బెంగాల్‌ బైపోల్స్‌లో బిగ్‌ ట్విస్ట్‌.. టీఎంసీ, స్వతంత్ర అభ్యర్థుల అరెస్ట్‌! | West Bengal Bypolls Heat Up As Rejinagar Independent Candidate Arrested In Old Election Clash Case | Sakshi
Sakshi News home page

బెంగాల్‌ బైపోల్స్‌లో బిగ్‌ ట్విస్ట్‌.. టీఎంసీ, స్వతంత్ర అభ్యర్థుల అరెస్ట్‌!

Sep 20 2026 11:38 AM | Updated on Sep 20 2026 12:48 PM

Rejinagar Independent candidate arrested in old election clash case

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో అక్టోబర్‌ 6న జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికల వేళ అరెస్టులు ఘటనలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. రెజీనగర్‌ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సైఫుల్‌ ఇస్లాంను తాజాగా పోలీసులు అరెస్ట్‌ చేశారు. 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన ఐదేళ్ల నాటి కేసులో సెప్టెంబర్‌ 19న ఈ అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, సైఫుల్‌ ఇస్లాం.. హుమాయూన్‌ కబీర్‌ నేతృత్వంలోని ఆమ్‌ జనతా ఉన్నయన్‌ పార్టీ (AJUP)తో సంబంధం కలిగి ఉన్నారు. బెర్హంపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నమోదైన కేసులో ఆయనను అరెస్ట్‌ చేసినట్లు ఓ పోలీసు అధికారి పీటీఐకి తెలిపారు.

ఒక్కరోజులో ఇద్దరు అభ్యర్థుల అరెస్ట్‌
అంతకుముందు.. నందిగ్రామ్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి మిలన్‌ ప్రధాన్‌ను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. భూసేకరణకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల సమయంలో నమోదైన దాదాపు రెండు దశాబ్దాల నాటి కేసులో సెప్టెంబర్‌ 18న ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఉప ఎన్నికలకు ముందు వరుసగా ఇద్దరు అభ్యర్థులు అరెస్ట్‌ కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

ముఖ్యమంత్రి సువేందు అధికారి నందిగ్రామ్‌తో పాటు భవానీపూర్‌ నుంచి కూడా గెలవడంతో నందిగ్రామ్‌ స్థానానికి రాజీనామా చేశారు. మరోవైపు, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో నవదా స్థానాన్ని నిలుపుకోవడంతో హుమాయూన్‌ కబీర్‌ గెలిచిన రెజీనగర్‌ స్థానం ఖాళీ అయింది. దీంతో ఈ రెండు స్థానాలకు అక్టోబర్‌ 6న ఉప ఎన్నికలు జరగనున్నాయి.

ఇదిలా ఉండగా, రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు సృష్టించేందుకు కుట్ర జరిగిందన్న ఆరోపణలపై నమోదైన కేసులో AJUP అధినేత హుమాయూన్‌ కబీర్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సోమవారం విచారణ అధికారుల ఎదుట హాజరుకావాలని ఆదేశించారు. సెప్టెంబర్‌ 14న ఈ కేసు నమోదు చేసినట్లు సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు. బెర్హంపూర్‌లో ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో పోలీసులు ఓ ఆడియో రికార్డింగ్‌ను వినిపించారు. రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టే కుట్రకు సంబంధించిన సూచనలు ఆ సంభాషణలో ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. కాగా, ఉప ఎన్నికలకు ముందు వరుస అరెస్టులు, పోలీసుల దర్యాప్తులతో బెంగాల్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

టీఎంసీకి భారీ షాక్‌.. 
ఇదిలా ఉండగా.. పశ్చిమ బెంగాల్‌లో ఉప ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. నందిగ్రామ్‌, రెజీనగర్‌ స్థానాల్లో అభ్యర్థుల విషయంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. నందిగ్రామ్‌లో టీఎంసీ అభ్యర్థి సంచితా ప్రధాన్‌ డే నామినేషన్‌ ఉపసంహరించుకుని, కాంగ్రెస్‌ అభ్యర్థి మిలన్‌ ప్రధాన్‌కు మద్దతు ప్రకటించినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. అయితే, ఆ తర్వాత మిలన్‌ ప్రధాన్‌ పాత కేసులో అరెస్టయ్యారు. రెజీనగర్‌లోనూ టీఎంసీ అభ్యర్థి రబియుల్‌ ఆలం చౌధురి నామినేషన్‌ ఉపసంహరణపై తొలుత ప్రకటన చేసినప్పటికీ, అనంతరం తన నిర్ణయాన్ని మార్చుకుని పోటీలో కొనసాగనున్నట్లు ప్రకటించినట్లు కథనాలు పేర్కొన్నాయి. 

ఇదీ చదవండి: గణపతి మండపం వద్ద కరెంట్‌ షాక్‌.. మహిళ, బాలిక మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement