్ మస్క్ వంటి వారే ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని చెబుతున్నారని, అమెరికాలో 92 శాతం ఎన్నికలు బ్యాలెట్ పేపర్ మీదే జరుగుతున్నాయని మిథున్‌రెడ్డి చెప్పారు. నెదర్లాండ్స్, జర్మనీ, ఐర్లాండ్, ఫిన్లాండ్, బంగ్లాదేశ్ వంటి దేశాలన్నీ ఈవీఎంలను రద్దుచేసి బ్యాలెట్ పేపర్‌కు మళ్లాయని తెలిపారు. ‘నేను మూడుసార్లు ఎంపీగా గెలిచింది ఈవీఎంల మీదనే అయినా, ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయడానికి బ్యాలెట్ పేపర్ విధానాన్ని తిరిగి తీసుకురావాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ప్రతి పోలింగ్ బూత్‌లో వెబ్‌కాస్టింగ్ ఉండాలని, ఆ ఫుటేజీని అన్ని రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉంచాలని మిథున్‌రెడ్డి సూచించారు.
కేంద్రమంత్రి పెమ్మసానిపై మిథున్‌రెడ్డి సెటైర్లు
ఎస్‌ఐఆర్‌పై జరిగిన చర్చలో మిథున్‌రెడ్డి మాట్లాడుతుండగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అడ్డుపడ్డారు. దీంతో ‘ఉపాధిహామీ పథకం డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదు. రాష్ట్రంలోని కూలీల పరిస్థితులపై నీకు సరైన అవగాహన లేదు. బ్యాలెట్ పేపర్ విషయంపై మాట్లాడుతుండగా ఈ విషయంలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు’ అంటూ మిథున్‌రెడ్డి ప్రతిఘటించారు. ‘లేదు వచ్చాయి, అయ్యాయి’ అంటూ పెమ్మసాని ఏదో చెప్పబోతుండగా.. ‘ఎలా వచ్చాయి? బస్సులో వచ్చాయా?’ అంటూ మిథున్‌రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఉపాధిహామీ నిధులపై మిథున్‌రెడ్డి ప్రస్తావించిన సమయంలో కూటమి ఎంపీలు ఎవరూ నోరు మెదపకపోవడం, పెమ్మసానికి సపోర్ట్‌గా మాట్లాడకపోవడం గమనార్హం.


