3 వేల కోట్ల ఆస్తులు.. బిచ్చగాడిలా మారిన ఎమ్మెల్యే! | Thousand Crores Assets Why This Maharashtra MLA Turns Beggar | Sakshi
Sakshi News home page

3 వేల కోట్ల ఆస్తులు.. రోడ్డుపై బిచ్చగాడిలా ఆ ఎమ్మెల్యే!

Sep 15 2026 9:20 AM | Updated on Sep 15 2026 9:28 AM

Thousand Crores Assets Why This Maharashtra MLA Turns Beggar

ఆయన రాష్ట్రంలోనే అత్యంత సంపన్న ఎమ్మెల్యేల్లో ఒకరు. కోట్లాది రూపాయల ఆస్తులు.. భద్రతా సిబ్బంది.. ఖరీదైన వాహనాలు.. ఎక్కడికి వెళ్లినా హంగామా. కానీ ఒక్కరోజు మాత్రం ఇవన్నీ పక్కనపెట్టి వీధుల్లో బిచ్చగాడిగా కూర్చున్నారు. చేతిలో డబ్బులు లేకపోయినా.. అడిగిన వారికి తనకు తోచినంతగా ఇవ్వమని కోరారు. చివరకు అదే రూపంలో వచ్చిన ఆహారాన్ని స్వీకరించి తిన్నారు. ఇంతకీ ఇదంతా ఎందుకు?

మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే పరాగ్‌ షా ఈ వింత అనుభవాన్ని స్వయంగా చవిచూశారు. జైన సంప్రదాయంలో కొనసాగుతున్న ప్రత్యేక మాసం సందర్భంగా తన ఆధ్యాత్మిక గురువు చేసిన సూచనతో ఆయన ఈ పని చేశారు. ముంబైలోని ఘాట్‌కోపర్‌ వీధుల్లో కొంతసేపు బిచ్చగాడి వేషంలో గడిపారు. ఇందులో భాగంగా.. తన భద్రతా సిబ్బందిని, వాహనాలను పక్కనపెట్టారు. ఖరీదైన వస్తువులన్నింటినీ వదిలి.. మేకప్‌ వేసుకుని తనను ఎవరూ గుర్తుపట్టకుండా జాగ్రత్తపడ్డారు. అనంతరం రోడ్లపై కూర్చుని ప్రజలను ఆహారం, డబ్బు అడిగారు.

రూ.20.. సమోసా ఉచితం!
ఈ అనుభవం తనకు జీవితంలోని వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకునే అవకాశం ఇచ్చిందని పరాగ్‌ షా తెలిపారు. సాధారణంగా తనను కలవడానికి ప్రజలు వరుసలో నిలబడతారని.. కానీ తాను వారి దగ్గరకు వెళ్లినప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పారు.

ఓ వ్యక్తి తనకు రూ.20 ఇచ్చి “వెళ్లి తిను బాబా” అని చెప్పినట్లు షా గుర్తుచేసుకున్నారు. మరోవైపు ఓ సమోసా విక్రేత వద్దకు వెళ్లి తన దగ్గర డబ్బులు లేవని చెప్పగా.. అతడు ఎలాంటి డబ్బులు తీసుకోకుండా చిరునవ్వుతో సమోసా ఇచ్చాడని తెలిపారు.

“నేను డబ్బులు లేవని చెప్పినా.. ఆ పేద చిరు వ్యాపారి ఏ మాత్రం మొహం చాటేయకుండా నవ్వుతూ సమోసా ఇచ్చాడు. ముంబై ప్రజల్లో ఒకరికొకరు సాయం చేసే గుణం ఉంది” అని షా తన అనుభవాన్ని వివరించారు.

మేకప్‌ తొలగించి మళ్లీ అక్కడికే..
కొన్ని గంటలపాటు బిచ్చగాడిగా గడిపిన తర్వాత పరాగ్‌ షా మేకప్‌ తొలగించుకున్నారు. అనంతరం తాను గతంలో తిరిగిన ప్రాంతాలకే వెళ్లి.. తనను గుర్తుపట్టని సమయంలో ప్రజలు ఎలా స్పందించారో మరోసారి పరిశీలించారు. ఈ అనుభవాన్ని తన గురువుతో పాటు ఇతరులతోనూ పంచుకున్నారు.

తనకు లభించే గౌరవం, హోదా, అధికారాల వెనుక ఉన్న భిన్నమైన ప్రపంచాన్ని ఈ అనుభవం చూపించిందని షా అన్నారు. “నన్ను కలవడానికి వచ్చే ప్రజలే.. నేను వారి దగ్గరకు వెళ్లినప్పుడు నాకంటే ఎత్తుగా కనిపించారు. అదే జీవితంలోని వాస్తవం” అని ఆయన వ్యాఖ్యానించారు.

రిచ్చెస్ట్‌ ఎమ్మెల్యే
ఘాట్‌కోపర్‌ ఈస్ట్‌ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న పరాగ్‌ షా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో ఉన్నారు. 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన సమర్పించిన అఫిడవిట్‌లో రూ.3,383 కోట్లకు పైగా ఆస్తులను ప్రకటించారు. దీంతో అప్పట్లో మహారాష్ట్రలోనే అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచారు. రాజకీయాల్లోకి రాకముందు వ్యాపారవేత్తగా ఉన్న ఆయన.. బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ)లో కార్పొరేటర్‌గానూ పనిచేశారు.

ఇంతటి సంపద, హోదా ఉన్న వ్యక్తి ఒక్కరోజు అన్నింటినీ పక్కనపెట్టి సామాన్యుడిలా, చివరకు బిచ్చగాడి రూపంలో ప్రజల మధ్య కూర్చోవడం ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే తనకు ఈ అనుభవం “జీవితంలోని వాస్తవాన్ని చూపించింది” అని పరాగ్‌ షా చెప్పడం అసలు ఉద్దేశాన్ని స్పష్టం చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement