గ్యాస్ లేక ‘బొగ్గు’మంటున్న కిచెన్లు | Coal fired kitchens return to Mohammed Ali Road Mumbai | Sakshi
Sakshi News home page

గ్యాస్ లేక ‘బొగ్గు’మంటున్న కిచెన్లు

Mar 17 2026 11:30 AM | Updated on Mar 17 2026 4:06 PM

Coal fired kitchens return to Mohammed Ali Road Mumbai

ముంబై: మనిషి పరిస్థితులను అనుగుణంగా మారుతూ తన జీవనశైలిని మార్చుకుంటాడు. ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఎల్‌పీజీ గ్యాస్‌ కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ నేపధ్యంలో తిరిగి కోల్‌ కిచెన్లు తెరపైకి వచ్చాయి. రంజాన్ మాసంలో రుచికరమైన ఇఫ్తార్ విందులకు పెట్టింది పేరు ముంబైలోని మహమ్మద్ అలీ రోడ్డు. ప్రస్తుతం ఇక్కడి హోటల్ యజమానులు ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.

కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల కొరత తీవ్రం కావడంతో గత్యంతరం లేక పాతకాలపు బొగ్గు పొయ్యిలు, డీజిల్ బర్నర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. రద్దీ సమయంలో గ్యాస్ అందక పోవడంతో వంటల తయారీ ఆలస్యమవడమే కాకుండా, ఖర్చులు కూడా తడిసి మోపెడవుతున్నాయి. ఇక్కడి ప్రసిద్ధ ‘షబ్బీర్స్ తవక్కల్ స్వీట్స్’ యజమాని మోయ్యద్ షబ్బీర్ మిఠాయివాలా మాట్లాడుతూ.. ‘గత నాలుగు రోజులుగా గ్యాస్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. చేసేదేమీ లేక బొగ్గును వాడుతున్నాం. మాల్పువా వంటి స్వీట్ల తయారీకి ఎక్కువ వేడి అవసరం. ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ స్టవ్‌లు ప్రయత్నించినా అవి మా అవసరాలకు సరిపోవడం లేదు. బొగ్గు వాడకం వల్ల కొన్ని స్వీట్ల ధరలను 5 నుంచి 10 శాతం పెంచక తప్పలేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, ప్రసిద్ధ ‘షాలిమార్’ రెస్టారెంట్ కూడా డీజిల్ బర్నర్లపై వంటలు చేస్తోంది. ‘మక్కా హోటల్’ యజమాని ఆలందర్ స్పందిస్తూ.. కొత్తగా బొగ్గు సిగ్డీలను కొనాల్సి వస్తోందని, ఒక్కో యూనిట్ ధర 7,000 రూపాయల వరకు పలుకుతోందని, ఈ భారాన్ని సామాన్య కస్టమర్లపై వేయలేకపోతున్నామని అన్నారు.

బొగ్గు వాడకంతో ఇబ్బందులు
ఎల్పీజీ స్థానంలో బొగ్గును వాడటం వల్ల హోటల్ నిర్వాహకులకు పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్యాస్‌తో పోలిస్తే బొగ్గుపై వంట చేయడానికి రెట్టింపు సమయం పడుతోంది. ఎల్పీజీ కంటే బొగ్గు వేడి చేసే శక్తి (Efficiency) 3 నుంచి 5 రెట్లు తక్కువ. బొగ్గు వాడకం వల్ల గాలిలో ప్రమాదకరమైన PM2.5 కణాలు విపరీతంగా విడుదలవుతున్నాయి. ప్రస్తుతం కిలో బొగ్గు ధర రూ. 40 నుంచి రూ. 70 వరకు పలుకుతోంది. పండుగ రోజుల్లో గ్యాస్ సరఫరా పునరుద్ధరించకపోతే ఆహార దుకాణాలు మూసివేయాల్సిన పరిస్థితి వస్తుందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

ఇది కూడా చదవండి: ఏ పనీ చేయకున్నా.. నీరసం వేధిస్తోందా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement