నాలుక తడారి.. విశాఖ విలవిల | Water Crisis in Visakhapatnam | Sakshi
Sakshi News home page

నాలుక తడారి.. విశాఖ విలవిల

Sep 18 2026 5:25 AM | Updated on Sep 18 2026 5:27 AM

Water Crisis in Visakhapatnam

తాగు నీటి కోసం బిందెలతో నిరసన తెలుపుతున్న ఆరిలోవ కాలనీ వాసులు

పాతాళానికి భూగర్భ జలాలు 

400 అడుగులు తవ్వినా దొరకని నీటిజాడ.. ఎండిన జలాశయాలు.. రోజుల తరబడి కుళాయిల బంద్‌  

సమస్యను గాలికొదిలేసిన జీవీఎంసీ.. మొద్దునిద్రలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం  

బిందెడు నీటికోసం పోరాటం.. తెల్లవారుజాము నుంచే కుళాయిల వద్ద కిలోమీటర్ల మేర క్యూలు.. గంటల తరబడి నిలబడినా చుక్కనీరు దక్కని దైన్యం.. కుళాయిల వంక ఆశగా చూస్తున్న ప్రజలు.. స్మార్ట్‌సిటీ విశాఖలో ఎటుచూసినా ఇవే దృశ్యాలు. ఏరోజుకారోజు ఈ రోజైనా నీరొస్తుందేమోనని ఆశ.. అంతలోనే నిరాశ.. రెండు, మూడురోజులకు వచ్చే అరకొరనీరు అవసరాలకు సరిపోక ఆవేదన.. ఇది విశాఖ నగర ప్రజల దుస్థితి.

నగరంలోని ఇళ్లల్లో బోర్లు ఒట్టిపోయాయి. వీధి బోర్లు మూగబోయాయి. చివరికి జేబులు ఖాళీ చేసుకుని వాటర్‌ కేన్లు, ప్రైవేట్‌ ట్యాంకర్ల నీటిని కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఒకవైపు వర్షాభావంతో జలాశయాలు అడుగంటుతుండగా.. మరోవైపు కాంక్రీట్‌ అరణ్యంగా మారిన నగరంలో భూగర్భజలాలు పాతాళానికి పడిపోవడంతో నీటికష్టాలు మరింత ముదిరాయి. పరిస్థితిని ముందే పసిగట్టి ప్రత్యామ్నాయ వనరులు సిద్ధం చేయాల్సిన గ్రేటర్‌ విశాఖ నగరపాలకసంస్థ (జీవీఎంసీ) చేతులెత్తేసింది.

సమస్యను పరిష్కరించాలంటూ మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళనలకు దిగుతున్నా పాలకులు చోద్యం చూస్తున్నారు తప్ప స్పందిస్తున్న దాఖలాల్లేవు. నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం ‘సాక్షి’ నిర్వహించిన ఫీల్డ్‌ విజిట్‌లో.. బిందెడు నీటికోసం జనం పడుతున్న ఈ కన్నీటి పోరాటం కళ్లకు కట్టినట్లు కనిపించింది.

విశాఖలో నీటి కొరత ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. జీవీఎంసీ పరిధిలో సుమారు 25 లక్షల జనాభా తాగునీటి అవసరాలకు రోజుకు 90 మిలియన్‌ గ్యాలన్లు (ఎంజీడీ), పరిశ్రమలకు 45 ఎంజీడీ.. మొత్తం 135 ఎంజీడీ కావాల్సి ఉంది. ఇందులో ఏలేరు రిజర్వాయర్‌ నుంచి కాలువ ద్వారా 48.1 ఎంజీడీ నీరు నగరానికి వస్తోంది. మిగిలిన నీటిని తాటిపూడి, రైవాడ, మేఘాద్రిగెడ్డ, ముడసర్లోవ తదితర రిజర్వాయర్లతోపాటు గోస్తనీ నదిలోని ఊటబావుల నుంచి సమకూరుస్తున్నారు.

ఈ ఏడాది జిల్లాలో 50 శాతానికిపైగా లోటు వర్షపాతం నమోదవడంతో జలాశయాల్లో నీటిమట్టాలు తగ్గాయి. భూగర్భజలాలు కూడా అడుగంటడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో బోర్లు ఒట్టిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో 400 అడుగుల లోతు బోరు తవ్వినా నీటి జాడ కనిపించడంలేదు. ఫలితంగా ఏలేరు నీటిపైనే నగర సరఫరా ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏలేరు నుంచి కణితి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు వచ్చే నీటిలో పరిశ్రమలకు కేటాయించే నీటిని తగ్గించి తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని అధికారులు చెబుతున్నా.. నగరంలోని పలు ప్రాంతాలకు సక్రమంగా నీరు అందకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

నీటి కొరతను ఆసరాగా చేసుకుని ప్రైవేట్‌ ట్యాంకర్ల నిర్వాహకులు ప్రజల నుంచి భారీగా సొమ్ము వసూలు చేస్తున్నారు. ఆరువేల లీటర్ల ట్యాంకర్‌కు రెండు, మూడు కిలోమీటర్ల పరిధిలో జీవీఎంసీకి సుమారు రూ.300 చెల్లిస్తున్న ప్రైవేట్‌ నిర్వాహకులు.. అదే నీటిని ప్రజల నుంచి రూ.3 వేల వరకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఉదయం నుంచే టోకెన్ల కోసం వేచి ఉండే సామాన్యులకు సరఫరా కంటే ప్రైవేట్‌ ట్యాంకర్లకు ప్రాధాన్యం లభిస్తోందనే విమర్శలు వ్యక్తమవు­తున్నాయి.

మూడు నెలలుగా నీటి సమస్య కొనసాగుతున్నా జీవీఎంసీ యంత్రాంగం స్పందించలేదు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం పట్టించుకోనేలేదు. పలుప్రాంతాల్లో నీటి సమస్యను వైఎస్సార్‌సీపీ నేతలు ప్రత్యక్షంగా పరిశీలించి జీవీఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు స్పందించలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. 

ఎటుచూసినా నీటికోసం వేదనే.. 
ఆరిలోవ ప్రాంతంలో జీవీఎంసీ 9, 10, 11, 12, 13 వార్డుల్లో మూడురోజులకు ఒకసారి వచ్చే కుళాయి కోసం ఇళ్ల ముందు ఖాళీ బిందెలు పెట్టి ఎదురు­చూడాల్సి వస్తోంది. కిరాణా దుకాణాల్లో వాటర్‌ కేన్లు కొనుక్కోవాల్సి వస్తోంది. మధురవాడ, పీఎం పాలెం పరిధిలో మూడు నెలలుగా నీటిసమస్య కొనసాగుతోంది. గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్ల వాసులు ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. అక్కయ్యపాలెంలోని పలు వార్డుల్లో నీటికొరత తీవ్రంగా ఉంది. ఉదయం 5 నుంచి 5.45 గంటల వరకు వచ్చే నీటిలో మొదట ఐదారు బిందెల మేర బురద కలిసిన నీరు వస్తోంది. ఆ తర్వాత కూడా ధార బలంగా లేక ఒక్కో కుటుంబానికి మూడు, నాలుగు బిందెలకు మించి నీరందటంలేదు. దక్షిణ నియోజకవర్గంలోని మురికివాడల్లో తాగునీటి కష్టాలు తారస్థాయికి చేరాయి. నీటికోసం ఇక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం.

సరిపోవడం లేదు
ప్రస్తుతం రోజు విడిచి రోజు అరగంట మాత్రమే నీరు వస్తోంది. అదీ అరకొరగానే వస్తుండటంతో అవసరాలు తీరడం లేదు. బోర్లలోను నీరు సరిగా రాక ఇబ్బందులు పడుతున్నాం. – చందక గీత, భీమిలి 

మూడు, నాలుగు బిందెలే..
చిన్నూరులో మూడు కుళాయిలే ఉన్నాయి. ఉ. 5 నుంచి 5.45 గంటల వరకు మాత్రమే నీరు వస్తోంది. మొదట కొద్ది సేపు వచ్చేది బురద నీరే. ఇంటికి మూడు, నాలుగు బిందెల నీరే దొరుకుతోంది. – ఊడికల రామయ్యమ్మ, చిన్నూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement