కాశీబుగ్గ :
ఉత్తరాంధ్ర కిడ్నీ వ్యాధి బాధితుల ఆశాదీపం.. పలాస కిడ్నీ ఆస్పత్రి నిండా సదుపాయాలు ఉన్నా.. వాటిని వినియోగించక నానాటికీ కునారిల్లుతోంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, మేటి వసతులతో జాతీయస్థాయి ఎయిమ్స్ తరహాలో నాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఆస్పత్రిని తీర్చి దిద్దారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు చొరవ తీసుకుని అన్ని సదుపాయాలు కల్పించారు. గతంలో పాలించిన వారికి ఎవ్వరికీ సాధ్యం కాని రీతిలో ఈ ఆస్పత్రిని ఈ ప్రాంతంలో నిర్మించారు. అలాంటి అరుదైన వనరును వినియోగించుకోవాల్సింది పోయి.. కనీస సదుపాయాలను కూడా క ల్పించలేకపోతున్నారు. ఆస్పత్రిలో నేటికీ పూర్తిస్థాయిలో భర్తీ కాని వైద్యులు, సిబ్బంది ఖాళీలే అందుకు నిదర్శనం.
166 మందికి.. 30 మందితోనే
జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, నెఫ్రాలజీ, యూ రాలజీతోపాటు స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య పోస్టులు 46, సిబ్బంది 60, ఇతర సహాయ సిబ్బంది 60 చొప్పున ఆస్పత్రికి మంజూరు చేశారు. కానీ ఇప్పటివరకూ పూర్తి స్థాయిలో సిబ్బంది నియామకం జరగలేదు. వైద్యులు 20 మంది మాత్రమే ఉన్నారు. సాంకేతిక సహాయ సిబ్బంది విషయానికి వస్తే 18 మందికి 10 మందితో సేవలు సాగిస్తున్నారు. ఈ పదిమందిలో కొందరు కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్నారు.
సకల సదుపాయాలున్నా..
ఉద్దానం ప్రాంత కిడ్నీ బాధితులకు మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు పలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, కిడ్నీ పరిశోధన కేంద్రాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటుచేసింది. క్యాజువాలిటీ, నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, సర్జరీ, డయాలసిస్, నెఫ్రాలజీ వార్డులు, ఓటీ కాంప్లెక్స్, పోస్ట్ ఆపరేటివ్, రేడియో డయాగ్నోసిస్, ఆస్పత్రి స్టోర్స్, సెంట్రల్ ల్యాబ్‌లు, ఐసీయూ, యూరాలజీ వార్డులు, పరిశోధన ల్యాబులతో ఆస్పత్రిని ప్రారంభించారు. 2 డీ ఎకో, సీటీ స్కాన్, డిజిటల్ ఎక్స్‌రే, హైఎండ్ కలర్ డాఫ్లర్, ఏబీజీ అనలైజర్ పరికరాలతో పాటు పూర్తి రిమోట్ నియంత్రిత ఐసీయూ సౌకర్యాలను కిడ్నీ పరిశోధన కేంద్రంలో అందుబాటులోకి తీసుకువచ్చారు. కానీ వీటి సేవ లు మాత్రం పూర్తిగా వినియోగంలోకి రాని పరిస్థితి నెలకొంది.
బాధితులు పెరుగుతున్నారు
ఇటీవల ఉద్దానం ప్రాంతంలో 3,897 మందికి పరీక్షలు నిర్వహించారు.
వీరిలో 949 మందికి కిడ్నీ సంబంధిత వ్యాధులున్నట్లు గుర్తించారు.
అంటే బాధితులు 24.35 శాతంగా నమోదైంది.
ఈ నేపథ్యంలో కిడ్నీ వ్యాధి తీవ్రతపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించి, శాశ్వత పరిష్కారానికి సమగ్ర కార్యాచరణ రూపొందించాలని వైద్య రంగ నిపుణులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
స్థానికుల డిమాండ్లు ఇవే..
వ్యాఽధి మూలాలను కనిపెట్టి శాసీ్త్రయంగా నిర్ధారించేందుకు అంతర్జాతీయ నిపుణుల సహకారంతో సమగ్ర పరిశోధన అవసరం. పరిశోధన కేంద్రంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచాలి.
ప్రస్తుతం 60 ఉన్న డయాలసిస్ వార్డుల సంఖ్య రెట్టింపు చేయాలి.
డయాలసిస్ కేంద్రాలను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించాలి.
మండలానికో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే రోగులకు మరిన్ని వ్యయ ప్రయాసలు తగ్గుతాయి.
మండలస్థాయి ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చూడాలి.
ఆయా కేంద్రాల్లో రక్త పరీక్షలు నిర్వహించే సదుపాయాలు, ఇతర మౌలిక వసతులు కల్పించాలి
పలాస కిడ్నీ పరిశోధన కేంద్రాన్ని వేధిస్తున్న ఖాళీలు
నలుగురి సేవలను ఒకరితో చేయిస్తున్న వైనం
వైద్యులు, సిబ్బంది భర్తీపై ఎనలేని నిర్లక్ష్యం
డయాలసిస్ కేంద్రంలో ప్రత్యేక నెఫ్రాలజిస్టు ఒకరున్నారు. ఈయన అప్పుడప్పుడు మాత్ర మే అందుబాటులో ఉంటున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. ఇంకొందరు వైద్యులు, సిబ్బంది అయితే డిప్యుటేషన్‌పై ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక్కడ సేవలు అందించేందుకు అంత సుముఖంగా లేనట్లు కనిపిస్తోంది. కారణం నలుగురు చేయాల్సిన పనులను ఒకరితోనే ప్రభుత్వం చేయిస్తోంది. దీంతో వారంతా విముఖత వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత మేరకు ఇక్కడి నుంచి వెళ్లిపోతే బాగుండనే భావన వైద్యుల నుంచి సిబ్బంది వరకు కనిపిస్తోంది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. విధుల నిర్వహణలో వైద్యులతో పాటు సిబ్బందికి ఎదురవుతున్న సమస్యలను గుర్తించాలి. వాటి పరిష్కారానికి కృషి చేయాలి. లేకుంటే కిడ్నీ బాధితులకు వైద్యమందని పరిస్థితి నెలకొనే ప్రమాదముంది.


