‘నాపై అంత జాలి ఉంటే..’ కల్యాణ్‌కు బైకర్‌ సియా కౌంటర్‌ | Gurugram Hit-and-Run: Woman Biker Says Why Did You Leave Me | Sakshi
Sakshi News home page

‘నాపై అంత జాలి ఉంటే..’ కల్యాణ్‌కు బైకర్‌ సియా కౌంటర్‌

Sep 15 2026 7:34 AM | Updated on Sep 15 2026 7:43 AM

Gurugram Hit-and-Run: Woman Biker Says Why Did You Leave Me

రోడ్డుపై వెళ్తున్న ఓ యువతి బైక్‌ను కారు ఢీకొట్టడం.. ఆమె కిందపడిపోయినా వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోవడం.. ఆ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం.. గురుగ్రామ్‌లో జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. తనను కారు కావాలనే వెంబడించి ఢీకొట్టారని బైకర్‌ ‘రెబల్‌ వీల్స్‌ సియా’ ఆరోపిస్తుండగా.. నిందితుడి తరఫు న్యాయవాది మాత్రం తప్పంతా బైకర్లదేనని అంటున్నాడు.

గురుగ్రామ్‌ గోల్ఫ్‌ కోర్స్‌ రోడ్డుపై ఆదివారం ఈ ఘటన జరిగింది. సియా తన ఏప్రిలియా ఆర్‌ఎస్‌ 457 స్పోర్ట్స్‌ బైక్‌పై తోటి బైకర్లతో కలిసి వెళ్తోంది. ఆ సమయంలో తెల్లరంగు సెడాన్‌ తమను వెంబడించిందని ఆమె చెబుతోంది. కారులోని వారు తనకు దగ్గరగా వచ్చి ఇబ్బందికరంగా ప్రవర్తించారని, దూరంగా ఉండాలని తాను సూచించినా.. బైక్‌ను ఆపాలని సైగలు చేశారని ఆమె ఆరోపించింది. చివరకు కారు పక్క నుంచి వచ్చి తన బైక్‌ను ఢీకొట్టడంతో రోడ్డుపై పడిపోయానని తెలిపింది.

‘నేను అక్కడికక్కడే చనిపోయేదాన్ని’
ప్రమాదంపై తొలిసారి స్పందించిన సియా.. నిందితుడు కల్యాణ్‌ బైన్‌స్లా చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్‌ ఇచ్చింది. ‘నాపై జాలిపడుతున్నానని చెబుతున్నారు. నిజంగా జాలిపడితే ప్రమాదం తర్వాత ఎందుకు ఆపలేదు?’ అని ప్రశ్నించింది. తనను కారు చాలా దూరం వెంబడించిందని చెబుతూ.. ‘నేను అక్కడికక్కడే చనిపోయేదాన్ని. ఎముకలు విరిగిపోయేంత తీవ్ర గాయాలు కూడా అయ్యుండొచ్చు’ అని పేర్కొంది.

కారు తనను వెంబడించలేదన్న వాదనను కూడా ఆమె ఖండించింది. ‘నా జుట్టు కనిపించింది.. నా దగ్గరకు వచ్చారు.. ఆపాలని సైగ చేశారు. అలాంటప్పుడు బైక్‌పై మహిళ ఉందో లేదో తెలియదని ఎలా చెబుతారు?’ అని ప్రశ్నించింది. ప్రమాదానికి సంబంధించిన రెండు వీడియోల్లోనూ కారు తన బైక్‌ వైపు లేన్‌ మార్చి ఢీకొట్టిన దృశ్యాలు స్పష్టంగా ఉన్నాయని తెలిపింది.

కొత్త వీడియో.. మరో కోణంలో ఢీకొట్టిన దృశ్యం
ఈ ఘటనకు సంబంధించి సియా వెనుకే వస్తున్న మరో బైకర్‌ రికార్డు చేసిన వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. అందులో కారు సియా బైక్‌ వైపు వచ్చి ఢీకొట్టినట్లు కనిపిస్తోంది. కారు తమను చాలా దగ్గరగా వెంబడించిందని, డ్రైవర్‌ కిటికీ దించి ఆపాలని సైగ చేశాడని ఆ బైకర్‌ ఆరోపించాడు. ప్రమాదం తర్వాత కారు వెళ్లిపోవడంతో తాను దాన్ని వెంబడించి డ్రైవర్‌ ముఖాన్ని కెమెరాలో రికార్డు చేశానని చెప్పాడు. ప్రమాదం కారణంగా సియాకు చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. అయితే రైడింగ్‌ గేర్‌ ధరించి ఉండటంతో తీవ్ర గాయాలు తప్పాయని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. బైక్‌ మాత్రం దెబ్బతింది.

‘కారులో నలుగురు.. మద్యం మత్తులో ఉన్నారు’
సియా సోదరుడు కూడా సంచలన ఆరోపణలు చేశాడు. ప్రమాదం జరిగిన వెంటనే తనకు సియా ఫోన్‌ చేసి.. ఎవరో కారుతో ఢీకొట్టి వెళ్లిపోయారని చెప్పిందన్నాడు. కారులో నలుగురు ఉన్నారని, వారంతా మద్యం మత్తులో ఉన్నట్లు కనిపించారని ఆమె చెప్పినట్లు వెల్లడించాడు. కారులోని వారు అసభ్యకరమైన సైగలు చేశారని కూడా ఆరోపించాడు. సియా తండ్రి ఈ ఘటనను సాధారణ ప్రమాదంగా చూడలేమని, ఇది హత్యాయత్నంగా భావిస్తున్నామని అన్నారు. రోడ్డుపై పెద్దగా ట్రాఫిక్‌ కూడా లేదని.. అలాంటి సమయంలో ఈ ప్రమాదం జరగడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు.

‘తప్పంతా బైకర్లదే’.. నిందితుడి తరఫు వాదన

గురుగ్రామ్‌ హిట్‌ అండ్‌ రన్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్యాణ్‌ బైన్స్లా బాడీబిల్డర్‌, జిమ్‌ ట్రైనర్‌. తన ఇన్‌స్టాగ్రామ్‌ ప్రొఫైల్‌లో ‘ఇంటర్నేషనల్‌ కబడ్డీ ప్లేయర్‌’, ‘ఇండియన్‌ రగ్బీ టీమ్‌ సభ్యుడు’గా రాసుకున్నాడు. హిట్‌ అండ్‌ రన్‌ కేసులో క‌ల్యాణ్‌ బైన్‌స్లా తరఫు న్యాయవాది మాత్రం పూర్తిగా భిన్నమైన వాదన వినిపించారు. కారులో నలుగురు ఉన్నారని.. వారిలో బంధువులు కూడా ఉన్నారని చెప్పారు. బైకర్లు రోడ్డుపై అడ్డంకిగా మారుతున్నారని, వారి కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. 

కారు ఫుట్‌పాత్‌ను తప్పించుకునే క్రమంలో కొంచెం ఎడమవైపు వెళ్లిందని.. అదే సమయంలో యువతి కుడివైపు రావడంతో ఢీకొట్టిందని న్యాయవాది చెప్పారు. ప్రమాదం తర్వాత ఆపకపోవడానికి కారణం అక్కడ గుమిగూడిన వారు దాడి చేస్తారనే భయమేనని, ఆ పరిస్థితుల్లో కారు వెళ్లిపోయిందని తెలిపారు. సియా సోషల్‌ మీడియాలో ఫాలోవర్లు, వ్యూస్‌ కోసం ఘటనను ప్రచారం చేస్తోందని కూడా ఆరోపించారు. ఆమె బైక్‌ వేగం గంటకు 140–170 కిలోమీటర్ల వరకు ఉందని వాదించారు.

కారు ఎవరిది?
ప్రమాదానికి ఉపయోగించిన కారు హరియాణాలోని పల్వాల్‌కు చెందిన మ‌నీష్‌ పేరుతో రిజిస్టర్‌ అయి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే తాను ఆ సమయంలో కారులో లేనని మ‌నీష్‌ స్పష్టం చేశాడు. తాను ఆర్మీలో పనిచేస్తున్నానని, ఘటన జరిగిన సమయంలో అసోంలో విధుల్లో ఉన్నానని చెప్పాడు. ఆదివారం తన కుటుంబానికి చెందిన కారును ఓ స్నేహితుడు తీసుకెళ్లాడని.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌ అయిన తర్వాతే ప్రమాదం విషయం తనకు తెలిసిందని వివరించాడు.

పోలీసుల దర్యాప్తు
కల్యాణ్‌ బైన్స్లా మాత్రం తాను కావాలనే బైకర్‌ను ఢీకొట్టలేదని చెబుతున్నాడు. బైకర్‌ అధిక వేగంతో వెళ్తుండగా, తాను కారు మలుపు తిప్పే సమయంలో ఢీకొన్నట్లు అతడి వాదన. ప్రమాదం తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోవడానికి బైకర్ల గుంపు దాడి చేస్తుందనే భయమే కారణమని కూడా అతడి తరఫున వాదన వచ్చింది. అయితే మహిళా బైకర్‌ మాత్రం కారు తనను ఉద్దేశపూర్వకంగా వెంబడించి ఢీకొట్టిందని ఆరోపిస్తోంది. ఈ రెండు వాదనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో గురుగ్రామ్‌ పోలీసులు ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వైరల్‌ వీడియోలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, కారు వివరాల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. అసలు ప్రమాదం ఎలా జరిగింది? కారు ఉద్దేశపూర్వకంగా బైక్‌ను ఢీకొట్టిందా? లేక ప్రమాదవశాత్తూ జరిగిందా? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

ఇదీ చదవండి: బీజేపీ బిగ్‌ విక్టరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement