అమెరికా వీసాల్లో భారతీయులకు భారీ షాక్ | US visa approvals drop 62 Percent for Indian students In 2025 | Sakshi
Sakshi News home page

అమెరికా వీసాల్లో భారతీయులకు భారీ షాక్

Aug 7 2026 7:16 AM | Updated on Aug 7 2026 7:16 AM

US visa approvals drop 62 Percent for Indian students In 2025

అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలని భావిస్తున్న భారతీయ విద్యార్థులకు 2025లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏడాది అడ్మిషన్ సీజన్‌లో భారతీయ విద్యార్థులకు జారీ చేసిన F-1 స్టూడెంట్ వీసాల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే 62 శాతం మేర తగ్గింది. ఇదే సమయంలో చైనా విద్యార్థులకు కూడా వీసాల సంఖ్య తగ్గినప్పటికీ, భారతీయులతో పోలిస్తే ఆ తగ్గుదల చాలా తక్కువగా నమోదైంది.

అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్ (CIS) విడుదల చేసిన విశ్లేషణ ప్రకారం.. 2025 మే నుంచి ఆగస్టు మధ్య భారతీయులకు కేవలం 22,149 స్టూడెంట్ వీసాలు(F-1) మాత్రమే జారీ అయ్యాయి. ఇక, 2024లో 58,694 వీసాలు జారీ కాగా, ఈసారి దాదాపు 62 శాతం తగ్గుదల నమోదైంది. చైనా విద్యార్థుల విషయంలో 2024లో 61,075 వీసాలు జారీ కాగా, 2025లో ఆ సంఖ్య 40,034కు పడిపోయింది. అక్కడ తగ్గుదల 34 శాతం మాత్రమే నమోదైంది.

ప్రతి ఏడాది మే నుంచి ఆగస్టు వరకు అమెరికా విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు ప్రారంభమవుతుండటంతో ఈ కాలంలోనే అత్యధికంగా స్టూడెంట్ వీసాలు జారీ అవుతాయి. అందువల్ల ఈ నాలుగు నెలల గణాంకాలను అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశాలపై కీలక సూచికగా పరిగణిస్తారు. వీసాల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ, అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులే ఇప్పటికీ మొదటి స్థానంలో ఉన్నారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ (IIE) గణాంకాల ప్రకారం.. 2024–25 విద్యా సంవత్సరంలో అమెరికా విద్యాసంస్థల్లో 3,63,019 మంది భారతీయ విద్యార్థులు చదువుతుండగా, చైనా నుంచి 2,65,919 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 11.7 లక్షల అంతర్జాతీయ విద్యార్థుల్లో ఈ రెండు దేశాల విద్యార్థులే సగానికి పైగా ఉన్నారు.

2020 కరోనా మహమ్మారి కాలాన్ని మినహాయిస్తే, 2017–19 మరియు 2021–24 మధ్య మే-ఆగస్టు కాలంలో భారతీయులకు సగటున 55,717 F-1 వీసాలు జారీ అయ్యాయి. ఆ సగటుతో పోల్చినా 2025లో నమోదైన 22,149 వీసాల సంఖ్య దాదాపు 60 శాతం తక్కువగా ఉందని CIS పేర్కొంది. చదువు పూర్తయ్యాక అమెరికాలో ఉద్యోగం చేసే అవకాశాన్ని కల్పించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) కార్యక్రమంలో కూడా భారతీయులే అత్యధికంగా ఉన్నారు. 2024–25 విద్యా సంవత్సరంలో OPT కింద పనిచేస్తున్న మొత్తం 2,94,253 మంది అంతర్జాతీయ గ్రాడ్యుయేట్లలో 1,43,740 మంది భారతీయులు ఉండగా, చైనా నుంచి 61,981 మంది ఉన్నారు.

F-1 వీసా అంటే?
F-1 వీసా అనేది అమెరికాలోని గుర్తింపు పొందిన కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, భాషా శిక్షణా సంస్థలు లేదా ఇతర విద్యాసంస్థల్లో పూర్తికాలం (Full-time) చదువుకోవడానికి విదేశీ విద్యార్థులకు అమెరికా ప్రభుత్వం జారీ చేసే విద్యార్థి (Student) నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా.

60 రోజుల నుంచి 30 రోజులకు...
ఇదిలా ఉండగా.. CIS విశ్లేషణ ప్రకారం, ట్రంప్ ప్రభుత్వం అమలు చేస్తున్న కఠిన ఇమ్మిగ్రేషన్ విధానాలు కూడా ఈ తగ్గుదలకు ఒక కారణంగా కనిపిస్తున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం F-1 వీసాదారులకు ఇప్పటి వరకు అమలులో ఉన్న "డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్" విధానాన్ని మార్చి నిర్దిష్ట కాలపరిమితితో వీసా మంజూరు చేసే విధానాన్ని తీసుకొచ్చారు. సాధారణంగా నాలుగేళ్ల వరకు మాత్రమే అమెరికాలో ఉండే అవకాశం ఉండగా, కోర్సు ఎక్కువ కాలం కొనసాగితే అదనపు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే చదువు పూర్తైన తర్వాత అమెరికాలో ఉండేందుకు ఇచ్చే గ్రేస్ పీరియడ్‌ను 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించారు. కళాశాల లేదా కోర్సు మార్చుకునే నిబంధనలను కూడా మరింత కఠినతరం చేశారు. అయితే, వీసాల జారీ తగ్గుదలకు కేవలం కొత్త విధానాలే కారణమని నిర్ధారించలేమని నిపుణులు చెబుతున్నారు. దరఖాస్తుల సంఖ్య, వీసా అపాయింట్‌మెంట్‌ల లభ్యత, పరిపాలనా ప్రక్రియలు వంటి ఇతర అంశాలు కూడా ఈ తగ్గుదలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement