స్కామ్‌లు బయటపడగానే చంద్రబాబు చేసే రాజకీయమిదే..
మీడియాతో మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
అమ్మకానికి ప్రభుత్వ ఉద్యోగాలు అనే ధోరణి కొనసాగితే డీఎస్సీ, పోలీస్ రిక్రూట్ మెంట్, ఏపీపీఎస్సీ ఇలా ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే ఎవరైనా ఎగ్జామ్స్ రాస్తారా? ఉద్యోగాలకు ప్రిపేర్ కావడం ఎందుకనే నిర్లిప్త వైఖరి వారిలో రాదా? ఏదైనా ఫర్ సేల్ అంటే ఇక చదువులు ఎందుకు? కష్టపడడం ఎందుకు? ఏమిటీ జీవితం అనిపించదా? అని ప్రశ్నిస్తున్నా.
మా హయాంలో లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. పారదర్శకతకు అత్యంత పెద్దపీట వేశాం.. ఒక్కటంటే ఒక్క రిమార్క్ కూడా రాలేదు. ఎలాంటి ఆరోపణలు రాలేదు. కావాలంటే చూసుకోండి. సచివాలయాల ఉద్యోగాల్లో ఎంతమంది టీడీపీకి చెందిన పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారో చెక్ చేసుకోండి... ఎక్కడా తేడా చూడలేదు.
మేము అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పేటప్పుడు కూడా కళ్లార్పకుండా అబద్ధాలు చెబుతున్నారు. ఎఫ్ఐఆర్ లో అనుమానాస్పదం (సస్పెక్ట్) అని రాశారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు. అరెస్ట్ చేయలేదని వాళ్ల రిపోర్టులే చెబుతున్నాయి. కానీ అరెస్ట్ చేసినట్టు. జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపినట్టు అసెంబ్లీలోనే అడ్డంగా బొంకేస్తున్నారు.
సాక్షి, అమరావతి: ‘డైవర్షన్..డ్రామాలు..అబద్ధాలు.. ఇదే చంద్రబాబు బతుకు.. అధికారులను బెదిరించి.. భయపెట్టి..ప్రలోభాలకు గురిచేస్తూ తనపై నమోదైన కేసులను కొట్టేయించుకుంటున్నారు. ఇది జగమెరిగిన సత్యం. పైగా తనకు తానుగా క్లీన్ చిట్ ఇచ్చుకునే దౌర్భాగ్య స్థితికి దిగజారిపోయాడు. తమ అవినీతి, అక్రమాలు, స్కామ్‌లు బయటపడిన ప్రతీసారి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ పచ్చి అబద్ధాలు చెబుతూ డ్రామాలు ఆడడం చంద్రబాబుకే చెల్లింది‘ అని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కుంభకోణాలు చేస్తూ.. పరీక్షలు రాయకుండా ఉద్యోగాలిస్తుండటంపై సాక్ష్యాధారాలతో ఇదేమిటని ప్రశ్నిస్తే ఎదురు దాడికి దిగుతారు.
ఇలా అయితే వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం ఎలా ఏర్పడుతుంది. లంచాలు తీసుకుని అర్హత లేని వారికి ఉద్యోగాలిచ్చుకుంటూ పోతే వ్యవస్థ కుప్పకూలిపోతుంది. వ్యవస్థలో మార్పు రావాలి. డీఎస్సీ స్కామ్‌పై పారదర్శకంగా సీబీఐ విచారణ జరపాలి, ఈ స్కామ్‌కు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్ రాజీనామా డిమాండ్‌తో వైఎస్సార్‌సీపీ అన్ని విధాలుగా పోరాటాలు చేస్తుంది.’ అని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో పలువురు మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే..
పరీక్ష రాయకుండానే ఉద్యోగాలిస్తే ప్రశ్నించకూడదా?
నువ్వు పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు ఇస్తానంటున్నావు. నీకు నచ్చిన వారికి డబ్బులు తీసుకొని స్కామ్‌లు చేస్తూ ఉద్యోగాలు ఇస్తున్నావు. అర్హత ఉండాలి కదా? ఎలాంటి అర్హత లేకుండా నీకు నచ్చాడని, నీకు డబ్బులు ఇచ్చాడని నీ ఇష్టారాజ్యంగా ప్రభుత్వ, టీచర్ ఉద్యోగాలు ఇచ్చేస్తానంటే ఎలా? ఇదేమిటని ప్రశ్నిస్తే తప్పవుతుందా? ఉద్యోగాలు భర్తీ చేసేటప్పుడు పారదర్శకంగా ఒక పరీక్ష పెట్టాలి. ఆ పరీక్షలో ఉత్తీర్ణత పొందాలి.
అలా ఉత్తీర్ణులైన వారికి ఉద్యోగాలిచ్చే సమయంలో ఒకటి రెండు తప్పిదాలు జరిగితే పొరపాటు చేశావ్ లే అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ కావాలనే పెద్ద మోసం చేసినట్టు స్పష్టంగా కన్పిస్తోంది. ఏ పరీక్ష రాయకుండానే 372 పోస్టులు ఇచ్చేందుకు స్కెచ్ వేశావు. ఉద్యోగాలకు పరీక్షలు రాయనవసరం లేదని ఏకంగా నువ్వు జీవోలు ఇచ్చావు. ఇదే రీతిలో మిగిలిన ప్రభుత్వ ఉద్యోగాలను అమ్ముకోవాలనుకున్నావ్. ఇది తప్పు కాదా? పైగా ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగుతారా?
డైవర్షన్.. డ్రామాలు.. అబద్ధాలు.. ఇదే చంద్రబాబు బ్రతుకు
చంద్రబాబు అనే వ్యక్తి అబద్ధాల మీద అబద్ధాలు..డైవర్షన్ మీద డైవర్షన్..ఒక డ్రామా చేస్తాడు. డీఎస్సీ స్కామ్–1 కానీ, డీఎస్సీ స్కామ్–2 కానీ ఇవన్నీ కూడా ఆధారాలతో సహా నేను చూపించాను. పక్కా ఆధారాలు, సాక్ష్యాలతో ప్రశ్నిస్తున్నా. ఈ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు చిత్తశుద్ధితో సమాధానాలు చెప్పాలి. కానీ మేము అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పేటప్పుడు కూడా కళ్లార్పకుండా అబద్ధాలు చెబుతున్నారు.
ఎఫ్‌ఐఆర్‌లో అనుమానాస్పదం (సస్పెక్ట్) అని రాశారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు. అరెస్ట్ చేయలేదని వాళ్ల రిపోర్టులే చెబుతున్నాయి. కానీ అరెస్ట్ చేసినట్టు. జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపినట్టు అసెంబ్లీలోనే అడ్డంగా బొంకేస్తున్నారు. పైగా అధికారులతో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏం చెప్పించారు.. ఏడుసార్లు వెరిఫికేషన్ తర్వాతే ఉద్యోగాలు ఇచ్చామన్నారు. మేము ఆధారాలతో బయటపెడుతున్నాం.. కాబట్టి దిక్కుతోచని, తప్పనిసరి పరిస్థితుల్లో చేసిన తప్పులను ఒప్పుకోక తప్పని పరిస్థితి వచ్చింది.
నిరుద్యోగ జీవితాలతో చెలగాటాలా?
డీఎస్సీ కుంభకోణంపై పోరాటం ఇంత పెద్దది కాకపోతే..జగన్ అనే వ్యక్తి ప్రశ్నించకపోతే డీఎస్సీ మాదిరిగానే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌కు వర్తింపచేసేవారు. పరీక్షలు లేకుండానే టీచర్ పోస్టులు కట్టబెట్టిన వీళ్లు ఏపీపీఎస్సీలో కూడా పరీక్షలు లేకుండానే ఉద్యోగాలు అమ్మేసుకోవాలని చూశారు. అటవీ శాఖలోని 814 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే అందులో 40 స్పోర్ట్స్ కోటా పోస్టులను పరీక్ష లేకుండా కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ ఆధారంగా భర్తీ చేసేందుకు డీఎస్సీలో ఉపయోగించిన జీవో నెం.4నే ఇక్కడ వర్తింపచేయాలని చూశారు. డీఎస్సీలో అక్రమాలు బయటపడగానే ఇవి కూడా వెలుగులోకి వస్తాయనే భయంతో రిక్రూట్‌మెంట్‌ను మధ్యలో ఆపేశారు.
ఈ 40 పోస్టుల జాబితా బయటపడితే తమ బాగోతం కూడా బయటపడుతుందనే ఉద్దేశంతో మిగిలిన 774 పోస్టుల భర్తీని నిలిపివేశారు. లక్షలమంది పిల్లలు పోటీ పరీక్షల కోసం జీవితాలను ఫణంగా పెట్టి సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతారు. లక్షల రూపాయలు ఖర్చుచేస్తారు. ఇంత కష్టపడితే చివరకు స్కామ్‌లతో ఇష్టారాజ్యంగా నచ్చిన వాళ్లకు లంచాలు తీసుకుని నియామకాలు చేస్తూ నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడుతున్నారు.
ఇలా అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెడుతూ సమాజానికి ఏం సందేశం పంపిస్తున్నారని సూటిగా ప్రశ్నిస్తున్నా. అమ్మకానికి ప్రభుత్వ ఉద్యోగాలు అనే ధోరణి కొనసాగితే డీఎస్సీ, పోలీస్ రిక్రూట్‌మెంట్, ఏపీపీఎస్సీ ఇలా ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే ఎవరైనా ఎగ్జామ్స్ రాస్తారా? ఉద్యోగాలకు ప్రిపేర్ కావడం ఎందుకనే నిర్లిప్త వైఖరి వారిలో రాదా? ఏదైనా ఫర్ సేల్ అంటే ఇక చదువులు ఎందుకు? కష్టపడడం ఎందుకు? ఏమిటీ జీవితం అనిపించదా? అని ప్రశ్నిస్తున్నా. పాలకులుగా ఉన్న మనం ఏం చేస్తా ఉన్నాం. పరిపాలన అంటే ఇదేనా?
ఎలాంటి ఆరోపణ లేకుండా లక్షల ఉద్యోగాలిచ్చాం..
మా ప్రభుత్వ హయాంలో లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. పారదర్శకతకు అత్యంత పెద్ద పీట వేశాం.. ఒక్కటంటే ఒక్క రిమార్క్ కూడా రాలేదు. ఎలాంటి ఆరోపణలు రాలేదు. కావాలంటే చూసుకోండి. చెక్ చేసుకోండి..సచివాలయాల ఉద్యోగాల్లో ఎంతమంది టీడీపీకి చెందిన పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు. ఎక్కడా తేడా చూడలేదు. ప్రభుత్వం అనేది ఉద్యోగార్థుల్లో నమ్మకం కల్గించేలా ఉండాలి. అర్హత లేని వారికి ఉద్యోగాలు అమ్ముకునే విధానాన్ని ఒప్పుకుంటే వ్యవస్థ కుప్పకూలిపోతుంది.
ప్రభుత్వం మీద, వ్యవస్థల మీద వారికి నమ్మకం ఎలా ఉంటుంది? దీన్ని మార్చాలి. వ్యవస్థలోకి మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందుకే డీఎస్సీ స్కామ్‌పై పారదర్శకంగా సీబీఐ విచారణకు మేము డిమాండ్ చేస్తున్నాం. ఇందుకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాల్సిందే. మా డిమాండ్‌లో ఎలాంటి మార్పు లేదు. ఈ విషయంలో ఇప్పటికే వివిధ రూపాల్లో పోరాటాలు చేశాం. మరింత ఒత్తిడి తీసుకొచ్చేందుకు అన్ని రకాల వేదికలపైనా పోరాటాలు కొనసాగిస్తాం.

నిజంగా సిగ్గుతో వాళ్లు తలదించుకోవాలి..
డీఎస్సీ స్కామ్‌పై మీరు లేవనెత్తిన అంశాలపై బీజేపీ, జనసేన ఎందుకు స్పందించడం లేదని మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ‘ఈ ప్రశ్నను మీరు వాళ్లను అడగాలి. డీఎస్సీ స్కామ్ విషయంలో జగన్ ఏమైనా విషయాలు తప్పుగా చెబుతున్నారా. అర్థం లేకుండా మాట్లాడుతున్నాడా ? జగన్ చెప్పే విషయాలు లాజికల్‌గా లేవా ? అని వాళ్లను ప్రశ్నించాలి. జగన్ చెప్పే విషయాలన్నీ కరెక్ట్ అని అనిపిస్తా ఉన్నప్పుడు నోరు మెదపాల్సిన అవసరం ప్రజాస్వామ్యంలో ఉన్న ఎవరికైనా ఖచ్చితంగా రావాలి. సాక్ష్యాలు, ఆధారాలతో పక్కాగా దొరికిపోయిన తర్వాత కూడా జనసేన, బీజేపీ నేతలు ప్రశ్నించకుండా ఇలాంటి చంద్రబాబును సపోర్టు చేస్తున్నందుకు, ఇలాంటి వ్యవస్థను బలపరుస్తున్నందుకు వాళ్లు సిగ్గుతో తలదించుకోవాలి.
తనకు తాను క్లీన్ చిట్ ఇచ్చుకుంటూ..
చంద్రబాబు తనపై నమోదైన కేసులు కొట్టేయించుకుంటూ తనకు తానుగా క్లీన్ చిట్ ఇచ్చుకుంటున్నారు. అధికారులను బెదిరించి, భయపెట్టించి, ప్రలోభాలకు గురిచేస్తూ తనపై నమోదైన కేసులను మూయించుకుంటున్నారు ఇది జగమెరిగిన సత్యం. ప్రభుత్వం తన చేతుల్లో ఉంది. అధికారులందరూ ఆయన కింద పని చేస్తున్నవారే. తనపై నమోదైన కేసులను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తున్నారు. డీఎస్సీ పై నమోదైన కేసులను కూడా ఇదే రీతిలో నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ప్రభుత్వంలో రిపోర్టింగ్ అథారిటీ ఎవరు.. చంద్రబాబు నాయుడే. అందుకే తనపై నమోదైన కేసులన్నీ కొట్టేయించుకుంటూ తనకు క్లీన్ చిట్ వచ్చిందని తనకు తానుగా చెప్పుకుంటున్న దౌర్భాగ్య పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం.


