‘ఎల్లో నినో’ ఎఫెక్ట్.. బాబు పుణ్యమే
సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం వైఎస్ జగన్ నిప్పులు
బాబు నిర్వాకం వల్లే కరువు తీవ్రరూపం
ఎల్‌నినో ప్రభావంపై ఫిబ్రవరి 4నే వెల్లడి
అయినా పరిస్థితి ఎదుర్కోవడంలో కార్యాచరణ ‘సున్నా’
వర్షపాతం లోటు స్పష్టంగా కనిపిస్తున్నా స్విచ్‌లు
నొక్కి, లాకులు ఎత్తి, ఫొటోలకు ఫోజులిచ్చి డ్రామాలు
మీ మాటలు నమ్మి సాగులోకి దిగిన రైతులు నిండా మునిగారు
ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు నష్టం..
కష్టంలో ఆదుకునే ఉచిత పంటల బీమా రక్షణ లేకుండా పోయింది
కరువు మండలాలు ఎందుకు ప్రకటించలేదు?
కర్ణాటక చాలా ముందుగానే వాటిని ప్రకటించింది.. శ్రీశైలం నుంచి రాయలసీమకు సకాలంలో నీళ్లు ఇవ్వకపోవడంతో డెడ్ స్టోరేజీకి చేరువలో ప్రాజెక్టులు
పులిచింతల ఎగువ, దిగువన తెలంగాణ లిఫ్ట్‌లు కడుతున్నా నోరెత్తని బాబు
పోలవరం ఎత్తులోనూ రాజీతో రాష్ట్రానికి తీరని నష్టం.. పుష్కర, పురుషోత్తపట్నం లిఫ్టులు గతంలోనే ఉన్నవే
వాటిని ఆపరేట్ చేసి తానే నీళ్లు తెచ్చినట్టుగా బాబు ప్రచారం
రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులపై పార్టీ జిల్లాల అధ్యక్షులు, రీజినల్
కో–ఆర్డినేటర్లతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష
రాష్ట్రంలో ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపనుందని ఈ ఏడాది ఫిబ్రవరి 4న సీఎం చంద్రబాబే స్వయంగా చెప్పారు. ఆ విషయం చెప్పిన ఈ పెద్దమనిషి ఆ తర్వాత ఏం చేశాడు? అన్నది గమనిస్తే కనిపించేది పెద్ద సున్నా. ఈ మనిషి కార్యాచరణకు వచ్చేసరికి చేసింది ఏమీ లేదు. అంతా సున్నా.. సున్నా! అందుకనే ఇది ‘మ్యాన్ మేడ్ కరువు’!
– వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్నది ‘ఎల్‌నినో’ ఎఫెక్ట్ కాదు.. ‘ఎల్లో నినో ఎఫెక్ట్’ అని.. ఇది ప్రకృతి వల్ల వచ్చిన కరువు మాత్రమే కాదని, సీఎం చంద్రబాబు నిర్వాకం వల్లే మరింత తీవ్రత పెరిగిందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎల్‌నినో ప్రభావంపై ఫిబ్రవరి 4నే వెల్లడించిన సీఎం చంద్రబాబు.. వచ్చే పరిస్థితిని ఎదుర్కోవడంలో మాత్రం ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదంటూ ఆక్షేపించారు. వర్షపాతం లోటు స్పష్టంగా కనిపిస్తున్నా డ్రామాలు ఆడారని ధ్వజమెత్తారు. స్విచ్‌లు నొక్కడం, లాకులు ఎత్తడం, ఫొటోలకు పోజులివ్వడం మాత్రమే చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వం మాటలు నమ్మి సాగులోకి దిగిన రైతులు ఇప్పుడు తీవ్ర కరువు పరిస్థితుల్లో నిండా మునిగారని, ప్రతి ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పుణ్యాన రైతులకు అన్నీ కష్టాలేనని.. ఉచిత పంటల బీమా రక్షణ లేకుండా పోయిందని నిప్పులు చెరిగారు. శ్రీశైలం నుంచి రాయలసీమకు సకాలంలో నీళ్లు ఇవ్వలేదని.. విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వదిలేశారని.. పులిచింతల ఎగువ, దిగువన తెలంగాణ ఎడాపెడా లిఫ్ట్‌ల నిర్మాణం చేపట్టినా చంద్రబాబు నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్, జూలై, ఆగస్టులో వరుసగా మూడు నెలలు వర్షపాతం లోటు స్పష్టంగా కనిపిస్తున్నా ప్రభుత్వం స్పందించ లేదంటూ వైఎస్ జగన్ తప్పుబట్టారు. కరువు మండలాలు ఇంకా ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. కర్ణాటక చాలా ముందుగానే ఆ పని చేసిందని గుర్తు చేశారు. కరువు ముంచుకొస్తున్నా ప్రత్యామ్నాయ విత్తనాలు సిద్ధం చేయలేదని, పశుగ్రాసాన్ని జిల్లాలకు పంపలేదని, కనీసం ఉపాధి హామీ అదనపు పనిదినాలు కూడా కోరలేదంటూ దుయ్యబట్టారు. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువు, ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేని పరిస్థితిపై పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు, అన్ని జిల్లాల అధ్యక్షులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని అక్కడి పరిస్థితిని వివరించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే..
అన్ని జిల్లాలు... 628 మండలాల్లో ‘లోటు’
రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులు గమనిస్తే ఖరీఫ్ ప్రారంభం నుంచి ఇవాళ్టి (సెప్టెంబర్ 16) వరకు దాదాపు 51 శాతం పైచిలుకు లోటు వర్షపాతం కనిపిస్తోంది. 28 జిల్లాలకు గాను 28 జిల్లాలూ ఈరోజు వర్షపాతం లోటులోనే ఉన్నాయి. 688 మండలాలకు గాను దాదాపు 628 మండలాలు వర్షాభావ పరిస్థితుల్లో ఉంటే, తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు సుమారు 332 మండలాల్లో కనిపిస్తున్నాయి. అంటే దాని అర్థం 51 శాతం పైచిలుకు వర్షపాతం లోటు ఉన్న పరిస్థితి. అన్నమయ్య జిల్లా–75%, సత్యసాయి జిల్లా–66%, ప్రకాశం జిల్లా–65%, చిత్తూరు జిల్లా–58.5%, వైఎస్సార్ కడప జిల్లా–57%, తూర్పు గోదావరి జిల్లా –57%, మార్కాపురం జిల్లా –56%, నంద్యాల జిల్లా–56%, విశాఖపట్నం జిల్లా–54%, అనంతపురం జిల్లా–51%, కర్నూలు జిల్లాలో 50% పైచిలుకు. ఇంత తీవ్రమైన లోటు వర్షపాతం రాష్ట్రం అంతటా కనిపిస్తోంది.
ముందే తెలిసినా కార్యాచరణ సున్నా
అందుకే ఇది ‘మ్యాన్ మేడ్ కరువు..
ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందుగా తెలియనిది కాదు. రాష్ట్రంలో ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపనుందని, ఈ ఏడాది ఫిబ్రవరి 4వ తారీఖున సీఎం చంద్రబాబే స్వయంగా చెప్పారు. ఆ విషయం చెప్పిన ఈ పెద్దమనిషి ఆ తర్వాత ఏం చేశాడు? అన్నది గమనిస్తే కనిపించేది పెద్ద సున్నా. ఈ మనిషి కార్యాచరణకు వచ్చేసరికి చేసింది ఏమీ లేదు. అంతా సున్నా.. సున్నా. అందుకనే ఇది ‘మ్యాన్ మేడ్ కరువు’. ముఖ్యమంత్రి అనే వ్యక్తి స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడం వల్ల జరిగిన నష్టం ఎంత తీవ్రంగా ఉంటుంది అన్నదానికి ఇది ఒక ఉదాహరణ.
వీళ్ల మాటలు నమ్మి రైతులు నష్టపోతున్నారు
మామూలుగా వర్షాకాలం జూన్ నుంచి సెప్టెంబర్ 15, 16 దాకా ఉంటుంది. అయితే ఈసారి ఎల్‌నినో ప్రభావం ఉంటుందని సీఎం చంద్రబాబు ఫిబ్రవరి 4వ తేదీనే ప్రకటించారు. ఇక జూన్‌లో–25% వర్షపాతం స్పష్టంగా కనిపించినా ఈ పెద్దమనిషి జూలై 11న ఏం చేశారు? ఆయన, ఆయన మంత్రి ఏం చేశారు? స్విచ్ నొక్కుతారు.. పూజ చేస్తారు.. ఫొటోలకు పోజులిచ్చి గేట్లు ఎత్తుతారు. నీళ్లు ఇస్తున్నాం.. సాగు చేసుకోండి అని చెబుతారు. వీళ్ల మాటలు నమ్మిన రైతులు అడుగు ముందుకేశారు. దీంతో ప్రతి ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఈరోజు నష్టపోతున్నారు. చంద్రబాబు పుణ్యాన రాష్ట్రంలో సాగు కూడా తగ్గింది. మామూలుగా ఖరీఫ్‌లో దాదాపు 76 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో 56.4 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు జరిగింది. అంటే దాదాపు 20 లక్షల ఎకరాల్లో విత్తనం కూడా పడలేదు. అంత దుర్భర స్థితిలో వ్యవసాయం ఉంది. ప్రివెంటివ్ సోయింగ్ అని చెప్పి వీరికి ఉచిత పంటల బీమా కనుక అందుబాటులో ఉంటే ఎకరాకు కనీసం రూ.15 వేలు చేతికి వచ్చేవి.
అదే ఉచిత పంటల బీమా ఉండి ఉంటే...
పోనీ.. సాగు జరిగిన ఆ 56.4 లక్షల ఎకరాల పరిస్థితి ఏమిటి? అని చూస్తే అక్కడ కూడా పంటలన్నీ తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితి. సాగు చేసిన ప్రతి రైతు పంటను బట్టి ఎకరాకు రూ.15 వేలకు పైగా నష్టపోయిన పరిస్థితి. అదే ఉచిత పంటల బీమా కనుక ఉండి ఉంటే ఈ రైతులకు అందరికీ కూడా, ఎకరా సాగు చేయని ప్రతి రైతుకు ఎకరాకు కనీసం రూ.15 వేలు ప్రివెంటివ్ సోయింగ్ కింద ఇన్సూరెన్స్ వచ్చేది. అదే రకంగా సాగు చేసిన ప్రతి ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు బీమా పరిహారం (ఇన్సూరెన్స్ క్లెయిమ్) అందేది.
ఇది ‘ఎల్లో నినో ఎఫెక్ట్’..
చంద్రబాబు పుణ్యాన ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా కంది, పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, వరి మాత్రమే కాకుండా అన్ని చోట్ల పండ్ల తోటలు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకనే రాష్ట్రంలో ఎల్ నినో ఎఫెక్ట్ కాదు.. ఇది ఎల్లో నినో ఎఫెక్ట్. చంద్రబాబు పార్టీ ఎల్లో నినో ఎఫెక్ట్! ఈరోజు శ్రీశైలంలో నీళ్లు 862 అడుగులకు పడిపోయిన పరిస్థితి. ఆరోజు నేను మీడియాతో మాట్లాడినప్పుడు శ్రీశైలంలో దాదాపు 880 అడుగుల మేర 185 టీఎంసీల నీరు ఉంది. పోతిరెడ్డిపాడు నుంచి పూర్తి సామర్థ్యంతో 44 వేల క్యూసెక్కుల నీరు తీసుకోవడం శ్రీశైలంలో 880 అడుగుల నీరున్నప్పుడే సాధ్యం. అప్పుడు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు ఇవ్వగలిగితేనే తెలుగు గంగ, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్, ఆయకట్టులో ఉన్న రిజర్వాయర్లు కానీ నింపగలుగుతాం. అదే శ్రీశైలంలో నీరు 854 అడుగులకు చేరితే పోతిరెడ్డిపాడు ద్వారా కేవలం 6 వేల క్యూసెక్కుల నీరు తీసుకోవడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. అంతకన్నా తగ్గితే నీరు తీసుకోవాలనుకున్నా సాధ్యం కాదు. ఇప్పుడు శ్రీశైలంలో 862 అడుగుల నీరుంది. అటు చూస్తే రాయలసీమలోని అన్ని రిజర్వాయర్లు డెడ్ స్టోరేజీకి కొంచెం అటు ఇటుగా ఉన్న పరిస్థితుల్లోకి వచ్చేశాయి. అయినా వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టడం లేదు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఎడాపెడా విద్యుత్ ఉత్పత్తి కోసం నీరు వాడేస్తోంది.
తెలంగాణలో లిఫ్ట్‌ల నిర్మాణం..
కళ్లు మూసుకున్న కూటమి ప్రభుత్వం..
పులిచింతల సామర్థ్యం 45 టీఎంసీలు. అక్కడ ఎగువ, దిగువన రెండు చోట్ల తెలంగాణ ప్రభుత్వం లిఫ్ట్‌లు కడుతోంది. అలా దాదాపు 11 టీఎంసీల నీరు తీసుకునే ప్రయత్నం చేస్తోంది. దీనిపై గత ప్రెస్‌మీట్‌లో ఫోటోలు కూడా చూపించా. కళ్ల ముందే ఇంత దారుణం కనిపిస్తున్నా ఇక్కడ వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం కళ్లు మూసుకుంది. కనీసం నోరు కూడా మెదపడం లేదు.
పోలవరం ఎత్తు తగ్గింపు రాష్ట్రానికి తీరని నష్టం..
అంతకన్నా బాధాకరమైన విషయం ఏమిటంటే చంద్రబాబు పుణ్యమా అని పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో కడితే అందులో 194 టీఎంసీల నీరు నిల్వ చేయగలం. కానీ ఇప్పుడు దాన్ని 41.15 మీటర్లకు కుదించారు. దీనిపై చంద్రబాబు రాజీ పడ్డారు. పోలవరం ఎత్తు తగ్గించడానికి చంద్రబాబు ఆమోదం తెలపడం వల్ల అందులో నీటి నిల్వ సామర్థ్యం ఏకంగా 120 టీఎంసీలకు పడిపోయింది. అంటే దాదాపుగా 75 టీఎంసీల నీరు మనం కోల్పోతున్నాం. అంత నీరు నిల్వ చేసుకునే అవకాశం ఉన్నా దాన్ని వదిలేశారు. అలా కేంద్ర ప్రభుత్వం భరించాల్సిన రూ.60 వేల కోట్లలో దాదాపు రూ.30 వేల కోట్లు వదిలేసుకుంటున్నారు. గ్రావిటీ ద్వారా పోలవరం నుంచి నీళ్లు ఇవ్వగలిగిన పరిస్థితిని కూడా కావాలని వదిలేసుకుంటున్నారు.
కరువు మండలాలు ఎందుకు ప్రకటించలేదు?
జూన్‌లో–25%, జూలైలో–66%, ఆగస్టులో–55 శాతం వర్షపాతం లోటు అని తెలుసు. మరి వరుసగా ఇన్ని డెఫిసిట్లు కనిపిస్తున్నప్పుడు నువ్వు కరువు మండలాల కింద ఎందుకు డిక్లేర్ చేయలేకపోతున్నావు? నిజానికి కరువు మండలాల ప్రకటనకు సంబంధించిన మాన్యువల్ చాలా స్పష్టంగా ఉంది. అందులో ఒక పారాగ్రాఫ్ క్లియర్‌గా ఉంది. అదే కర్ణాటక ఆగస్టు 28వ తారీఖునే కరువు ప్రాంతాలు ప్రకటించింది. డ్రౌట్ మండలాల కింద డిక్లేర్ చేయడం వల్ల జరిగే ప్రధాన ప్రయోజనం ఏమిటో అందరికీ తెలిసిన విషయమే. మొట్టమొదటగా రుణాలన్నీ రీ షెడ్యూల్ అవుతాయి. క్రాప్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ వస్తాయి. మన దగ్గర చంద్రబాబు పుణ్యమా అని ఆ అవకాశం లేకుండా పోయింది. ఉచిత పంటల బీమా తీసేయడం వల్ల నష్టమే జరిగింది. ఇంకా ఎక్కడ ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో చంద్రబాబు కరువు మండలాలు ప్రకటించడం లేదు. ఈ విషయంలో పక్కన కర్ణాటక చూపించిన చొరవ ఆయన చూపించలేకపోతున్నారు. 56 లక్షల ఎకరాలకు లెక్క వేస్తే ఇన్‌పుట్ సబ్సిడీ కింద ఇచ్చే మొత్తం రూ.6 వేల కోట్లు అవుతుంది. ఆ మొత్తం ఇవ్వాల్సి వస్తుందనే భయమో లేక అది కూడా ఎందుకు ఇవ్వాలన్న ఆలోచనలో భాగంగా కరువు మండలాలు ప్రకటించడం లేదు.
పార్టీ రిజినల్ కో–ఆర్డినేటర్లు, అన్ని జిల్లాల అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ముందస్తు చర్యలు నిల్..
కరువు ముంచుకొస్తోందని ముందే తెలిసినా కంటింజెన్సీ ప్లాన్ లేదు. ప్రత్యామ్నాయ విత్తనాలు సరఫరా చేయలేదు. ఇప్పటికే ప్రత్యామ్నాయ విత్తనాలు, పశుగ్రాసం అన్ని జిల్లాలకు అంది ఉండాలి. వచ్చే ఏడాది మార్చి వరకు మరో 150 రోజులు అదనంగా ఉపాధి హామీ పనులు కల్పించేలా ప్రభుత్వం ఏమాత్రం డిమాండ్ చేయడం లేదు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి రొటీన్‌గా 100 రోజులు ఉపాధి హామీ పనులు వస్తాయి. కానీ, ఈ ఆరు నెలలు కూడా అవి వచ్చి ఉంటే చాలా మేలు జరిగేది.
⇒ పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు వైవీ సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆళ్ల అయోధ్య రావిురెడ్డి, గుడివాడ అమర్‌నాథ్‌తో పాటు పార్టీ అన్ని జిల్లాల అధ్యక్షులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి (వ్యవసాయ విభాగం) ఎంవీఎస్ నాగిరెడ్డి, పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు, పార్టీ రైతు విభాగం రాష్ట్ర అ«ధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబి), పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ వడ్డి రఘురాం తదితరులు హాజరయ్యారు.
ప్రభుత్వంపై ఒత్తిడికి కార్యాచరణ
రైతుల సమస్యలపై ఇంకా లోతైన అధ్యయనం చేస్తాం. పరిష్కారానికి తగిన కార్యాచరణ రూపొందిస్తాం. వారికి మరింత తోడుగా నిలుస్తాం. ఇవే కాకుండా స్థానిక డిమాండ్లను కూడా ప్రస్తావిస్తాం. ఆలోపు పార్టీ జిల్లా అధ్యక్షులంతా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ గట్టిగా గళం విప్పాలి. క్షేత్రస్థాయిలో పర్యటనలు పెంచాలి. రైతులకు తోడుగా ఉంటూ వారి సమస్యలు ఎలుగెత్తి చాటే కార్యక్రమం చేయాలి. అప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి, మెడలు వంచే కార్యక్రమం కచ్చితంగా జరుగుతుంది. సమస్యలపై అధికారులకు వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం కూడా చేయాలి. అందులో భాగంగా తొలుత మండలం, తర్వాత నియోజకవర్గం, ఆ తదుపరి జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించాలి. రైతుల సమస్యలపై ప్రజల్లోనూ అవగాహన పెంచే ప్రయత్నం చేయాలి. ఎక్కడైనా అవసరాన్ని బట్టి, పరిస్థితి తీవ్రతను బట్టి స్వయంగా నేను ఆ కార్యక్రమంలో పాల్గొంటా.
పుష్కర లిఫ్ట్, పురుషోత్త్తపట్నం లిఫ్ట్ రెండూ ఎప్పటి నుంచో ఉన్నాయి. వాటితో ఇటీవల చంద్రబాబు డ్రామా చేశారు. వాటి ద్వారా నీరు లిఫ్ట్ చేసి విశాఖ జిల్లాకు గోదావరి జలాలు తరలించామంటూ ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారు. అవేవో కొత్త లిఫ్ట్‌లు అయినట్లు బిల్డప్ ఇచ్చారు. పోలవరంలో 75 టీఎంసీల నీటి నిల్వ, కేంద్రం నుంచి వచ్చే రూ.30 వేల కోట్లు కూడా వదులుకుని ఈ డ్రామా ఆడడం దారుణం. ఈరోజు విశాఖపట్నానికి తాగునీరు లేని పరిస్థితి తీసుకొచ్చిన ఘనత ఎవరిదంటే చంద్రబాబుదే!
- వైఎస్ జగన్
పోలవరం 45.72 మీటర్ల ఎత్తుతో కడితే అందులో 194 టీఎంసీల నీరు నిల్వ చేయగలం. కానీ ఇప్పుడు దాన్ని 41.15 మీటర్లకు కుదించారు. దీనిపై చంద్రబాబు రాజీ పడ్డారు. పోలవరం ఎత్తు తగ్గించడానికి చంద్రబాబు ఆమోదం తెలపడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం ఏకంగా 120 టీఎంసీలకు పడిపోయింది. అంటే దాదాపుగా 75 టీఎంసీల నీరు మనం కోల్పోతున్నాం.
మామూలుగా ఖరీఫ్‌లో దాదాపు 76 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో 56.4 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు జరిగింది. అంటే దాదాపు 20 లక్షల ఎకరాల్లో విత్తనం కూడా పడలేదు. అంత దుర్భర స్థితిలో వ్యవసాయం ఉంది.
చంద్రబాబు పుణ్యాన ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా కంది, పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, వరి మాత్రమే కాకుండా అన్ని చోట్ల పండ్ల తోటలు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకనే రాష్ట్రంలో ఎల్‌నినో ఎఫెక్ట్ కాదు.. ఇది ఎల్లో నినో ఎఫెక్ట్. చంద్రబాబు పార్టీ ఎల్లో నినో ఎఫెక్ట్!
కరువు ముంచుకొస్తోందని ముందే తెలిసినా కంటింజెన్సీ ప్లాన్, ప్రత్యామ్నాయ విత్తనాలు సరఫరా గురించి పట్టించుకోలేదు.జూన్‌లో 25%, జూలైలో 66%, ఆగస్టులో 55 శాతం వర్షపాతం లోటు అని తెలుసు. మరి వరుసగా ఇన్ని డెఫిసిట్లు కనిపిస్తున్నప్పుడు నువ్వు కరువు మండలాల కింద ఎందుకు డిక్లేర్ చేయలేకపోతున్నావు? అదే కర్ణాటక ఆగస్టు 28వ తారీఖునే కరవు ప్రాంతాలు ప్రకటించింది.
రైతులకు మేలు చేసే ప్రణాళికే లేదు..
⇒ ఈ ప్రభుత్వానికి ఎక్కడా ప్రణాళిక లేదు. రైతుకు మేలు చేయాలన్న ఆలోచన లేదు.
⇒ అన్నదాతా సుఖీభవ కింద మూడేళ్లలో రూ.60 వేలు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చింది కేవలం రూ.19 వేలు మాత్రమే. అంటే ఒక్కో రైతుకు రూ.41 వేలు బాకీ. కనీసం ఈ టైమ్‌లో అయినా ఆ మొత్తం రైతులకు ఇవ్వగలిగితే వారికి మేలు జరుగుతుంది. రైతులకు భరోసా ఇవ్వడానికి నీకు మనసు రావడం లేదు.
⇒ ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలన్న ఆలోచన లేదు. మోంథా తుపాన్‌కు సంబంధించి ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదు.
⇒ సున్నా వడ్డీ పూర్తిగా రద్దు చేశారు. మన ప్రభుత్వ హయాంలో దాదాపు రూ.2,050 కోట్లు సున్నా వడ్డీ కింద ఇస్తే ఇవాళ ఆ పథకం కనపడకుండా పోయిన పరిస్థితి.
⇒ మరోవైపు ఇన్సూరెన్స్ పరిస్థితి ఎలా ఉందో గమనిస్తే.. 2022–23లో ఖరీఫ్ సీజన్‌లో ఉచిత పంటల బీమా ఆంధ్రప్రదేశ్‌లో 1.18 కోట్ల దరఖాస్తులకు వర్తిస్తే ఈ ఏడాది 2026–27 ఖరీఫ్‌లో దరఖాస్తుల సంఖ్య కేవలం 40 లక్షలకు పరిమితమైందని స్వయంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రకటించింది.
⇒ అదే ఇప్పుడు ఉచిత పంటల బీమా ఉండి ఉంటే ప్రతి రైతుకు ఈ–క్రాప్ ద్వారా ఆటోమేటిక్‌గా ప్రతి ఎకరా ఉచిత పంటల బీమా పరిధిలోకి వచ్చేది. కానీ ఈ పెద్దమనిషి చేసిన నిర్వాకం ఏమిటి? ఆయన అధికారంలోకి వసూ్తనే 2024 జూన్‌లో కనుక 2023 ఖరీఫ్‌కు సంబంధించి ఇన్సూరెన్స్ ప్రీమియమ్‌గా రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన రూ.1,400 కోట్లు చెల్లించి ఉంటే రైతులకు దాదాపు రూ.3 వేల కోట్ల మేలు జరిగి ఉండేది. కానీ అది కట్టలేదు. అలా కట్టి ఉంటే, కేంద్ర ప్రభుత్వ వాటా కూడా వచ్చేది. దాని వల్ల పంటలన్నీ బీమా పరిధిలోకి వచ్చి రైతులకు మేలు జరిగేది.
అన్నదాతకు తోడుగా నిలిచేందుకే...
తీవ్ర కరువు పరిస్థితుల్లో చాలా నష్టపోయిన రైతులకు తోడుగా నిలబడే కార్యక్రమం చేస్తూ డిమాండ్లపై లోతుగా చర్చించేందుకే ఈ సమీక్ష చేస్తున్నాం. ఆ మేరకు పార్టీ తరఫున ఈ డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచబోతున్నాం. ఇవీ ఆ డిమాండ్లు..
⇒ ప్రభుత్వం వెంటనే కరువు మండలాలు ప్రకటించాలి.
⇒ రైతులకు ఉచిత పంటల బీమాను వెంటనే పునరుద్ధరించాలి. ఇప్పటికే కొందరు రైతుల నుంచి వసూలు చేసిన ప్రీమియంను తిరిగి ఇవ్వాలి.
⇒ రైతులకు గతంలో ఎగ్గొట్టిన రూ.3 వేల కోట్ల పంటల బీమా పరిహారాన్ని కూడా వెంటనే ఇవ్వాలి.
⇒ గతంలో ఉచిత పంటల బీమా ఉండేది. దాని వల్ల ప్రతి రైతుకు సాగు చేయకపోయినా కూడా ప్రివెంటివ్ సోయింగ్ కింద ప్రతి ఎకరాకు రూ.15 వేల పరిహారం అందేది. చంద్రబాబు ఉచిత పంటల బీమా తీసేసినందువల్ల నష్టపోతున్న రైతులకు ప్రభుత్వం రూ.15 వేల చొప్పున ఇవ్వాలి.
⇒ పంటలు వేసి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున ఇవ్వాలి.
⇒ అన్నదాతా సుఖీభవ కింద మిగిలిన రూ.41 వేలు ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి.
⇒ అన్నదాతా సుఖీభవ పథకాన్ని కౌలు రైతులు, ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు పొందిన రైతులకు కూడా వర్తింపచేయాలి. వారికి మూడేళ్లకు కలిపి ఒక్కో రైతుకు రూ.60 వేల చొప్పున ఇవ్వాలి.
⇒ మోంథా తుపాన్ వల్ల నష్టపోయిన రైతులకు వెంటనే రూ.846 కోట్లు విడుదల చేయాలి.
⇒ కరువు వల్ల నష్టపోయిన రైతులు సాగు చేసిన 56 లక్షల ఎకరాలకు మొత్తం లెక్క వేస్తే దాదాపు రూ.6 వేల కోట్లు అవుతుంది. కాబట్టి వెంటనే ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.6 వేల కోట్లు చెల్లించాలి.
⇒ ఇతర పద్ధతులు, వేరే నెంబర్లు ఏమైనా ఉంటే వాటిని చూపించాలి. ఆ మేరకు మా ప్రభుత్వ హయాంలో మాదిరిగా సీజన్ ముగిసేలోగా పరిహారం ఇవ్వాలి.
⇒ మన ప్రభుత్వ హయాంలో మాదిరిగానే ఈ మూడేళ్లకు సంబంధించి రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని వర్తింపచేయాలి.
⇒ కరువు తీవ్రత దృష్ట్యా రైతన్నలు పశుగ్రాసం కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో ఉన్నందున ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించి ఉచితంగా అందచేయాలి. అది ఇప్పటికే ఆలస్యమైంది.
⇒ కరువు వల్ల వ్యవసాయ పనులు లేక కూలీల వలసలు ఇప్పటికే స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఈ అక్టోబరు నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ఆరు నెలల పీరియడ్‌లో మరో 150 రోజులు ఉపాధి హామీ పనులు క్రియేట్ చేసి తోడుగా నిలవాలి.
⇒ విద్యాదీవెన, వసతి దీవెన పథకాల్లో ఎక్కువ మంది లబ్ధిదారులైన పిల్లలు రైతుల బిడ్డలే. ఆ రెండు కలిపి మొత్తం బకాయిలు దాదాపు రూ.9 వేల కోట్లు. డబ్బులు కట్టలేక పిల్లల చదువులు మానేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఆ బకాయిలు విడుదల చేసి ఆ రైతులకు, వారి పిల్లలకు తోడుగా నిలబడాలి.
⇒ తాగునీటి ఎద్దడి లేకుండా ఉచిత ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే కార్యక్రమం వెంటనే స్టార్ట్ చేయాలి.
⇒ ఇబ్బందులు ఉన్న చోట వైఎస్సార్‌సీపీ తరఫున మనం చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎటువంటి తోడు, సహాయం అందలేదు. అది వెంటనే యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి.
⇒ ఎక్కడ చూసినా కరెంట్ కోతలే. సాయంత్రం 5 నుంచి రాత్రి 11 దాకా గ్రామాలలో తీవ్రమైన కరెంట్ కోతలు. రైతులకు
9 గంటలు ఉచిత విద్యుత్ కాదు కదా 6 గంటలు, 5 గంటలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. బోర్ల కింద ఉన్న పంటలు పూర్తిగా ఎండిపోతున్నందున కచ్చితంగా ఎటువంటి కోతలు లేకుండా కరెంట్ సప్లై చేయాలి.
⇒ ప్రతికూల పరిస్థితుల్లో దురదృష్టవశాత్తూ ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ప్రభుత్వ సాయం అందాలి. మన ప్రభుత్వంలో రూ.7 లక్షల చొప్పున సాయం చేశాం. ఇప్పుడు కూడా బాధిత కుటుంబాలకు అలాగే ఇచ్చే కార్యక్రమం కచ్చితంగా జరగాలి.
⇒ ఎండిపోతున్న పండ్ల తోటలను కాపాడేందుకు 80% సబ్సిడీతో నీటి ట్యాంకర్ల ద్వారా సప్లై చేయాలి.


