షాక్‌.. 1.14 లక్షల మందికి నాణ్యత లేని ‘రైల్‌ నీర్‌’? | Rail Neer Besan Samples Fail Quality Test in Bhopal | Sakshi
Sakshi News home page

షాక్‌.. 1.14 లక్షల మందికి నాణ్యత లేని ‘రైల్‌ నీర్‌’?

Sep 15 2026 9:48 AM | Updated on Sep 15 2026 10:17 AM

Rail Neer Besan Samples Fail Quality Test in Bhopal

భోపాల్‌: రైలు ప్రయాణికులకు అందించే తాగునీరు, ఆహార పదార్థాల నాణ్యతపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. భోపాల్‌ రైల్వే డివిజన్‌లో నిర్వహించిన సాధారణ నాణ్యత తనిఖీల్లో ఐఆర్‌సీటీసీకి చెందిన ‘రైల్‌ నీర్‌’ నీటి నమూనాతో పాటు ఆహార తయారీలో ఉపయోగించే శనగపిండి శాంపిల్‌ నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేలింది. దీంతో ప్రయాణికుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల సాధారణ పరీక్షల్లో భాగంగా నీటి నమూనాను సేకరించారు. డివిజన్‌ పరిశీలనల ప్రకారం.. ఆ నమూనా నిర్దేశిత నాణ్యత ప్రమాణాలను అందుకోలేకపోయింది. అలాగే ఆహార పదార్థాల్లో ఉపయోగించే శనగపిండి కూడా నాణ్యత ప్రమాణాల్లో విఫలమైంది. దీనిపై అధికారులు దృష్టి సారించారు.

రోజుకు 1.14 లక్షల ప్రయాణికులు
2025-26లో భోపాల్‌ రైల్వే డివిజన్‌లో రోజుకు సగటున 1.14 లక్షల మంది ప్రయాణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. భోపాల్‌ జంక్షన్‌లోనే రోజుకు 150కుపైగా రైళ్లు ఆగుతుండగా.. సుమారు 70 వేల మంది ప్రయాణికుల రాకపోకలు ఉంటాయి. మండీదీప్‌ ప్లాంట్‌ నుంచి రాణి కమలాపురం, నర్మదాపురం, ఇటార్సీ, విదిశ, గంజ్‌ బసోడా తదితర స్టేషన్లకు రోజుకు సుమారు 5,000 రైల్‌ నీర్‌ బాటిళ్లు సరఫరా అవుతున్నాయి. లీటరు రూ.14 చొప్పున లెక్కిస్తే.. రోజువారీ సరఫరా విలువ సుమారు రూ.70 వేలు కాగా, ఏడాదికి రూ.2.55 కోట్ల వ్యాపారం జరుగుతోంది.

మరిన్ని బాటిళ్లకు పరీక్షలు
ఈ ఘటనపై భోపాల్‌ డివిజన్‌ సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ సౌరభ్‌ కటారియా స్పందించారు. రైల్‌ నీర్‌ను క్రమం తప్పకుండా పరీక్షిస్తున్నామని తెలిపారు. ఒక నమూనాపై అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో అదే బ్యాచ్‌కు చెందిన మరికొన్ని బాటిళ్లను పరీక్షల కోసం సేకరించినట్లు చెప్పారు. ఐఆర్‌సీటీసీ అధికారులు కూడా పరీక్షల కోసం సుమారు 10 బాటిళ్లను పంపినట్లు వెల్లడించారు. ఘటనపై సమగ్ర విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. గతంలో ఇటార్సీ బేస్‌ కిచెన్‌లో తనిఖీలు నిర్వహించి, గడువు ముగిసిన, నాణ్యత లేని ఆహార పదార్థాలను గుర్తించి, ధ్వంసం చేశారు.

ఇదీ చదవండి: మేయర్‌ ఇంట్లో.. రెండో తరగతి పిల్లాడి వినాయకుడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement