చర్చను ప్రారంభించనున్న ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ
చర్చకు 10 గంటల సమయం
ప్రభుత్వం తరఫున సమాధానం ఇవ్వనున్న న్యాయ శాఖ మంత్రి మేఘ్వాల్
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) సర్వే, ఎన్నికలపై సంస్కరణలపై మంగళవారం లోక్‌సభలో ప్రత్యేక చర్చ జరుగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు చర్చను లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు. ఈ అంశంపై లోక్‌సభలో మొత్తంగా పది గంటల సమయం కేటాయించారు.
కాంగ్రెస్ తరఫున కేసీ వేణుగోపాల్, మనీష్ తివారీ, వర్ష గైక్వాడ్, మొహమ్మద్ జావైద్, ఉజ్వల్ రామన్ సింగ్, ఇషా ఖాన్ చౌదరి, మల్లు రవి, ఇమ్రాన్ మసూద్‌లు మాట్లాడతారు. తర్వాత ప్రభుత్వం తరఫున కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ బుధవారం చర్చకు సమాధానం ఇవ్వనున్నారు. చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ ‘ఓట్ల చోరీ‘, ఎన్నికల కమిషన్ జవాబుదారీతనం అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశముంది.
ఓటర్ల జాబితాలో గణనీయమైన వ్యత్యాసాలు, ఎన్నికల విధానాలను తారుమారు చేయడం వంటి అంశాలపై ఇప్పటికే ప్రతిపక్షాలు కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధించడం తెల్సిందే. మహారాష్ట్ర, హరియాణా, కర్ణాటక రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల్లో తీవ్రమైన తప్పిదాలు జరిగాయని, ఓటరు జాబితా సవరణ పేరిట పెద్ద ఎత్తున నిజమైన పౌరుల ఓట్లను తొలగించారని, నకిలీ ఓట్లను కలిపారని రాహుల్ గత కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. ఎస్‌ఐఆర్ కసరత్తు చాలా మంది బూత్ స్థాయి అధికారుల(బీఎల్‌ఓ) పాలిట శాపంగా తయారైందని, అందుకే తీవ్ర ఒత్తిడితో పలువురు చనిపోయారని విపక్షాలు ఆరోపి స్తున్నాయి. ఈ అంశాన్ని విపక్ష సభ్యులు సభలో లేవనెత్తేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.


