న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అంతర్గత వివాదం కీలక మలుపు తిరిగింది. పార్టీ పేరు, ఎన్నికల గుర్తుపై ఎవరికీ హక్కు ఉందనే అంశంపై తుది నిర్ణయం తీసుకునే వరకు పార్టీ పేరు, ఎన్నికల గుర్తును ఉపయోగించకూడదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అక్టోబర్ 6న జరగనున్న నందిగ్రామ్, రెజీనగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈసీ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మమతా బెనర్జీ, అరూప్ రాయ్(రితబ్రత బెనర్జీ నేతృత్వంలో..) వర్గాలకు షాక్ తగిలినట్లైంది.
ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ పేరుతో పాటు ఆ పార్టీకి కేటాయించిన పూలు-గడ్డి గుర్తును కూడా రెండు వర్గాలు ఉపయోగించకూడదని ఈసీ పేర్కొంది. ఉప ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీపై హక్కు వివాదాన్ని ఇప్పటికిప్పుడు పరిష్కరించడం సాధ్యం కాదని, అందువల్ల రెండు వర్గాలను సమాన స్థాయిలో ఉంచేందుకు ఈ మధ్యంతర నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఈ మేరకు రెండు వర్గాలు శుక్రవారం ఉదయం 11 గంటల్లోగా తమకు కావాల్సిన మూడు పేర్లు, మూడు ఉచిత ఎన్నికల గుర్తులను సూచించాలని ఈసీ ఆదేశించింది. వాటిలో నుంచి ఒక్కో వర్గానికి ఒక పేరు, ఒక గుర్తును కేటాయించనుంది. అవసరమైతే తమ కొత్త పేర్లలో ‘ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్’తో అనుబంధాన్ని సూచించుకునే అవకాశం కూడా రెండు వర్గాలకు ఉంటుందని ఈసీ తెలిపింది.
టీఎంసీలో చీలికపై విచారణ
పార్టీ సంస్థాగత నియంత్రణపై మమతా బెనర్జీ వర్గం, అరూప్ రాయ్ నేతృత్వంలోని ప్రత్యర్థి వర్గం మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ రెండు వర్గాలూ తామే అసలైన తృణమూల్ కాంగ్రెస్ అని, పార్టీ పేరు, గుర్తు తమకే చెందాలని వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈసీ రెండు వర్గాలతో గురువారం మరోసారి విచారణ నిర్వహించింది. ఐదు రోజుల వ్యవధిలో ఇరు వర్గాలతో ఈసీ సమావేశం కావడం ఇది రెండోసారి.
ఈ వివాదంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఈసీ పేర్కొంది. ఎన్నికల గుర్తుల (రిజర్వేషన్ అండ్ అలాట్‌మెంట్) ఆర్డర్–1968లోని 15వ పేరా కింద పార్టీ అంతర్గత చీలికలు, గుర్తు–పేరు హక్కుల వివాదాలపై నిర్ణయం తీసుకునే అధికారం ఈసీకి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అంశంపై సమగ్ర నిర్ణయానికి మరింత విచారణ అవసరమని కమిషన్ అభిప్రాయపడింది.
అక్టోబర్ 6న రెండు నియోజకవర్గాల్లో పోలింగ్
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్, రెజీనగర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు అక్టోబర్ 6న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. ఈ రెండు వర్గాల అభ్యర్థులు ఇప్పటివరకు తృణమూల్ కాంగ్రెస్ అధికారిక గుర్తుతోనే బరిలోకి దిగారు. అయితే ఈసీ తాజా ఉత్తర్వులతో ఉప ఎన్నికల కోసం వారు కొత్త పేర్లు, కొత్త గుర్తులతో పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పార్టీ పేరు, గుర్తుపై తుది హక్కు ఎవరికి దక్కాలన్న దానిపై ఈసీ విచారణ కొనసాగనుంది. ప్రస్తుతం జారీ చేసిన ఉత్తర్వులు ఉప ఎన్నికల ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న మధ్యంతర చర్య మాత్రమే. వివాదంపై తుది నిర్ణయం తర్వాత పార్టీ పేరు, గుర్తుకు సంబంధించి తదుపరి పరిస్థితి స్పష్టమయ్యే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: విజయ్ సర్కార్‌కు తలంటిన సుప్రీం కోర్టు


