రాహుల్ వ్యాఖ్యలకు ప్రభుత్వం దీటైన జవాబు
న్యూఢిల్లీ: ఎస్‌ఐఆర్ పేరిట మోదీ సర్కార్ మరోమారు పలు రాష్ట్రాల్లో ఓట్ల చోరీకి తెగిస్తోందంటూ కేంద్ర ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేసిన లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీకి ప్రభుత్వం తరఫున బీజేపీ నేతలు దీటైన జవాబులిచ్చారు. మంగళవారం లోక్‌సభలో ఎన్నికల సంస్కరణలపై చర్చలో ప్రభుత్వం తరఫున న్యాయశాఖ సహాయమంత్రి అర్జున్‌సింగ్ మేఘ్వాల్ మాట్లాడారు. ‘‘ వాస్తవానికి తొలి సార్వత్రిక ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ ఓట్ల చోరీకి పాల్పడింది. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌ను ఓడించాలనే దుర్బుద్ధితో ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడింది.
ఈవీఎంలు, ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్ పదేపదే ఆరోపణలు గుప్పిస్తోందిగానీ సహేతుక కారణాలను వెల్లడించలేక చతికిలపడింది. 1952 నుంచి 2002 ఏడాదిదాకా ఎస్‌ఐఆర్‌ను పలుమార్లు చేపట్టారు. ఇది కొత్తదేమీ కాదు. గత 2 దశాబ్దాలుగా ఎస్‌ఐ ఆర్ నిర్వహించట్లే రు. దీంతో వల సలు, మరణాలు, సవరణలు, పట్ట ణీకర కారణాలతో ఓటర్ల జాబితాలో మార్పులొచ్చాయి.
వాస్తవాలు ప్రతిబింబించేలా పారదర్శకంగా ఎస్‌ఐఆర్‌ను తాజాగా చేపట్టాల్సిన సమయం వచ్చింది. అందుకే బిహార్‌లో పూర్తిచేశాం. మిగతా రాష్ట్రాల్లోనూ చేస్తాం. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు సూచించిన కమిటీ అనేది తాత్కాలిక ఏర్పాటు మాత్రమే. సుప్రీంకోర్టు ఆదేశాలమేరకే నూతన చట్టం తెచ్చాం’’ అని మేఘ్వాల్ చెప్పారు.
ఈవీఎంలు రాజీవ్ హయాంలోనే..
ఈవీఎంలను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్న రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై జార్ఖండ్ నేత, గోధా నుంచి గెలిచిన బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే తప్పుబట్టారు. ‘‘ఈవీఎంలపై విపక్ష పార్టీలు యాగీచేస్తున్నాయి. వాస్తవానికి నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ హయాంలో 1987లో పైలట్ ప్రాజెక్ట్‌గా ఈవీఎంలను పరీక్షించారు. 1991లో కాంగ్రెస్ నేత పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఎన్నికల్లో ఉపయోగించారు. ఇప్పుడు విమర్శిస్తున్న ఇదే కాంగ్రెస్‌లోని ఆనాటి నేతలు ఈవీఎంలను వేనోళ్ల పొగిడారు. అత్యంత పారదర్శకమైన ఎన్నికల నిర్వహణ పరికరం ఇదేనని ఆకాశానికి ఎత్తేశారు. రిగ్గింగ్‌ను నివారించేందుకు ఈవీఎంలే సరైన పరిష్కారమని 1961లో కమిటీ సైతం అభిప్రాయపడింది’’ అని దూబే.. రాహుల్‌కు దీటైన బదులిచ్చారు.


