మన గుమ్మడి నర్సయ్యలా.. స్టేషన్‌ బయట ఆ మాజీ ప్రధాని! | Japans Former PM Yoshihiko Noda Still Follows a Simple Life | Sakshi
Sakshi News home page

మన గుమ్మడి నర్సయ్యలా.. స్టేషన్‌ బయట ఆ మాజీ ప్రధాని!

Sep 21 2026 11:20 AM | Updated on Sep 21 2026 11:33 AM

Japans Former PM Yoshihiko Noda Still Follows a Simple Life

పదవి పోయినా జీవనశైలి మారలేదు. హోదా ఎంత పెద్దదైనా.. ప్రజలకు మాత్రం దూరం కాలేదు. రాజకీయాల్లో ఒకప్పుడు అత్యున్నత పదవిలో ఉన్న నేత.. ఇప్పుడు కూడా నిత్యం సామాన్యుల మధ్యే కనిపిస్తున్నారు. మన దగ్గర మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య సింప్లిసిటీకి, ప్రజాసేవకు ఎలా కేరాఫ్‌గా నిలిచారో.. జపాన్‌లో 69 ఏళ్ల మాజీ ప్రధాని యోషిహికో నోడా కూడా అదే తరహాలో ఆసక్తి రేపుతున్నారు.

జపాన్‌ మాజీ ప్రధాని యోషిహికో నోడా(Yoshihiko Noda).. ఒకప్పుడు దేశాన్ని నడిపించిన నేత. ఇప్పుడు నిత్యం ఉదయాన్నే రైల్వే స్టేషన్‌కు వెళ్లి ప్రయాణికులకు కరపత్రాలు పంచుతున్నారు. తాజాగా చిబా ప్రిఫెక్చర్‌లోని మినామి-ఫునాబాషి స్టేషన్‌ వద్ద ఆయన అలా కనిపించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కొందరు ఆయన్ని గుర్తించి పలకరించగా.. మరికొందరు బిజీగా ఉండటంతో కరపత్రాలు తీసుకోకుండానే వెళ్లిపోయారు. అయినా నోడా మాత్రం తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగారు. 

ఆయన తీరే అంత!
ఇది నోడాకు కొత్త వ్యవహారం కాదు. గత నలభై ఏళ్లుగా ఆయన ఈ పని చేస్తూ వస్తున్నారు.  మధ్యలో ఆయన రాజకీయ జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. చిబా ప్రిఫెక్చర్‌ అసెంబ్లీ నుంచి జపాన్‌ పార్లమెంట్‌ వరకు ఎదిగారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2011లో జపాన్‌ ప్రధానమంత్రి అయ్యారు. 2012లో ప్రధాని పదవి నుంచి తప్పుకున్నా.. స్టేషన్‌ వద్ద ప్రజలను కలుసుకునే అలవాటును మాత్రం వదులుకోలేదు.

ఇప్పుడు ఆయన పంచే కరపత్రాల్లో స్థానిక సమస్యలు, విపత్తు బీమా, పిల్లల సంరక్షణ, ప్రిఫెక్చర్‌ సంస్కరణలు వంటి అంశాలు ఉంటున్నాయి. అంటే.. పదవిలో ఉన్నా, లేకపోయినా ప్రజలతో నేరుగా మాట్లాడటానికే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు.

హోదా మారినా.. రొటీన్‌ మారలేదు
1986 అక్టోబర్‌ 1న జేఆర్‌ సుడానుమా స్టేషన్‌ వద్ద కరపత్రాలు పంచడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఈ రొటీన్‌ను కొనసాగిస్తున్నారు. ఒక దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి.. ఏళ్ల తర్వాత కూడా ఉదయాన్నే రైల్వే స్టేషన్‌లో నిలబడి ప్రయాణికులకు కరపత్రాలు పంచడం ఆసక్తి కలిగిస్తోంది. పెద్ద కార్యక్రమాలు, భారీ హంగామా లేకుండా సాధారణంగా ప్రజలను కలవడం నోడా రాజకీయ జీవితంలో భాగంగా మారిపోయింది.

మన దగ్గర గుమ్మడి నర్సయ్య కూడా ఇలాంటి సాదాసీదా జీవనశైలితోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇల్లెందు నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన.. హంగూ ఆర్భాటాలకు దూరంగా ఉండేవారు. బస్సులు, రైళ్లలో ప్రయాణించడం, సాధారణంగా ప్రజల మధ్య కనిపించడం ఆయన జీవనశైలిలో భాగంగా ఉండేది. అందుకే పదవి తర్వాత కూడా సాధారణ జీవనశైలిని కొనసాగిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండటం.. ఈ ఇద్దరి మధ్య పోలికకు కారణమైంది.

ప్రధాని పదవి దేశ రాజకీయాల్లో అత్యున్నత హోదా. అయినా ఆ పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా ప్రజలను కలిసే విధానం మారలేదు. అలాగని ఆయన ఏదో వైరల్‌ కావడం కోసమో ఈ పని చేయడం లేదు. స్వచ్చందంగా కొందరు నెటిజన్లు ఆయన గురించి పోస్టులు చేస్తుంటారు. హోదా ఎంత పెద్దదైనా.. ప్రజల్లోకి వెళ్లడానికి పెద్ద కాన్వాయ్‌, హంగామా అవసరం లేదని నోడా రొటీన్‌ గుర్తుచేస్తోంది. ఈ సింప్లిసిటీ ఈ జనరేషన్‌ నేతల్లో ఉంటేనా.. సోషల్‌ మీడియా పోస్టులు, ఫొటోషూట్లకే పరిమితం కాకుండా.. ఇలా నేరుగా ప్రజల మధ్య కనిపించే రాజకీయాలు ఇంకెన్ని కనిపించేవో!.

ఇదీ చదవండి: సినీ ఫక్కీలో బస్సును హైజాక్‌ చేసి.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement