మోరల్‌ పోలీసింగ్‌ పేరిట మానవ మృగాళ్లు | Video Shows Group Moral Policing Young Couple in Bihars Jamui Viral | Sakshi
Sakshi News home page

మోరల్‌ పోలీసింగ్‌ పేరిట మానవ మృగాళ్లు

Sep 21 2026 7:33 AM | Updated on Sep 21 2026 7:57 AM

Video Shows Group Moral Policing Young Couple in Bihars Jamui Viral

మోరల్‌ పోలీసింగ్‌ పేరిట యువజంటలపై తరచూ దాడులు జరుగుతున్న ఘటనలు చూస్తున్నదే. అయితే ఇక్కడ ఓ యువజంటపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడిన తీరు మరీ దుర్మార్గంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యువకుడిని పక్కకు లాగిన అనంతరం.. యువతిని కొందరు చుట్టుముట్టారు. పైగా వారిలో ఒకడు ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

రాత్రివేళ ఓ యువజంటపై ఓ గ్యాంగ్‌ దాడికి దిగింది. యువకుడ్ని కొందరు లాగిపడేయగా.. ఆమె ప్రతిఘటించే ప్రయత్నం చేసింది. అందులో ముసుగుతో ఉన్న ఒకడు హఠాత్తుగా దూసుకొచ్చి ఆ యువతిని బలవంతంగా ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఆ టైంలో అసభ్యంగా తాకుతూ ఈడ్చుకెళ్లాడు. ఆమె భయంతో కేకలు వేయగా.. యువకుడు వాళ్లను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఆ యువకుడు ఆమెను విడిపించి.. అక్కడి నుంచి ఇద్దరూ పరుగులు తీశారు. 

మరో వీడియోలో కాస్త దూరంలో వాళ్లిద్దరూ బైక్‌పై కూర్చోగా.. ఆ టైంలోనూ ఆ రాక్షసులు వాళ్లతో వాగ్వాదానికి దిగారు. చివరకు యువతీయువకుడు చేతులెత్తి బతిమాలడంతో.. వాళ్లను అక్కడి నుంచి పోనిచ్చారు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందనే దానిపై స్పష్టత లేకుండా పోయింది.

ఈ వీడియోలు బయటకు రావడం, వైరల్‌ కావడంతో.. ఘటనపై సోషల్‌ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మోరల్‌ పోలీసింగ్‌ పేరుతో ఎవరినీ వేధించే లేదంటే మహిళపై అసభ్యంగా ప్రవర్తించే హక్కు ఎవరికీ లేదని పలువురు పేర్కొంటున్నారు. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తులను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

తాజా ఘటన బిహార్‌లోని జమూయి ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. ఇదే రీజియన్‌లో ఈ మధ్యకాలంలో జరిగిన మూడో ఘటన ఇది. దీంతో నెటిజన్లు అక్కడి పోలీసులపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వాళ్లది ముమ్మాటికీ ఆ యువతిని రేప్‌ చేసే ఉద్దేశంగా కనిపిస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు. మహిళను బలవంతంగా పట్టుకోవడం, ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం వంటి చర్యలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. మహిళల భద్రతపై ఇలాంటి ఘటనలు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంటున్నారు.

ప్రేమజంటలను అడ్డుకోవడం, వేధించడం, దాడి చేయడం పేరేదైనా.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం నేరమే. మహిళను చుట్టుముట్టి బలవంతంగా ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించడం, అసభ్యంగా ప్రవర్తించడం మరింత తీవ్రమైన అంశమంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా మోరల్‌ పోలీసింగ్‌ పేరిట ఇలా ప్రవర్తించడం రేపిస్టుల మనస్తత్వమని ఏకిపారేస్తున్నారు. సదరు వీడియోపై బిహార్‌ పోలీసులు ఇంకా స్పందించాల్సి ఉంది.

 ఇదీ చదవండి: మనుషులా? మానవ మృగాలా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement