సాక్షి, హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమను కొంతకాలం హడలెత్తించిన ఐబొమ్మ పైరసీ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఐబొమ్మ మాజీ నిర్వాహకుడు ఇమంది రవి తాజాగా కోర్టును ఆశ్రయించాడు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నానని.. కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా ఉందంటూ పిటిషన్‌లో పేర్కొన్నాడు.
సినీ పైరసీ కేసులో తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు రవికి చెందిన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. దీంతో దాదాపుగా రూ.3 కోట్లు అలాగే ఉండిపోయానని తన పిటిషన్‌లో పేర్కొన్నాడు.తన బ్యాంకు ఖాతాలు స్తంభించిపోవడంతో కుటుంబాన్ని పోషించుకోవడం ఇబ్బందిగా మారిందని.. వాటిని తిరిగి ఇప్పించాలని విజ్ఞప్తి చేశాడు. ఈ పిటిషన్‌పై ఇవాళ నాంపల్లి 9వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు విచారణ చేపట్టనుంది.
విశాఖపట్నంకు చెందిన ఇమంది రవి.. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌కు వచ్చి, ఆపై పైరసీ వ్యవహారంతో కోట్లు సంపాదించాడని పోలీసులు చెబుతున్నారు. కుటుంబ నేపథ్యం విషయానికి వస్తే.. ఆయన తండ్రి పేరు అప్పారావు. విశాఖపట్నంలో సాధారణ జీవితం గడుపుతున్న ఆయన.. రవి అరెస్టు తర్వాత మీడియాతో మాట్లాడారు. తన కుమారుడు డిగ్రీ వరకు చదువుకున్న తర్వాత ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లాడని, ఆ తర్వాత విదేశాల్లో ఉన్న విషయం కూడా తనకు పూర్తిగా తెలియదని చెప్పారు. తన కుమారుడు తప్పు చేశాడని తాను సమర్థించబోనని, చట్టం తన పని తాను చేసుకుంటుందని అప్పారావు అప్పట్లో స్పష్టం చేశారు.
ఇక రవి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ విభేదాల నేపథ్యంలోనే రవి భార్య నుంచి విడాకుల వ్యవహారానికి సంబంధించి హైదరాబాద్‌కు వచ్చేవాడని, అదే సమయంలో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారని బంధువులు తెలిపారు. రవికి ఓ కుమార్తె ఉంది. అయితే భర్త వ్యవహారంపై స్పందించేందుకు ఆ భార్య అప్పట్లో నిరాకరించింది. అయితే ప్రస్తుతం వాళ్లు కలిసి ఉంటున్నారా? రవి కేవలం తన తల్లిదండ్రులతోనే ఉంటున్నాడా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
పైరసీకి ‘ఐబొమ్మ’ అడ్డాగా..
తెలుగు సినీ పరిశ్రమకు పైరసీ సమస్య ఈనాటిది కాదు. కొత్త సినిమాలు థియేటర్లలో విడుదలైన కొద్దిసేపటికే వాటి పైరసీ ప్రింట్లు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవుతుండటం ఇప్పటికీ తలనొప్పిగానే ఉంది. ఐబొమ్మ, బప్పం టీవీ వంటి వెబ్‌సైట్ల ద్వారా సినిమాలు అక్రమంగా అందుబాటులోకి వచ్చేవి. ఈ వెబ్‌సైట్ల వెనుక ఇమంది రవి కీలకంగా వ్యవహరించినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.
అక్కడే మొదలైన అసలు కథ
పైరసీ కేసులో దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఐ బొమ్మ నిర్వాహకులు ఏకంగా పోలీసులకు సవాల్ విసిరారు. తన వెబ్‌సైట్‌పై చర్యలు తీసుకుంటే సినీ పరిశ్రమకు చెందిన పలువురి వివరాలను బయటపెడతానంటూ బెదిరింపులకు దిగారు. దీంతో ఈ కేసును సైబర్ క్రైమ్ పోలీసులు మరింత సీరియస్‌గా తీసుకున్నారు. సుమారు ఆరు నెలలపాటు రవి కదలికలపై నిఘా పెట్టి అతని నెట్‌వర్క్‌ను ఛేదించే ప్రయత్నం చేశారు.
పక్కా స్కెచ్‌తో అరెస్ట్
విదేశాల్లో ఉంటూ ఐబొమ్మ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 2025 నవంబర్‌లో రవి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు సమాచారం అందడంతో పోలీసులు అతడి కదలికలపై నిఘా పెట్టారు. చివరకు నవంబర్ 15, 2025న కూకట్‌పల్లిలోని అపార్ట్‌మెంట్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.
రవి అరెస్ట్ వార్త అప్పట్లో సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. హైదరాబాద్ పోలీసులు ఐబొమ్మ, బప్పం టీవీకి సంబంధించిన వెబ్‌సైట్లను మూసివేయించే చర్యలు చేపట్టారు. 65కుపైగా పైరసీ మిర్రర్ వెబ్‌సైట్లను బ్లాక్ చేసినట్లు అప్పట్లో అధికారులు తెలిపారు. సినీ ప్రముఖులు కూడా పోలీసుల చర్యలను అభినందించారు.
రూ.3 కోట్లు ఫ్రీజ్.. 21 వేల సినిమాలు?
దర్యాప్తులో భాగంగా రవి బ్యాంకు ఖాతాల్లోని సుమారు రూ.3 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేసినట్లు వెల్లడించారు. కొన్ని నివేదికల్లో ఈ మొత్తం రూ.3.5 కోట్ల వరకు ఉన్నట్లు పేర్కొన్నారు. రవి వద్ద వేలాది సినిమాల డిజిటల్ కాపీలు, హార్డ్‌డిస్క్‌లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఎక్కడో కరేబియన్ దీవుల నుంచి పెద్ద నెట్ వర్క్‌తో ఈ వ్యవహారమంతా నడిపించడం పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురి చేయించింది. హైదరాబాద్ సీపీగా ఉన్న వీసీ సజ్జనార్ అప్పట్లో మాట్లాడుతూ.. రవి సుమారు రూ.20 కోట్లు సంపాదించినట్లు దర్యాప్తులో తేలిందని, అతడి వద్ద దాదాపు 21 వేల సినిమాలు ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు.
పైరసీతో పాటు బెట్టింగ్ యాప్‌ల వ్యవహారం
రవి వ్యవహారంలో కేవలం సినిమా పైరసీకే పరిమితం కాకుండా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రచారానికి సంబంధించిన అంశాలు కూడా దర్యాప్తులోకి వచ్చాయి. పోలీసుల ప్రకారం.. ఐబొమ్మ వెబ్‌సైట్లకు వచ్చే భారీ ట్రాఫిక్‌ను బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌ల వైపు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి కూడా కేసులు నమోదయ్యాయి. రవిపై మొత్తం ఐదు కేసులు నమోదు చేసినట్లు తర్వాతి నివేదికల్లో వెల్లడైంది.
బెయిల్ కోసం వరుస ప్రయత్నాలు
అరెస్ట్ తర్వాత రవి బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ తొలుత నాంపల్లి కోర్టులో ఉపశమనం లభించలేదు. వివిధ కేసుల్లో దర్యాప్తు కొనసాగడంతో అతడు జైలులోనే ఉన్నాడు. పోలీసులు అతడిని కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఐబొమ్మ నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారు? విదేశీ లింకులు ఎలా ఉన్నాయి? పైరసీ కంటెంట్ ఎలా సేకరించేవారు? డబ్బు లావాదేవీలు ఎలా జరిగేవి? అనే అంశాలపై ప్రశ్నించించారు. అదేసమయంలో.. అతన్ని హీరోగా అభివర్ణిస్తూ ఇటు సోషల్ మీడియాలో మద్దతు పెద్ద ఎత్తున కనిపించింది.
90 రోజుల తర్వాత బయటకు..
దాదాపు మూడు నెలలపాటు జైలులో ఉన్న రవికి 2026 ఫిబ్రవరి 17న తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆ మరుసటి రోజు, ఫిబ్రవరి 18న చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. బెయిల్‌లో భాగంగా పాస్‌పోర్టును కోర్టులో సమర్పించాలని, విదేశాలకు వెళ్లకూడదని ఆదేశించింది. ఇంటర్నెట్ వినియోగంపై కూడా ఆంక్షలు విధించడంతోపాటు అవసరమైతే పోలీసుల అనుమతి తీసుకోవాలని షరతులు పెట్టింది.
ఇప్పుడు మళ్లీ కోర్టు మెట్లు
ఇలా అరెస్ట్, రిమాండ్, కస్టడీ, బెయిల్, విడుదల వంటి దశలు దాటిన తర్వాత తాజాగా రవి మరోసారి కోర్టును ఆశ్రయించడం కేసులో కీలక పరిణామంగా మారింది. తన నుంచి పోలీసులు ఫ్రీజ్ చేసిన సుమారు రూ.3 కోట్లను తిరిగి ఇవ్వాలని కోరుతున్నాడు. బ్యాంకు ఖాతాలు స్తంభించిపోవడంతో కుటుంబ ఖర్చులు నిర్వహించడం కష్టంగా మారిందని అంటున్నాడు. ఈ తరుణంలో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
ఇదీ చదవండి: హైడ్రాకు ఇది ఊహించని షాకే!


