21 ఏళ్ల కొడుకు దుర్మరణం : 22 ఏళ్ల నాటి పిండంతో బిడ్డకు జన్మ | Greek WomanGives Birth Using Embryo Frozen For 22 Years After Losing Son | Sakshi
Sakshi News home page

21 ఏళ్ల కొడుకు దుర్మరణం : 22 ఏళ్ల నాటి పిండంతో బిడ్డకు జన్మ

Sep 14 2026 5:18 PM | Updated on Sep 14 2026 5:25 PM

Greek WomanGives Birth Using Embryo Frozen For 22 Years After Losing Son

ఒక ఘోర ప్రమాదంలో  21 ఏళ్ల కొడుకును కోల్పోయిన  54 ఏళ్ల గ్రీకు మహిళ  రెండోసారి  ఐవీఎఫ్  ద్వారా గర్భం దాల్చి పండింటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, గ్రీస్ నిబంధనల ప్రకారం సాధారణంగా 54 ఏళ్లు దాటిన మహిళలు ఐవీఎఫ్ చేయించుకోవడానికి అనుమతి లేదు. అయినా అ దంపతులు దేశంలోని నేషనల్ రిప్రొడక్టివ్ మెడిసిన్ అథారిటీ నుండి ప్రత్యేక అనుమతి తీసుకుని  మరీ బిడ్డను కనడం  విశేషంగా నిలుస్తోంది. తాజా ఘటనతో  గ్రీకు దేశంలో ఐవీఎఫ్ వయస్సు పరిమితులపై మరోసారి చర్చ మొదలైంది.

గతేడాది అక్టోబర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో క్రిస్టినా రాప్తి-ట్జెలెపి (Cristina Rapti-Tzelepi), కాన్స్టాంటినోస్ రాప్టిస్ (Constantinos Raptis, 60) దంపతుల 21 ఏళ్ల కొడుకు గియోర్గోస్ (Giorgos) మరణించాడు. ఆ దుర్ఘటన జరిగి కొద్ది నెలల తర్వాత ఈ దంపతులు మరోసారి సంతానం కనాలని నిర్ణయించుకున్నారు.

22 ఏళ్లకు పైగా ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోను ఉపయోగించి ఐవీఎఫ్‌ పద్ధతిలో సెప్టెంబర్ 9న  ఆడబిడ్డకు జన్మనిచ్చారు. పుట్టిన పాప బరువు 3.49 కిలోలు. తమ దివంగత కొడుకు గియోర్గోస్ జ్ఞాపకార్థం దంపతులు తమ కూతురికి 'జార్జియా' (Georgia) అని పేరు పెట్టారు. గియోర్గోస్ కూడా గతంలో ఐవీఎఫ్ ద్వారానే జన్మించాడు.

22 ఏళ్ల క్రితం ఫ్రీజ్ చేసిన పిండం ద్వారా ఒక గ్రీకు మహిళ బిడ్డకు జన్మనిచ్చిందని, అదే చికిత్సతో పుట్టిన తన కుమారుడిని కోల్పోయిన తర్వాత ఈ సంఘటన జరిగిందని  గైనకాలజిస్ట్ కాన్‌స్టాంటినోస్ పాంటోస్ ఒక ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

2004లో పిండ మార్పిడి తర్వాత, తొలి ప్రయత్నంలోనే ఆరోగ్యకరమైన మగబిడ్డకు జన్మనిచ్చారు. కానీ దురదృష్టవశాత్తూ  ఆ బిడ్డను కోల్పోయారని పాంటోస్ తెలిపారు.

వయస్సు నిబంధనలపై చర్చ
గతంలోనూ ఇలాంటి ఘటనే వార్తల్లో నిలిచింది. ఒక ఒహియో దంపతులు ఎంబ్రియో అడాప్షన్ ద్వారా, ఏకంగా 30 సంవత్సరాలకు పైగా ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోను ఉపయోగించి బాబుకు జన్మనిచ్చారు. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోనూ గుర్తింపు పొందింది.

రాప్తి-ట్జెలెపి గైనకాలజిస్ట్, హెలెనిక్ సొసైటీ ఆఫ్ రిప్రొడక్టివ్ మెడిసిన్ హెడ్ అయిన కోస్టాస్ పాంటోస్ మాట్లాడుతూ ముఖ్యంగా గ్రీస్‌లో తగ్గుతున్న జనన రేటును దృష్టిలో ఉంచుకుని ఈ నిబంధనలను పునః సమీక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ప్రస్తుత నిబంధనల ప్రకారం మహిళలు 54 ఏళ్ల వరకు మాత్రమే ఐవీఎఫ్ చేయించుకోవడానికి అవకాశం ఉంది. ఈ నిబంధన చాలా కఠినంగా ఉందని, చట్టంలో మార్పు రావాలని డాక్టర్ పాంటోస్ వాదిస్తున్నారు.

మరోవైపు రెండో అవకాశం ద్వారా జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలనుకున్నాం. ఇంట్లోకి మరో బిడ్డను ఆహ్వానించి,  తమ తొలి బిడ్డ ఇంటిని నవ్వులతో ఎలా నింపిందో, ఈ పాప కూడా అంతే ఆరోగ్యంగా, ఆనందంగా, ఉత్సాహంగా పెరగాలని కోరుకున్నాం అంటూ ఎంతో సంతోషంగా చెప్పారు దంపతులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement