వల్సాడ్: గుజరాత్‌లోని వల్సాడ్ జిల్లా వాపీ పారిశ్రామిక ప్రాంతంలో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. అక్కడ ఉన్న ఒక కంపెనీ ప్రాంగణంలో విషరహిత పాము ఒకటి అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గుర్తించి రెస్క్యూ చేశారు. ఆ సమయంలో ఆ పాము శరీరంలో ఎలాంటి కదలికలు లేకపోవడంతో పాటు దాని పరిస్థితి విషమంగా మారింది. సాధారణంగా పాము కనిపిస్తే భయంతో దూరంగా పరుగులు తీసే పరిస్థితుల్లో, అక్కడ కనిపించిన దృశ్యం అందరినీ ఆశ్చర్యపరిచింది.
అపస్మారక స్థితిలో ఉన్న పామును చూసిన జంతు ప్రేమికుడు సంజయ్ పవార్ వెంటనే స్పందించారు. మూగజీవి ప్రాణాన్ని కాపాడేందుకు ఆయన వెంటనే దానికి సీపీఆర్ (కార్డియోపల్మోనరీ రిససిటేషన్) ప్రక్రియను ప్రారంభించారు. తన నోటితో ఆ పాము నోట్లోకి గాలిని ఊదుతూ కొంత సమయం పాటు నిరంతరం శ్వాస అందించే ప్రయత్నం చేశారు. ఆయన ప్రయత్నం ఫలించి, కాసేపటికి పాము శరీరంలో మెల్లగా కదలికలు మొదలయ్యాయి.
సంజయ్ పవార్ అందించిన అత్యవసర సాయంతో పాము ప్రాణాపాయం నుంచి బయటపడటంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను అక్కడి వ్యక్తులు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా, అది కాస్తా వైరల్‌గా మారింది. కేవలం మనుషులకే కాకుండా, మూగజీవుల పట్ల కూడా కరుణ, ప్రేమను ప్రదర్శించవచ్చని నిరూపించిన సంజయ్ పవార్‌ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
ఇదీ చదవండి: Uttarakhand: నకిలీ పత్రాలతో ఎంబీబీఎస్ అడ్మిషన్లు?


