వాషింగ్టన్: ఇరాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో యుద్ధం త్వరలోనే ముగుస్తుందని ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుత వారంలో ఈ వివాదం ముగిసే అవకాశం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో అమెరికా మిత్ర దేశాలపై ట్రంప్ సెటైరికల్ కామెంట్స్ చేశారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ..‘ఇరాన్‌తో యుద్ధం త్వరలోనే ముగింపునకు వస్తుంది. ఇప్పటికే యుద్ధం మూడో వారంలోకి చేరుకుంది. యుద్ధం ముగిసినప్పుడు మనకు చాలా సురక్షితమైన ప్రపంచం ఉంటుంది. తక్షణ ముగింపును నేను ఆశించడం లేదు. ఇరాన్ అణ్వాయుధాలను సంపాదించకుండా ఆపడం ప్రపంచ భద్రత కోసం అత్యంత అవసరం. ఇరాన్‌కు అణ్వాయుధాలు లభిస్తే అవి వెంటనే ఉపయోగించే అవకాశం ఉంది. అలా జరిగితే పశ్చిమాసియా మొత్తం ప్రమాదంలో పడే అవకాశం ఉంది’ అని హెచ్చరించారు.
ఇదే సమయంలో తాను యుద్ధాలను కోరుకునే వ్యక్తి కాదని, కానీ ప్రపంచ భద్రత కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. "నాకు యుద్ధాలు అంటే ఇష్టం లేదు. కానీ బాధ్యతగా కొన్ని చర్యలు తీసుకోవాల్సి వచ్చింది" అని ఆయన అన్నారు. ఇటీవల అమెరికా చేపట్టిన సైనిక చర్యల వల్ల ఇరాన్ సైనిక సామర్థ్యం తీవ్రంగా దెబ్బతిందని ట్రంప్ పేర్కొన్నారు.
ఇరాన్ దాడులు ఆశ్చర్యమే..
అలాగే.. ఫిబ్రవరి 28న జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత మధ్య ప్రాచ్యంలో ఇరాన్ ప్రతీకార దాడులను కూడా ట్రంప్ ప్రస్తావించారు. ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, కువైట్ సహా ఈ ప్రాంతంలోని అనేక దేశాలను లక్ష్యంగా చేసుకుని టెహ్రాన్ దాడులు ప్రారంభించిదని చెప్పుకొచ్చారు. అయితే, ఇరాన్ దాడులు తనను ఆశ్చర్యం కలిగించాయని అన్నారు. నిఘా అధికారులు సైతం అలాంటి దాడులను ఊహించలేదని ట్రంప్ వెల్లడించారు. దాడికి గురైన అనేక దేశాలు ఇరాన్‌తో సాపేక్షంగా తటస్థ సంబంధాలను కొనసాగించాయని తెలిపారు.
🚨 JUST IN: President Trump reveals he could end the Iran war within DAYS if he wanted to
DOOCY: "If Iran is totally obliterated...can we wrap this war up this week?"
TRUMP: "Yeah. Sure. We could."
DOOCY: "Will we?"
TRUMP: "I don't think so, but it'll be soon!" 👀🔥 pic.twitter.com/GcAoLOIfdC— Eric Daugherty (@EricLDaugh) March 16, 2026
మిత్ర దేశాలపై ఆగ్రహం..
మరోవైపు.. వ్యూహాత్మకంగా కీలకమైన హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడంలో అమెరికాకు సహాయం చేయడానికి ఏయే దేశాలు అంగీకరించాయో త్వరలో ప్రకటించాలని ట్రంప్ స్పష్టం చేశారు. అలాగే, ప్రపంచంలోని చమురు సరఫరాలో దాదాపు ఐదవ వంతు రోజువారీ రవాణాకు కారణమయ్యే ఈ జలమార్గం ద్వారా నౌకలకు రక్షణ కల్పించడంలో అనేక మిత్రదేశాలు విముఖత చూపుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మాకు సహాయం చేయడానికి మిత్ర దేశాలు ఆసక్తి చూపడం లేదన్నారు. ఈ జలసంధి ద్వారా చమురు రవాణాపై ఎక్కువగా ఆధారపడిన దేశాలు అమెరికా ప్రయత్నాలకు మరింత మద్దతు ఇవ్వాలని వాదించారు.
ఇరాన్ ప్రపంచానికే ముప్పు..
అంతకుముందు కూడా ఇరాన్‌పై ట్రంప్ విరుచుకుపడ్డారు. ఇరాన్ 47 ఏళ్లుగా ప్రపంచానికి ముప్పుగా తయారైందని, ఇజ్రాయెల్ సాయంతో ఆ ముప్పును అంతం చేస్తామని అన్నారు. ఇప్పటి వరకు ఇరాన్‌లోని ఏడువేలకు పైగా లక్ష్యాలపై దాడులు చేశామని, అందులో అధిక భాగం వాణిజ్య, సైనిక స్థావరాలేనని పేర్కొన్నారు. ముఖ్యంగా తమ సేనలు క్షిపణులు, డ్రోన్లు తయారు చేసే పరిశ్రమలపై దాడులు చేసినట్లు ట్రంప్ వెల్లడించారు. సోమవారం కూడా అలాంటి 3 కేంద్రాలపై దాడులు చేసినట్లు చెప్పారు. మరోవైపు తమ దాడుల్లో గత వారం వ్యవధిలో వందకు పైగా ఇరాన్ నౌకలు ధ్వంసమయ్యాయని, దీనితో ఆ దేశానికి చెందిన నౌకాదళం, వాయుసేన దాదాపు అంతం అయ్యాయని పేర్కొన్నారు.


