లిస్టు రాకముందే అటెస్టేషన్లు ! | Irregularities in AP Mega DSC | Sakshi
Sakshi News home page

లిస్టు రాకముందే అటెస్టేషన్లు !

Sep 18 2026 4:51 AM | Updated on Sep 18 2026 4:51 AM

Irregularities in AP Mega DSC

దగా డీఎస్సీలో అంతులేని అక్రమాలు

కూన నేతృత్వంలో సాఫ్ట్‌బాల్‌ కోటాలో వింతలు 

మెరిట్‌ లిస్టు రాకముందే అటెస్టేషన్లు.. సెల్ఫ్‌ డిక్లరేషన్లూ.. 

ఆగస్టు 22న జనరల్‌ మెరిట్‌ లిస్ట్‌.. అంతకుముందే ఆగస్టు 1, 2న గంపగుత్తగా అటెస్టేషన్లు, సెల్ఫ్‌ డిక్లరేషన్లు 

ఎవరెవరు ఎంపికవుతారో ముందే సమాచారం వెళ్లిందా? 

కూన రవికుమార్‌ తీరుపైనా సందేహాలు.. మే 16న ఫారం–2పై సంతకాలు 

జూన్‌ 22న రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక.. మే 16న అధ్యక్షుడి హోదాలో సంతకాలు ఎలా? 

సాఫ్ట్‌బాల్‌ కోటాపై సమగ్ర విచారణకు డిమాండ్లు

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : మెగా డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా నియామకాల్లో టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అధ్యక్షుడిగా ఉన్న సాఫ్ట్‌బాల్‌ క్రీడాకారులకు సంబంధించిన పత్రాల తేదీలు కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. దరఖాస్తుల గడువు, ప్రాథమిక జాబితా, మెరిట్‌ జాబితా విడుదల తేదీలకు.. కొందరు అభ్యర్థుల గెజిటెడ్‌ అటెస్టేషన్, సెల్ఫ్‌ డిక్లరేషన్‌ తేదీలకు మధ్య ఉన్న వ్యత్యాసాలు అనుమానాలకు తావిస్తున్నాయి. సాఫ్ట్‌బాల్‌ కోటాలో ఎంపికైన పలువురు అభ్యర్థుల పత్రాలపై 2025 ఆగస్టు 1, 2 తేదీల్లోనే అటెస్టేషన్లు, సెల్ఫ్‌ డిక్లరేషన్లు జరిగినట్లు చూపుతున్న పత్రాలు సందేహాస్పదంగా మారాయి. సాఫ్ట్‌బాల్‌ క్రీడాకారుల సర్టీఫికేషన్ల గెజిటెడ్‌ అటెస్టేషన్‌ రాష్ట్ర వ్యాప్తంగా 2025 ఆగస్టు 1వ తేదీన గంపగుత్తగా జరిగింది. 

అయితే, సర్టీఫికేట్ల వెరిఫికేషన్‌కు పిలిచిన ఆగస్టు 22 తేదీ తర్వాత రోజుల్లో అటెస్టేషన్‌ చేయాలి. అలా కాకుండా ఆగస్టు 1వ తేదీనే చేయడం వెనుక ఏదో జిమ్మిక్కు జరిగింది. ఆ ఒక్క అటెస్టేషనే కాదు రిక్రూట్‌మెంట్‌ అండర్‌ స్పోర్ట్స్‌ కోటా సెల్ఫ్‌ డిక్లరేషన్‌ కూడా ఆగస్టు 1, 2వ తేదీల్లోనే అత్యధికంగా ఇవ్వడం వెనక ఏదో మర్మముంది.  

ప్రాథమిక జాబితా విడుదల కాకముందే అటెస్టేషన్‌ 
మెగా డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా నోటిఫికేషన్‌ 2025 మే 1న జారీ అయింది. స్పోర్ట్స్‌ కోటాలో నియామకాలకు దరఖాస్తులను మే 2 నుంచి 31 వరకు స్వీకరించారు. నోటిఫికేషన్‌ ప్రకారం స్పోర్ట్స్‌ సాధనకు సంబంధించిన సర్టిఫికెట్లు, ఫార్మ్‌–1, 2, 3, 5 తదితర పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయడం తప్పనిసరి. అయితే సాఫ్ట్‌బాల్‌ కోటాలో ఎంపికైన కొందరి పత్రాలను పరిశీలిస్తే.. గెజిటెడ్‌ అటెస్టేషన్‌ తేదీ 2025 ఆగస్టు 1గా కనిపిస్తోంది. 

మరోవైపు స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థుల ప్రాథమిక జాబితా ఆగస్టు 8న విడుదలైంది. ఆ జాబితాపై అభ్యంతరాలకు ఆగస్టు 13 వరకు అవకాశం ఇచ్చారు. అనంతరం మెరిట్‌ ప్రక్రియ ముందుకు సాగింది.  మెరిట్‌ లిస్టు ఆధారంగా సర్టీఫికేషన్‌ వెరిఫికేషన్‌కు పిలిచిన తేదీ (ఆగస్టు 22) తర్వాతే అటెస్టేషన్‌ చేయాలి. కానీ ప్రాథమిక జాబితా కూడా వెలువడక ముందే ఆగస్టు 1న అటెస్టేషన్‌ ఎలా జరిగింది? అన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. 

ఎంపిక వివరాలు ముందే తెలిశాయా? 
ఇదే సమయంలో సాఫ్ట్‌బాల్‌ కోటాలో ఎంపికైన పలువురి ‘రిక్రూట్‌మెంట్‌ అండర్‌ స్పోర్ట్స్‌ కోటా’ సెల్ఫ్‌ డిక్లరేషన్లు కూడా ఆగస్టు 1, 2 తేదీల్లోనే ఇచ్చినట్లు పేర్కొన్న పత్రాలు ఉన్నాయి. ఒకవైపు దరఖాస్తుల గడువు మే 31తో ముగియడం.. మరోవైపు ప్రాథమిక జాబితా ఆగస్టు 8న రావడం.. ఆ తర్వాతే అభ్యంతరాల స్వీకరణ జరగడం.. ఇంతకు ముందే ఎంపికకు సంబంధించిన సెల్ఫ్‌ డిక్లరేషన్లు, అటెస్టేషన్లు జరగడం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. ఎవరెవరు ఎంపికవుతారనే సమాచారం ముందుగానే వెళ్లిందా? లేక ఎంపిక ప్రక్రియకు ముందే అభ్యర్థుల వివరాలు ఖరారయ్యాయా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

జూన్‌లో అధ్యక్షుడైతే.. మేలోనే సంతకాలా..? 
సాఫ్ట్‌బాల్‌ సర్టిఫికెట్లకు సంబంధించిన ఫారం–2 విషయంలోనూ తేదీలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కూన రవికుమార్‌ 2025 జూన్‌ 22న రాష్ట్ర సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే ఆయన అధ్యక్షుడి హోదాతో కూడిన స్టాంప్‌తో మే 16, 2025న గంపగుత్తగా ఫారం–2 పత్రాలపై సంతకాలు చేశారు. మే 16న ఆయన ఆ హోదాలో ఎలా సంతకం చేశారు?. తాను అప్పట్లో సాఫ్ట్‌బాల్‌ నేషనల్‌ ఫెడరేషన్‌ ఏర్పాటు చేసిన అడ్‌హాక్‌ కమిటీలో సభ్యుడిగా ఉండి సర్టిఫికెట్లను ధ్రువీకరించే అధికారం పొందినట్లు కూన రవికుమార్‌ చెబుతున్నారు. 

అదే జరిగి ఉంటే.. ఫారం–2పై అడ్‌హాక్‌ కమిటీ సభ్యుడిగా ఉన్న హోదాను చూపాలిగా? రాష్ట్ర అసోసియేషన్‌ అధ్యక్షుడి హోదా, స్టాంప్‌ ఎందుకు ఉపయోగించారన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ఇక, కూన రవికుమార్‌  కేవలం ఐదుగురికి చెందిన సర్టీఫికెట్లు మాత్రమే వెరిఫై చేసి, ఫారం 2 ఇచి్చనట్టు ఇటీవల ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. కానీ, ఆయన వాస్తవంగా 24మంది క్రీడాకారులకు సంబంధించి ఫారం 2 ఇచ్చారు. దానికి సంబంధించిన ఫారం 2పత్రాలు ‘సాక్షి’ వద్ద ఉన్నాయి. దీనిని బట్టి అర్థం కావడం లేదూ.. కూన కన్నంలో చిక్కారని...

మెగా డీఎస్సీలో ముఖ్యమైన తేదీలు 
మెగా డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా నోటిఫికేషన్‌ జారీ చేసిన తేదీ : 2025 మే 1  
అప్లికేషన్, సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేయాల్సిన గడువు : 2025 మే 2 నుంచి మే 31 
దరఖాస్తు చేసుకున్న అర్హులైన అభ్యర్థులతో కూడిన ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ వెరిఫైడ్‌ లిస్ట్‌ విడుదల: 2025 ఆగస్టు 8 
అభ్యంతరాల స్వీకరణ : 2025 ఆగస్టు 8 నుంచి 13 వరకు  
జనరల్‌ మెరిట్‌ లిస్టు విడుదల : 2025 ఆగస్టు 22  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement