న్యూఢిల్లీ: ముంబై 1993 వరుస పేలుళ్ల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ అబూ సలేం ముందస్తు విడుదలకు చేసిన ప్రయత్నానికి సుప్రీంకోర్టు చెక్ పెట్టింది. 25 ఏళ్ల జైలు శిక్షను ఇప్పటికే పూర్తి చేశానంటూ సలేం దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం బాంబే హైకోర్టు ఏప్రిల్ 2026లో ఇచ్చిన తీర్పును సమర్థించింది.
పోర్చుగల్ నుంచి భారత్‌కు అప్పగించే సమయంలో అక్కడి ప్రభుత్వానికి భారత్ ఇచ్చిన హామీని సలేం తన పిటిషన్‌లో ప్రధానంగా ప్రస్తావించాడు. తనను భారత్‌కు అప్పగిస్తే మరణశిక్ష విధించబోమని, అలాగే 25 ఏళ్లకు మించి జైలులో ఉంచబోమని 2002లో భారత్ హామీ ఇచ్చిందని పేర్కొన్నాడు. 2005 నవంబర్ 11న అతడిని పోర్చుగల్ నుంచి భారత్‌కు తీసుకొచ్చారు. తాను విచారణ ఖైదీగా గడిపిన కాలం, శిక్ష అనుభవించిన కాలం, మంచి ప్రవర్తనకు లభించిన రిమిషన్ అన్నింటినీ కలిపితే 2025 మార్చి 31 నాటికే 25 ఏళ్లు పూర్తయ్యాయని సలేం వాదించాడు. అందువల్ల ఇకపై తనను జైలులో ఉంచడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ ముందస్తు విడుదల కోరాడు.
అయితే, ఈ వాదనను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. సలేం పిటిషన్ ముందుగానే దాఖలైందని, 25 ఏళ్ల వ్యవధి 2030లో పూర్తవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో సలేం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. గతంలో 2022లో ఇదే అంశంపై సుప్రీంకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది. సలేం 25 ఏళ్ల జైలు కాలాన్ని పూర్తి చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అతడి ముందస్తు విడుదలను నిర్ధారించాలని పేర్కొన్నప్పటికీ.. అతడి శిక్షను కమ్యూట్ చేయడం లేదని స్పష్టం చేసింది. పోర్చుగల్‌లో పాస్‌పోర్టు మోసం కేసులో గడిపిన జైలు కాలాన్ని 25 ఏళ్ల వ్యవధిలో లెక్కించరాదని కూడా తేల్చింది.
కాగా, అబూ సలేం 2002లో పోర్చుగల్‌లో అరెస్టయ్యాడు. 1993 ముంబై పేలుళ్ల కేసుతో పాటు మరో టాడా కేసులో అతడికి వరుసగా 2015, 2017లో జీవిత ఖైదు పడింది. ఈ నేపథ్యంలో 2025కే 25 ఏళ్లు పూర్తయ్యాయన్న అబూ సలేం వాదనను సుప్రీంకోర్టు తాజాగా తిరస్కరించడంతో.. తక్షణ విడుదలకు అతడి ప్రయత్నాలకు మరోసారి బ్రేక్ పడింది.
ఇదీ చదవండి: తమిళనాడులో సంచలనం.. స్టాలిన్‌కు బంపరాఫర్


