పాకిస్తాన్ గూఢచారులకు కీలక సమాచారం చేరవేస్తున్నారన్న ఆరోపణలతో గత ఏడాది అరెస్టయిన హర్యానాకు చెందిన ప్రముఖ యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ జ్యోతి రాణి అలియాస్ జ్యోతి మల్హోత్రా ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గత ఏడాది మే నెలలో ‘అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్’ కింద ఆమెను అరెస్ట్ చేశారు. పది నెలలు గడుస్తున్నా విచారణ మాత్రం అడుగు ముందుకు పడలేదని ‘ది ప్రింట్’ తన కథనంలో పేర్కొంది. ఇప్పటివరకు కనీసం నేరారోపణలపై ప్రాథమిక విచారణ కూడా ప్రారంభం కాకపోవడం గమనార్హమని వ్యాఖ్యానించింది.
అసలు కేసు ఏంటి?
హిసార్‌కు చెందిన జ్యోతి మల్హోత్రా 'ట్రావెల్ విత్ జో' పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఉత్తరాది రాష్ట్రాల్లో జరిగిన సోదాల్లో భాగంగా ఆమెను హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్‌తో ఆమె నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని, దేశ భద్రతకు ముప్పు కలిగించేలా కీలక ప్రాంతాల వీడియోలను పంచుకున్నారని పోలీసులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు.
వివాదంలో 'పాండో డ్యామ్' వీడియో
ఈ కేసులో హిమాచల్ ప్రదేశ్‌లోని 'పాండో డ్యామ్'కు సంబంధించిన వీడియో అత్యంత కీలక సాక్ష్యంగా మారింది. ఈ డ్యామ్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం ‘కేటగిరీ-బి’ కిందకు వచ్చే అత్యంత సున్నితమైన ప్రాంతమని, ఇక్కడ వీడియోలు తీయడం నిషిద్ధమని భక్రా బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డ్ స్పష్టం చేసింది. అయితే ఈ డ్యామ్ నిషిద్ధ ప్రాంతం కాదని, దీనికి సంబంధించిన ఫోటోలు, వివరాలు ఇప్పటికే ప్రభుత్వ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉన్నాయని జ్యోతి తరపు న్యాయవాది రవీందర్ సింగ్ ధుల్ వాదిస్తున్నారు.
పాక్ హైకమిషన్ ఉద్యోగితో సంబంధాలు?
జ్యోతి మల్హోత్రా 2023లో వీసా కోసం ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌కు వెళ్లినప్పుడు అక్కడ పనిచేసే ముహమ్మద్ ఎహసాన్-ఉర్-రహీమ్ అలియాస్ డానిష్‌తో పరిచయం ఏర్పడిందని పోలీసులు కోర్టుకు తెలిపారు. వీరిద్దరూ వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా టచ్‌లో ఉన్నారని, ఆమె పాకిస్తాన్ పర్యటనలో ఉన్నప్పుడు అక్కడి భద్రతా అధికారులతో రహస్య సమావేశాలు ఏర్పాటు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియా ఫాలోవర్స్‌ను పెంచుకోవాలనే ఆశతో, డబ్బు ఆశకు లోబడి ఆమె భారత దేశ భద్రతకు సంబంధించిన వివరాలను పంచుకున్నట్లు పోలీసులు కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు.
బెయిల్ నిరాకరణ.. సుప్రీంకోర్టుకు లాయర్
ఇటీవలే పంజాబ్, హర్యానా హైకోర్టు జ్యోతి బెయిల్ దరఖాస్తును తిరస్కరించింది. ఆమె దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. అయితే, ఈ కేసులో ‘అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్’ ప్రయోగించే అధికారం జిల్లా పోలీసులకు లేదని, అది కేవలం కేంద్ర హోం శాఖకు మాత్రమే ఉంటుందని జ్యోతి తరపు న్యాయవాది వాదిస్తున్నారు. హైకోర్టు తీర్పును త్వరలోనే సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని ఆయన తెలిపారు.
జ్యోతి తండ్రి ఆవేదన
‘మా అమ్మాయి కేవలం టూరిస్టుగా అక్కడికి వెళ్లింది. సాధారణ పర్యాటకులు తీసినట్లే ఆమె కూడా వీడియోలు తీసింది. పాకిస్తాన్ కోణం ఉండటంతో ఎవరూ నిజం వినడానికి సిద్ధంగా లేరు’ అని జ్యోతి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. 2,500 పేజీల ఛార్జ్‌షీట్ ఫైల్ చేసినా, సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ పేరుతో పోలీసులు కాలయాపన చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం జ్యోతి మల్హోత్రా హిసార్ జైలులో ఉన్నారు. దేశ సార్వభౌమాధికారానికి ముప్పు తెచ్చే సెక్షన్ల కింద నమోదైన ఈ కేసులో విచారణ ఎప్పుడు మొదలవుతుందో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: ఏ పనీ చేయకున్నా.. నీరసం వేధిస్తోందా?


