తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన ఆదివారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు గజ వాహనాన్ని అధిరోహించి భక్తులకు దివ్యదర్శనమిచ్చారు.
వాహనం ముందు గజరాజులు గంభీరంగా నడుస్తుండగా.. మంగళవాయిద్యాల నడుమ, భక్తజనుల గోవిందనామస్మరణతో తిరుమాడ వీధులు భక్తిపారవశ్యంతో మార్మోగాయి.
భక్తబృందాలు భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తూ ఆధ్యాత్మిక సందడి నెలకొల్పాయి. జీయ్యంగార్ల ప్రబంధ పారాయణంతో వాహనసేవ మరింత వైభవంగా సాగింది.
విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పిస్తూ శ్రీ మలయప్ప స్వామివారిని దర్శించుకుని భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.


