టీటీడీ స్థలంలో సీఎం బంధువుకు ఎలా పట్టా ఇస్తారంటూ నిరసన వ్యక్తం చేస్తున్న స్థానికులు
రూ.60 లక్షల విలువైన 2.5 సెంట్ల నివేశన స్థలం మంజూరు
తిరుపతి మంగళం: టీటీడీకి సంబంధించిన విలువైన స్థలానికి ముఖ్యమంత్రి సమీప బంధువు(చెల్లెలి) పేరుతో నివేశన పట్టా మంజూరు చేశారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. సుమారు రూ.60 లక్షల విలువైన రెండున్నర సెంట్ల స్థలానికి పట్టా మంజూరు చేయడంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చంద్రగిరి మండలం అనంతగురప్పగారిపల్లికి చెందిన ఎం.చెంచయ్యనాయుడు భార్య ఎం.బేబీ పేరుతో తిరుమలనగర్ పంచాయతీ పద్మావతి నగర్‌లోని సర్వే నంబర్ 1/1లో రెండున్నర సెంట్ల స్థలానికి ఈ నెల 9న నివేశన పట్టా మంజూరు కావడం వివాదానికి దారితీసింది. ప్రస్తుతం ఆ స్థలం విలువ సుమారు రూ.60 లక్షలు ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు.
సీఎం కార్యాలయం ఆదేశాలతోనే..
పట్టా మంజూరు విషయంలో సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు రావడంతోనే తిరుపతి అర్బన్ తహసీల్దారు పట్టా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అర్బన్ తహసీల్దార్ కూడా స్పష్టంచేస్తున్నారు. సీఎం పేషీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు కలెక్టర్ ఉత్తర్వులతో పట్టాలిచ్చామని చెబుతున్నారు. దీంతో ఈ వ్యవహారంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీటీడీకి సంబంధించిన భూమిలో వ్యక్తిగతంగా నివేశన పట్టా ఎలా మంజూరు చేశారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీటీడీ స్థలంలో పట్టా ఇచ్చే అధికారం రెవెన్యూ అధికారులకు ఉందా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఒక వేళ ఇచ్చినా టీటీడీ తీర్మానం ఇచ్చినట్లు ఏమైనా పత్రాలు ఉన్నాయా? అంటూ అక్కడికి వచ్చిన రెవెన్యూ అధికారులను, టీడీపీ నాయకులనూ ప్రశ్నించారు.

ఎం.బేబీ పేరిట తిరుపతి అర్బన్ తహసీల్దార్ మంజూరు చేసిన పట్టా
పట్టా ఇచ్చిన స్థలంలోకి వెళ్లిన బేబీ
పట్టా మంజూరైన స్థలంలో ప్లాటు శుభ్రం చేసేందుకు చంద్రబాబు సోదరి బేబీ వెళ్లగా స్థానికులు అడ్డుకున్నారు. సర్వే నంబర్ 1/1లోని స్థలం టీటీడీకి చెందినదని, అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతించబోమని స్థానికులు స్పష్టం చేశారు. ఆ స్థలం కమ్యూనిటీ భవనం, పిల్లల ఆట స్థలంగా ఉపయోగించుకోవడానికి టీటీడీకి విన్నవించుకున్నామని స్థానికులు వివరించారు. బేబీకి మద్దతుగా కొందరు టీడీపీ నేతలు అక్కడికి వచ్చినప్పటికీ స్థానికులు వెనక్కి తగ్గలేదు.
సామాన్యులకే నిబంధనలా.. సీఎం బంధువులకు లేదా.. ?
నిరుపేదలు ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకుంటే నిషేధిత జాబితా, నిబంధనలు, రికార్డుల పేరుతో పట్టాలు మంజూరు చేయడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి టీటీడీకి సంబంధించిన స్థలానికి సీఎం బంధువు పేరుతో పట్టా ఎలా మంజూరైందని ప్రశ్నిస్తున్నారు.‘సామాన్యులకు ఒక న్యాయం.. సీఎం బంధువులకు మరో న్యాయమా?’ అంటూ నిలదీస్తున్నారు. పట్టా మంజూరుకు ఏ నిబంధన వర్తించిందో ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
సర్వే నంబర్ 1/1లోని భూమి వాస్తవ యాజమాన్యం, రెవెన్యూ రికార్డులు, టీటీడీ రికార్డులను పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. బేబీ పేరుతో పట్టా మంజూరుకు ఎవరు సిఫార్సు చేశారు? ఏ నిబంధనల ప్రకారం పట్టా ఇచ్చారు? సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు వస్తే ఇచ్చేస్తారా ? ఈ పట్టా చెల్లుబాటవుతుందా? అంటూ ప్రశ్నిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన ఆ పట్టాను రద్దు చేసి భూమిని టీటీడీ ఆ«దీనంలోనే కొనసాగించాలని స్థానికులు కోరుతున్నారు.


