రాహుల్ సమక్షంలో మోదీ మిమిక్రీ.. రగిలిపోతున్న బీజేపీ! | Political Storm Over Modi Mimicry at Rahul Gandhi Youth Event | Sakshi
Sakshi News home page

రాహుల్ సమక్షంలో మోదీ మిమిక్రీ.. రగిలిపోతున్న బీజేపీ!

Sep 20 2026 12:43 PM | Updated on Sep 20 2026 1:12 PM

Political Storm Over Modi Mimicry at Rahul Gandhi Youth Event

భోపాల్‌ : పేపర్‌ లీకేజీలతో పాటు ఇతర సమస్యలతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు అండగా నిలిచేందుకు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఛాత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమం రాజకీయ దుమారానికి దారితీసింది.

మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్టాండప్ కమెడియన్ పుల్కిత్ మణి ప్రధాని నరేంద్ర మోదీని అనుకరిస్తూ మిమిక్రీ చేయడంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై కేంద్ర మంత్రులు సహా పలువురు బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీ తీరును తీవ్రంగా ఖండించారు.కిరణ్ రిజిజు ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ కమెడియన్లు, జోకర్ల పార్టీగా మారిపోయిందని, వారు శాశ్వతంగా రాజకీయాల నుంచి కనుమరుగయ్యారని ఆర్‌ఐపీ వ్యాఖ్యలు చేశారు.

రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ నైతిక దివాలాకోరుతనానికి అట్టడుగు స్థాయికి దిగజారాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ధ్వజమెత్తారు. విద్యార్థుల సంభాషణ వేదికను ఉపయోగించుకుని ప్రధానిని అపహాస్యం చేయడం వారిలో మానవతా దృక్పథం లోపించడాన్ని స్పష్టంగా చూపుతోందన్నారు.   బీజేపీ నాయకుడు సీఆర్ కేశవన్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఇలాంటి వ్యక్తులతో వేదికను పంచుకోవడమే కాక, ఆ వ్యాఖ్యలకు నవ్వుతూ మద్దతు తెలిపారని ఆరోపించారు. ఇది కాంగ్రెస్ పార్టీ చవకబారు సంస్కృతిని ప్రతిబింబిస్తోందని విమర్శించారు.  

ఈ వివాదానికి కారణం ఏమిటి?ఇండోర్‌లో విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని నిర్వహించిన 'ఛాత్రోన్ కీ గూంజ్' కార్యక్రమంలో స్టాండప్ కమెడియన్ పుల్కిత్ మణి రాహుల్ గాంధీతో కలిసి వేదికను పంచుకున్నారు. ఆ సమయంలో ఆయన చేసిన మిమిక్రీ ప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపింది.   ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ ప్రభుత్వంపై, ముఖ్యంగా పేపర్ లీక్‌లు, నిరుద్యోగం, విద్యా వ్యవస్థలోని లోపాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. విద్యార్థులు విద్యా వ్యవస్థపై కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి తీసుకురావడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని పేర్కొన్నారు. అయితే, ఇదే వేదికపై కమెడియన్ పుల్కిత్ మణి చేసిన ప్రదర్శన ప్రస్తుతం అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది.

ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారిన పుల్కిత్ మణి ఒక ప్రొఫెషనల్ స్టాండప్ కమెడియన్.ఆయన 2021 నుంచి ప్రొఫెషనల్‌గా స్టాండప్ కామెడీ ప్రదర్శనలు ఇస్తున్నారు.   లైవ్ షోలు, కామెడీ క్లిప్‌లు, ప్రముఖుల  మిమిక్రీ , పొలిటికల్ సెటైర్లతో సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయనకు లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రస్తుత కాలంలో యువతను ఆకట్టుకునేలా సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలపై కామెడీ స్కిట్‌లు చేయడం ఆయన శైలి. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement