బిలాస్‌పూర్: గణేశ్ చతుర్థి వేడుకల సందడి మధ్య ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. గణేశ్ మండపం వద్ద సౌండ్ సిస్టమ్ విషయంలో తలెత్తిన వివాదం ఓ యువకుడి హత్యకు దారితీసింది. సక్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంబల్పురి గ్రామంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. సౌండ్ సిస్టమ్ విషయమై అమన్ సూర్యవంశీ (23), ఆకాశ్ సూర్యవంశీ (22) మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం అది ఘర్షణకు దారి తీసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని రేషన్ దుకాణం ఎదుట గణేశ్ ఉత్సవాల కోసం మండపం ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం అక్కడ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు విషయంలో అమన్, ఆకాశ్ మధ్య మాటామాటా పెరిగింది. వివాదం ముదరడంతో అమన్ కత్తి తీసుకుని ఆకాశ్‌పై దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆకాశ్ అక్కడికక్కడే కుప్పకూలాడు.
సమాచారం అందుకున్న గ్రామస్థులు డయల్-112కు ఫోన్ చేశారు. తీవ్రంగా గాయపడిన ఆకాశ్‌ను సిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు పరీక్షించి, అతడు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఘటన అనంతరం పోలీసులు అమన్ సూర్యవంశీని అదుపులోకి తీసుకున్నారు. వివాదానికి అసలు కారణం, ఘటనకు సంబంధించిన ఇతర అంశాలపై అతడిని విచారిస్తున్నారు.
ప్రాథమిక దర్యాప్తులో సౌండ్ సిస్టమ్ విషయంలోనే వివాదం తలెత్తినట్లు పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారం ప్రకారం.. నిందితుడు మత్తు పదార్థాలకు అలవాటుపడిన వ్యక్తిగా చెబుతున్నారు. గణేశ్ మండపం సమీపంలోనే హత్య జరగడంతో గ్రామంలో కలకలం రేగింది.
ఇదీ చదవండి: గణపయ్య వేడుకల్లో మళ్లీ ‘గోవిందా’.. కనిపించని సునీత!


